దిగ్గ‌జాల మ‌ధ్య కుద‌ర‌ని స‌యోధ్య - అనుమానం - సంక్షోభం - క‌ర్నాట‌కం..!

క‌న్న‌డ నాట రాజ‌కీయం మ‌ళ్లీ ముదిరి పాకాన ప‌డింది. ఇపుడో రేపో అంటూ రోజుకో ట్విస్ట్‌లు వ‌స్తూనే వున్నాయి. మ‌రో వైపు లీకులు, ఊహాగానాలు తెర మీద‌కు వ‌చ్చాయి. సామాజిక మాధ్య‌మాల్లో ఇక సంకీర్ణ స‌ర్కార్‌కు నూక‌లు చెల్లాయంటూ అప్పుడే కామెంట్స్ కూడా మొద‌ల‌య్యాయి. ఇంత జ‌రుగుతున్నా ట్ర‌బుల్ షూట‌ర్స్ గా పేరొందిన డీకే శివ‌కుమార్, మాజీ పీసీసీ అధ్య‌క్షుడు, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గేలు మాత్రం కూల్‌గా అలాంటిది ఏమీ లేద‌ని, త్వ‌ర‌లోనే సమ‌స్య స‌ద్దుమ‌ణుగుతుంద‌ని సెల‌విచ్చారు. మ‌రో వైపు అమెరికా టూర్‌లో ఉన్న సంకీర్ణ స‌ర్కార్ సీఎం , దేవెగౌడ కుమారుడు కుమార స్వామి హుటా హుటిన బెంగ‌ళూరుకు తిరిగి వ‌చ్చారు. ఆయ‌న ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలిస్తున్నారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు మాత్రం ఎంచ‌క్కా ముంబ‌యిలో సేద తీరుతున్నారు. మొత్తం మీద దేశంలో ఇపుడు క‌న్న‌డ నాట నెల‌కొన్న తాజా ప‌రిణామాలు మ‌రింత ఆస‌క్తిని రేపుతున్నాయి. సందిట్లో స‌డేమియా అన్న చందంగా రిజైన్ డ్రామా ఆడుతున్న వారి కోర్కెలు తీర్చ‌లేనివిగా ఉండ‌డంతో ఏం చేయాలో పాలుపోక దేవెగౌడ మౌనం వ‌హించారు. దీనికంత‌టికి కార‌ణం సిద్ధిరామ‌య్యేనంటూ కారాలు మిరియాలు నూరుతున్నారు.

నిన్నటి దాకా ఈ రాజ‌కీయ దిగ్గ‌జాలు క‌లిసి స‌ర్కార్ ఏర్పాటు చేస్తున్న‌ట్లు మీడియా సాక్షిగా ప్ర‌క‌టించారు. తీరా ఈ ప్ర‌భుత్వం మూడు నాళ్ల ముచ్చ‌ట‌గా మిగిలిపోయేలా ప్ర‌మాదం కొని తెచ్చుకుంటోంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఓ వైపు బీజేపీ కర్నాట‌క‌లో నెల‌కొన్న పొలిటిక‌ల్ మార్పుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు కేంద్ర హైక‌మాండ్ నిశితంగా ప‌రిశీలిస్తోంది. ఏ మాత్రం అవ‌కాశం ఉన్నా , స్టేట్‌లో త‌మ పార్టీకే అతి పెద్ద మెజారిటీ ఉంద‌ని, ఇక త‌మ‌ను గ‌వ‌ర్న‌ర్ ప్ర‌భ‌/త‌్వం ఏర్పాటు చేసేందుకు పిలుపు ఇస్తుంద‌నే ఆశాభావంతో ఉన్నారు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు య‌డ్యూర‌ప్ప‌. దేశ వ్యాప్తంగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో క‌మ‌లం ఊహించ‌ని రీతిలో ప‌వ‌ర్‌లోకి వ‌చ్చింది. 25 లోక్‌స‌భ స్థానాల‌కు క‌ర్నాట‌క‌లో ఎంపీ సీట్ల‌కు ఎన్నిక‌లు జ‌రిగితే అందులో బీజేపీ సంకీర్ణ స‌ర్కార్‌కు ఊహించ‌ని రీతిలో షాక్ ఇచ్చింది. ఏకంగా 22 స్థానాల‌ను చేజిక్కించుకుంది. త‌న‌కు ఎదురే లేదంటూ తేల్చి చెప్పింది. అయితే త‌మ‌కు వ‌చ్చిన ముప్పేమీ లేదంటూ కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్‌లు స్ప‌ష్టం చేశాయి.

అసెంబ్లీ రాజ‌కీయాలు వేరు..లోక్‌స‌భ ఎన్నిక‌లు వేరు. త‌మ సంకీర్ణ ప్ర‌భుత్వానికి వ‌చ్చిన ముప్పేమీ లేదంటూ సిద్దిరామ‌య్య‌, కుమార స్వామిలు ప్ర‌క‌టించారు. ఒకానొక స‌మ‌యంలో ఈ భారాన్ని మోయ‌లేనంటూ సీఎం కుమార స్వామి జ‌నం సాక్షిగా ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న వాపోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లుగ చేసింది. త‌మిళ‌నాడు, తెలంగాణ రాజ‌కీయాలు వేరు..క‌న్న‌డ రాజ‌కీయాలు భిన్నంగా వుంటాయి. ఇక్క‌డ లింగాయ‌త్‌ల క‌మ్యూనిటీ ప్రాబ‌ల్యం ఎక్కువ‌. గుళ్లు, గోపురాల‌కంటే స్వామీజీల ప్ర‌భావం ఎక్కువ‌. సంక్షోభం తారా స్థాయికి చేరిన స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి మాజీ ప్ర‌ధాని, జేడీఎస్ అధ్య‌క్షుడు దేవెగౌడ బాంబు పేల్చారు. దీనికంతటికి కార‌ణం సిద్దిరామ‌య్యేనంటూ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. వీరిద్ద‌రి మ‌ధ్య ఉన్న వ్య‌క్తిగ‌త శ‌త్రుత్వం తెర‌పైకి వ‌చ్చింది. రాజీనామాలు స‌మ‌ర్పించిన 14 మంది ఎమ్మెల్యేల‌లో అధిక శాతం సిద్దిరామ‌య్య అనుచ‌ర వ‌ర్గ‌మేనంటూ ఆరోపించారు. డీకే శివ‌కుమార్ ..దేవెగౌడ్‌ను క‌లిసిన స‌మ‌యంలోను ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేసిన‌ట్లు స‌మాచారం.

కాగా కొంద‌రు అస‌మ్మ‌తి ఎమ్మెల్యేలు సిద్దిరామ‌య్య‌ను సీఎంగా చూడాల‌ని అనుకుంటున్నార‌ని డీకే స్ప‌ష్టం చేయ‌డంతో ..దేవెగౌడ అందుకు స‌సేమిరా అన‌డంతో పాటు వీలైతే త‌మ పార్టీ మ‌ద్ధ‌తు ఉప‌సంహ‌రించు కునేందుకు సిద్ధమేనంటూ తేల్చి చెప్పిన‌ట్లు వార్త‌లు గుప్పుమ‌న్నాయి. సంకీర్ణ స‌ర్కార్ ఏర్పాటు చేసిన‌ప్ప‌టి నుంచి వెనుక నుంచి సిద్ధిరామ‌య్య త‌న డ్రామాను ఆడుతూనే ఉన్నారు. ఆయ‌న‌కు ప్ర‌భుత్వ ప‌నితీరుపై కంటే సీఎం ప‌ద‌విపైనే క‌న్ను ఉంది. అలాంట‌ప్పుడు ఇలాంటి రాజ‌కీయాలే చేస్తారంటూ దేవెగౌడ ఆరోప‌ణ‌లు చేశారు. మ‌రో విష‌యం ఏమిటంటే మ‌ధ్యే మార్గంగా మ‌ల్లికార్జున ఖ‌ర్గే ను క‌నుక సీఎం ప‌ద‌వికి ఎంపిక చేస్తామంటే పున‌రాలోచిస్తామ‌ని అన్న‌ట్టు స‌మాచారం. వీరిద్ద‌రి శ‌త్రుత్వం 2005లో మొద‌లైంది. జేడీఎస్ ను నామ రూపాలు లేకుండా చేస్తానంటూ అప్ప‌ట్లో సిద్ది రామ‌య్య స‌వాల్ చేశారు. జేడీఎస్ నుండి కాంగ్రెస్‌లో చేరారు. అప్ప‌టి నుంచి నేటి దాకా వీరిద్ద‌రి మ‌ధ్య వ్య‌క్తిగ‌త విభేదాలు అలాగే ఉంటూ వ‌చ్చాయి. తీరా ఇప్ప‌టి సంకీర్ణ స‌ర్కార్ సంక్షోభంపై మ‌రింత ప్ర‌భావం చూపేలా చేస్తున్నాయి. మొత్తం మీద క‌ర్నాట‌క పాలిటిక్స్ తీరుతో మీడియా పండ‌గ చేసుకుంటోంది. 

కామెంట్‌లు