అంకురాల‌కు వెస‌లుబాటు - ఎస్‌బిఐ తోడ్పాటు..!

గొప్ప గొప్ప ఆలోచ‌న‌లు ఎక్క‌డి నుంచో ఊడి ప‌డ‌వు. ఎవ‌రో చెబితే రావు. మెంటార్స్, ట్రైన‌ర్స్‌, టీచ‌ర్స్‌, లెక్చ‌ర‌ర్స్‌, స్వామీజీలు, పేరెంట్స్ ..నుంచి నేర్చుకుంటే అస‌లే వ‌ర్క‌వుట్ కావు. గుండెలు మండిపోతే..మెద‌ళ్లకు ఒత్తిడి అంటూ పెరిగి పోతే, అవ‌కాశాల దారులు మూసుకుపోతే, ఒంట‌రిగా ఒక్క‌రే ఆలోచిస్తూ..ప్ర‌పంచానికి దారులు చూపించే ఏ ఒక్క ఐడియానైనా క్రియేట్ చేసుకోగ‌లిగితే చాలు. ఇంకేముంది ఎవ్వ‌రి వాకిళ్ల‌లోకి వెళ్లాల్సిన ప‌నిలేదు. ఇంకొక‌రి ద‌యాదాక్షిణ్యాల‌పై బ‌త‌కాల్సిన ఖ‌ర్మ అంటూ వుండ‌దు. ఒక‌ప్పుడు పెట్టుబ‌డి కావాలంటే, రుణాలు పొందాలంటే నానా ఇక్క‌ట్లు. లంచాలు ఇవ్వాలి, అడుక్కోవాలి. కానీ ఇప్పుడా దుర్భ‌ర‌మైన ప‌రిస్థితులు లేవు. మీకంటూ ఓ ఐడియా వుంటే , అది స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డేలా ఉంటే, క‌నీసం ప‌ది మందికైనా లైఫ్ ఇవ్వ‌గ‌లిగితే చాలు..ఇంకేమీ అక్క‌ర్లేదు . మీ కోసం వేలాది సంస్థ‌లు, బ్యాంకులు, ప్ర‌భుత్వాలు కాచుకుని ఉన్నాయి. కావాల్సింద‌ల్లా మీ మీద మీకు న‌మ్మ‌కం.

స‌క్సెస్ అవుతుంద‌న్న ప‌ట్టుద‌ల ఉంటే ..మీ చెంత‌కే కాసులు వాలిపోతాయి. మీ బ్యాంకు ఖాతాలో డ‌బ్బులు జ‌మ అవుతాయి. డ‌బ్బులు ఒకే చోట వుంటే ఏం లాభం. అవి చేతులు మారుతూ వుంటే మ‌రికొంద‌రిని ఆదుకుంటాయి. వారి కాళ్ల మీద వాళ్లు నిల‌బడేలా మార్గాన్ని ఏర్పాటు చేస్తాయి. ఆ దిశ‌గా ఇండియాలో ఇప్ప‌టికే ఎష్టాబ్లిష్ అయిన దిగ్గ‌జ కంపెనీల‌న్నీ స్టార్ట‌ప్‌ల‌కు బాస‌ట‌గా నిలుస్తున్నాయి. కోట్లాది రూపాయ‌లు పెట్టుబ‌డిగా పెడుతున్నాయి. అలాంటి వాటి నుంచి సాయం పొందిన అంకుర సంస్థ‌లు ఇవాళ డాల‌ర్ల‌ను కొల్ల‌గొడుతున్నాయి. ఓలా, ఊబ‌ర్, దోశా ప్లాజా, ఎనీ టైం లోన్, ఇలా చెప్పుకుంటూ వేలాది స్టార్ట‌ప్‌లు స‌క్సెస్‌ఫుల్ గా న‌డుస్తున్నాయి. వేలాది మందికి ప్ర‌త్య‌క్షంగా , ప‌రోక్షంగా ఉపాధి క‌ల్పిస్తున్నాయి. కొంత మేర‌కు ప్ర‌భుత్వాలు , ప్రైవేట్ సంస్థ‌లు చేయ‌లేని ప‌నిని త‌మ భుజాల‌కు ఎత్తుకున్నాయి. అంకుర సంస్థ‌లు వ్యాపార ప‌రంగా, ఆదాయ ప‌రంగా దూసుకెళుతుండ‌డంతో బ్యాంకింగ్ రంగంలో ప్ర‌థ‌మ స్థానంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటిపై దృష్టి పెట్టింది.

స్టార్ట‌ప్‌ల‌కు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు హైద‌రాబాద్‌లో ఎస్‌బిఐ ఇన్‌క్యూబ్ స్టార్ట‌ప్ లాంజ్‌ను ప్రారంభించింది. ట్రిపుల్ ఐటీ క్యాంప‌స్‌లో దీనిని ఏర్పాటు చేసింది. నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌కు అంకురాలు ప‌రిష్కారం చూపిస్తున్నాయ‌ని, వాటికి అవ‌స‌ర‌మైన ఆర్థిక స‌హ‌కారం అందించేందుకు ఎస్‌బిఐ ముందుకు వ‌స్తోంద‌ని జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ ఓం ప్ర‌కాశ్ వెల్ల‌డించారు. దీని కోసం ట్రిపుల్ ఐటీతో క‌లిసి ప‌నిచేస్తున్న‌ట్లు తెలిపారు. ఆర్థిక సాయం కోసం స్టార్ట‌ప్ నిర్వాహ‌కులు బ్యాంకుల వ‌ద్ద‌కు వెళ్ల‌కుండా వారి చెంత‌కే బ్యాంక‌ర్ ను తీసుకు వ‌చ్చే ల‌క్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. ఫిన్ టెక్ విభాగంలో అంకుర సంస్థ‌ల‌కు పెట్టుబ‌డులు అందించేందుకు ఎస్‌బిఐ 200 కోట్లు కేటాయించింద‌ని , దీనిని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని వృధ్దిలోకి రావాల‌ని ఆకాక్షించారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!