పరుగులు తీస్తున్న కృష్ణమ్మ ..జలకళతో శ్రీశైలం

భారీగా కురుస్తున్న వానలతో దేశంలోని పలు ప్రాంతాలు, రాష్ట్రాలు తల్లడిల్లి పోతున్నాయి. ఇప్పటికే జలదిగ్భందంలో చిక్కుకుని పలువురు మృతి చెందారు. మరి కొందరు వరద ఉధృతికి కొట్టుకు పోయారు. తెలంగాణాలో నదులు పొంగి  ప్రవహిస్తున్నాయి. మరో వైపు ప్రాజెక్టులు , ఎత్తిపోతల పథకాలు నిండు కుండల్ని తలపింప చేస్తున్నాయి. గోదావరి ఉగ్ర రూపం దాల్చితే ..కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కర్ణాటకలో భారీగా వర్షాలు  కురుస్తుండడంతో ఆల్మట్టి , నారాయణపూర్ జలాశయాలు పూర్తిగా నిండి పోయాయి. ప్రమాద స్థాయిని దాటాయి.

దీంతో నీటి పారుదల అధికారులు దిగువకు నీటిని వదులుతున్నారు. గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్ట్ నిండి పోయింది . ఇక్కడి అధికారులు గేట్లను తెరిచారు . శ్రీశైలం ప్రాజెక్ట్ కు భారీగా నీరు వచ్చి చేరుతుండడంతో అది కూడా నిండి పోయింది . ఏపీ మంత్రితో పాటు తెలంగాణకు చెందిన మంత్రులు శ్రీనివాస్ గౌడ్ , నిరంజన్ రెడ్డి , ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నాలుగు గేట్లను ఏపీ మంత్రి పూజలు చేసి తెరిచారు . దిగువన ఉన్న ఈ నీరు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు చేరుతుంది . ప్రాజెక్ట్ కింద ఉన్న ఆయకట్టుదారులకు కొంత ఉపశమనం లభిస్తుంది. ఇప్పటికే వసరహాలు రావడంతో రైతులు పొలాలు చదును చేసారు. వరి వేయక పోయినా కనీసం వాణిజ్య పంటలు , కూరగాయలు, అంతర పంటలు సాగు చేసేందుకు రెడీ అవుతున్నారు .

ఇప్పటి వరకు 4 గేట్లు ఎత్తి 1.06 లక్ష క్యూసెక్కుల వరద నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేశారు.మొదట 6వ నెంబర్‌ గేటను ఎత్తి, ఆ తర్వాత 7, 8, 9 గేట్లను ఎత్తారు. ఒక్కో గేటు 10 అడుగుల మేర 25వేల క్యూసెక్కుల చొప్పన మొత్తం 1.06 లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యామ్ గేట్లు ఎత్తడంతో శ్రీశైలం ప్రాజెక్టుకుపర్యాటకుల తాకిడి పెరగనుంది. వీకెండ్స్ కావడంతో కృష్ణమ్మ పరవళ్లను కళ్లారా చూసేందుకు పర్యాటకులు భారీగా తరలి వెళ్లనున్నారు. ఎగువ నుంచి వరద కొనసాగడంతో పాటు కర్నాటక, మహారాష్ట్రలో ఇంకా వర్షాలు కురుస్తుండడంతో…శ్రీశైలం డ్యామ్‌కు వరద ఇలాగే కొనసాగనుంది. 

కామెంట్‌లు