కాలేజీ యాజమాన్యాలకు సుప్రీం ఝలక్ - అడ్డగోలు ఫీజుల పెంపుపై ఆగ్రహం
నిన్నటి దాకా అడ్డగోలుగా ..తమ ఇష్టానుసారం ఫీజులను పెంచుకుంటూ పోయిన తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాల అడ్డగోలు దందాలకు సుప్రీంకోర్టు ధర్మాసనం ఝలక్ ఇచ్చింది. ప్రతి ఏడాది హద్దు పద్దు అంటూ లేకుండా కూరగాయల మార్కెట్‌లో ధరలు పెంచినట్టుగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను వారి తల్లిదండ్రులను నానా ఇబ్బందులకు గురి చేస్తూ వస్తున్న ఈ నయా దందాకు చెక్ పెట్టింది. ఆయా కాలేజీల మేనేజ్‌మెంట్‌లు ఓ వైపు ఫీజు రీయింబర్స్ మెంట్ ను పొందుతూనే మరో వైపు దొడ్డిదారిన నియంత్రలేని ఫీజులను ..బాజాప్తాగా వసూళ్లకు పాల్పడుతున్న నయా దోపీడికి అడ్డుకట్ట వేసింది. ఈ రాష్ట్రంలో కేజీ టు పీజీ అంటూ ఊదరగొడుతున్న సర్కార్‌కు కూడా ఓ రకంగా దెబ్బ పడినట్టే. ఆయా కాలేజీలన్నీ అన్ని పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులకు , వారి బంధువులకు, పార్టీల అనుచరులకు చెందినవే ఉన్నాయి.
అసలు విద్యాశాఖ ఉందో లేదో తెలియని పరిస్థితి. రెండోసారి అధికారంలోకి వచ్చినా నేటికీ ఆయా యూనివర్శిటీల్లో, కాలజీల్లో ఇప్పటి వరకు వేలాది ఖాళీలు ఉన్నా భర్తీ చేసిన పాపాన పోలేదు. ఉన్నత విద్యా మండలి ఇప్పటి దాకా ఆయా ఇంజనీరింగ్ కాలేజీల్లో మౌళిక వసతులు, బోధనకు సరిపడా సిబ్బంది, నాన్ టిచింగ్ స్టాఫ్ పనిచేస్తున్నారా లేదా అని పరిశీలించిన పాపాన పోలేదు. ఓ వైపు ఇంటర్ బోర్డు నిర్వాకం ...మరో వైపు ఇంజనీరింగ్ కాలేజీల దందా దెబ్బకు చదువు కోవాలంటేనే స్టూడెంట్స్ జంకుతున్నారు. వేలకు వేలు అప్పులు చేసి వడ్డీలు కట్టలేక పేరెంట్స్ లబోదిబోమంటున్నారు. హైదరాబాద్‌కు చెందిన వాసవి, శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీల మేనేజ్‌మెంట్లు సుప్రీంకోర్టుకు వెళ్లాయి. తాము కాలేజీలు నడపలేమని, నిర్వహణ భారం ఎక్కువైందని అందుకే ఫీజులను అడ్డగోలుగా పెంచుకునేందుకు అనుమతి ఇవ్వమని పిటిషన్ వేశాయి.
ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ఫీజుల పెంపుపై హైకోర్టు ఎందుకు జోక్యం చేసుకుందో అర్థం కావడం లేదు. ఈ అంశం పూర్తిగా విద్యార్థులకు సంబంధించినది, దీని కోసం కాలేజీలపై ఆజమాయిషీ చేసేందుకు నియంత్రణ కమిటీ అనేది ఒకటి ఏర్పాటై ఉందని, ఇదంతా దానిపైనే ఆధారపడి ఉంటుందని మధ్యలో మీరెందుకు కలుగ జేసుకున్నారంటూ అక్షింతలు వేసింది. మీ ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోవడానికి ఇదేమన్నా మార్కెట్ కాదుగా అని ప్రశ్నించింది. దీంతో నిన్నటి దాకా భయపడిన పిల్లలు కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఇంజనీరింగ్, ఫార్మసీ, బిఇడీ, లా, ఎంబిఏ , తదితర కాలేజీలకు ప్రతి మూడేళ్లకు ఒకసారి టిఏఎఫ్ఆర్‌టీసీ వార్షిక రుసుములను ఖరారు చేస్తుంది. ఈ కమిటీ 2016-2017, 2017-2018, 2018-2019 విద్యా సంవత్సరాలకు ఫీజులను నిర్ణయించింది.
అయితే వీటిని మేం ఒప్పుకోమని, మా ఇష్టానుసారం పెంచుకునేలా తీర్పు ఇవ్వండంటూ ఆయా కాలేజీల యాజమాన్యాలు 2016లో హైకోర్టుకు వెళ్లాయి. వాదనలు విన్న న్యాయస్థానం కాలేజీలు ప్రతిపాదించుకున్న రుసుములు వసూలు చేసుకోవచ్చంటూ తీర్పు చెప్పింది. భారీగా పెంచడంతో పేరెంట్స్ ఆందోళనకు గురయ్యారు. పేరెంట్స్ అంతా కలిసి కమిటీ గా ఏర్పడ్డాయి. ఉన్నత విద్యా మండలి కలిసి సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. పిటీషన్‌పై సుదీర్ఘంగా విచారించిన జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఏప్రిల్ `10న తీర్పు ను రిజర్వ్‌లో ఉంచగా, జస్టిస్ నవీన్ సిన్హా తీర్పు చెప్పారు. దీంతో అడ్డగోలు ఫీజులకు నియంత్రణ పడినట్లయింది. పెంచాలన్నా లేక తగ్గించాలన్నా నియంత్రణ మండలికే అధికారం ఉంటుందని స్పష్టంగా పేర్కొంది. చదువు అనేది వ్యాపారం కాదు అది జీవితాన్ని వెలిగించే దిశగా సాగాలి తప్పా ..ఇలా ఫీజులతో కాదంటూ మెట్టికాయలు వేసింది. ఇప్పటికైనా ఫీజుల దందాకు చెక్ పెట్టాలి. విద్యార్థులు చదువుకునేందుకు సహాయ పడాలి

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి