ఆట కంటే ఆదాయంపైనే మ‌క్కువ‌..ఫ్యాన్స్ కు శ‌ఠ‌గోపం..ఆనందంలో ఆట‌గాళ్లు..!

ప్ర‌పంచ క‌ప్ టోర్న‌మెంట్‌లో టీమిండియా క‌థ ముగిసింది. క‌మాన్ ఇండియా అంటూ ఇచ్చిన పిలుపున‌కు మ‌న క్రికెట‌ర్లు ఇంకెందుకు క‌ష్ట‌ప‌డాలంటూ దుకాణం స‌ర్దేశారు. నిన్న‌టి దాకా హీరోలుగా ..దేవుళ్లుగా నీరాజ‌నాలు అందుకున్న ఆట‌గాళ్లు ఇపుడు బేల చూపులు చూస్తున్నారు. దేశం ఏమై పోయినా ప‌ర్వాలేదు..100 కోట్ల‌కు పైగా ఉన్న భార‌త‌దేశంలో ..దేనినైనా భ‌రిస్తారు కానీ భార‌త క్రికెట్ జ‌ట్టు ఓడిపోతే స‌హించ‌లేరు. ఎందుకంటే ..క్రికెట్టే ఇక్క‌డ ఊపిరి క‌నుక‌. జాతి అంతా దానితో మ‌మేక‌మై పోయింది క‌నుక‌. ఎంతగా చెప్పుకున్నా ఈ ఒకే ఒక్క ఆట ఇండియాను ఒక్క‌టిలా చేస్తుంది. ఏ ఆయుధాలు ప్ర‌యోగించాల్సిన ప‌నిలేదు..ఏ అధికారిక ఆజమాయిషీ అక్క‌ర్లేదు. క్రికెట్‌తో ఆటలాడుకుంటే చాలు..అంద‌రినీ కంట్రోల్‌లో ఉంచ‌వ‌చ్చు. అందుకే కేంద్రంలో, దేశంలోని ఆయా రాష్ట్రాల‌లో ఏ పార్టీ ప‌వ‌ర్‌లో ఉన్నా స‌రే..అంద‌రి జ‌ప‌మంతా ఒక్కటే ..క్రికెట్ . దానిపై ఉన్నంత మోజు..సామాన్య ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై ఉండ‌దు. ఎందుకంటే ఓట్లేసి గెలిపించి కూర్చోబెట్టాం క‌నుక‌.

ప్ర‌పంచంలోనే అత్య‌ధిక ఆట‌గాళ్ల‌ల్లో స‌గ‌టున ఆదాయం లెక్కిస్తే మ‌న క్రికెట‌ర్లు స‌చిన్, కోహ్లి, ధోనీ, త‌దిత‌ర ఆట‌గాళ్లు సంపాదించింది లెక్క‌ల్లోకి తీసుకుంటే క‌ళ్లు బైర్లు క‌మ్ముతాయి. వీరికి క్రికెట్ ఆట కంటే అద‌నంగా వ‌చ్చే ఆదాయంపైనే మ‌క్కువ ఎక్కువ‌. మ‌న వాళ్లు ఆరంభ శూరులు. ఎప్పుడు ఆడ‌తారో..ఎపుడు జెండా ఎత్తేస్తారో ఎవ‌రికీ అర్థం కాదు. ఎందుకంటే వీరిపై ఆజ‌మాయిషీ ఎవ‌రికీ ఉండ‌దు క‌నుక‌. జాతి కోసం కుటుంబాల‌ను వ‌దిలి వేసి..దేశ స‌రిహ‌ద్దుల్లో ప్రాణాలు కోల్పోతున్న సైనికుల గురించి మ‌నం ఆలోచించం. ఏ ఒక్క క్రికెట‌ర్ అయినా ఎక్క‌డికైనా వ‌స్తే, సంద‌ర్శిస్తే చాలు మీడియా అంతా హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఎక్క‌డ‌లేని ప్ర‌చారం ఇస్తుంది. కార్పొరేట్ దందా క్రికెట్ లోకి ఎంట‌రైంది. దీంతో దీని ఆట స్వ‌రూప‌మే మారి పోయింది. ఆయా కంపెనీల న‌యా రాజ‌కీయం ఇపుడు ఐసీసీని సైతం శాసిస్తోందంటే న‌మ్మ‌గ‌ల‌మా. ఒక్కో క్రికెట‌ర్‌కు దేశ ప్ర‌ధానికంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది..అంత‌కు మించి పాపులారిటీ ద‌క్కుతోంది.

లెక్క‌లేనంత డ‌బ్బులు..లెక్కించ‌లేనంత ఆదాయం..రోజుకు కోట్ల‌కు పై మాటే. ఎక్క‌డికి వెళ్లాల‌న్నా ..ప్ర‌పంచాన్ని చుట్టి రావాల‌న్నా ..త‌రాల‌కు స‌రిపోయేంత‌టి కోట్లు..వెంట వ‌చ్చే సెల‌బ్రెటీలు..చుట్టు ముట్టే అభిమానులు..ఇంకేం ప‌డుకోవ‌డానికి హోట‌ళ్లు..రిసార్ట్‌లు..శ‌రీరం అలిసి పోతే సేద తీర్చేందుకు తీర్థం..ప్ర‌సాదాలు కూడా ఉంటాయి. అవ‌స‌ర‌మైతే..ప‌క్క‌న మ‌సాజ్ చేసేందుకు కూడా రెడీగా ఉంటారు. ఎన్నో వ‌ర్గాలు..మ‌రెన్నో రాజ‌కీయాలు ఇండియ‌న్ క్రికెట్ మీద‌. ఒకానొక ద‌శ‌లో భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు మేం ప‌రిధిలోకి రామంటూ కేంద్ర స‌ర్కార్‌ను ప‌ట్టించు కోలేదు. న‌యం..మేమే రాజులం అని లేదు. అందుకే భార‌తీయ అత్యున్న‌త న్యాయ‌స్థానం ..చెంప పెట్టులాంటి తీర్పు ఇచ్చింది. ఈ దేశంలో ఎవ‌రైనా బ‌త‌కాల‌న్నా..లేక ఏ సంస్థ కానీ ఏ కంపెనీ కానీ ఉండి ఉండ‌వ‌చ్చు కాక‌..డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ ర‌చించిన రాజ్యాంగం ప్ర‌కారం ..భార‌త ప్ర‌భుత్వ ఆధీనంలో ఉండాల్సిందేనంటూ స్ప‌ష్టం చేసింది. దీంతో బీసీసీఐకి దిమ్మ తిరిగింది. త‌మ‌ను క్ష‌మించ‌మంటూ వేడుకొంది. త‌న త‌ప్పును  స‌రిదిద్దుకుంది. క్రికెట‌ర్లు కూడా మ‌నుషులేన‌ని గుర్తిస్తే ఇలాంటి భావోద్వేగాల‌కు లోనుకాము. మొత్తం మీద కోట్లాది ప్ర‌జ‌ల ఆశ‌ల‌ను వ‌మ్ము చేసిన భార‌తీయ క్రికెట‌ర్లు మ‌న‌కొద్దు. క్రికెట్‌ను ప్రేమిద్దాం..ఆస్వాదిద్దాం. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!