అందరి చూపు కన్నయ్య వైపు
మేధావిగా..అద్భుతమైన స్పీకర్‌గా ..జెఎన్‌యు లీడర్‌గా పేరు తెచ్చుకున్న కన్నయ్య కుమార్ ఇపుడు ఎన్నికల బరిలో నిలబడ్డారు. ఒంటరి పోరాటం సాగిస్తున్నారు. విలువైన ఓటును అమ్ముకోవద్దని..నిజాయితీకి పట్టం కట్టండని ఆయన కోరుతున్నారు. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వయసులో చిన్నోడైనా చదువులో గట్టోడు. జెఎన్‌యు స్టూడెంట్స్ యూనియన్‌కు ఇంతకు ముందు ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ కు నాయకుడిగా ఉన్నారు. ఈ విద్యార్థి సంస్థ సీపీఐకి అనుబంధంగా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి లో డాక్టరేట్ డిగ్రీ అందుకున్నారు కన్నయ్య కుమార్. బీహార్ ..బెగసూరై జిల్లా బిహాత్ గ్రామంలో జనవరి 1987లో జన్మించారు.
తెగ్రా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది కన్నయ్య స్వంతూరు. కన్నయ్య తల్లి మీనాదేవి అంగన్‌వాడి టీచర్‌గా పనిచేస్తోంది. అన్న మనికాంత్ అస్సాంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తారు. కన్నయ్య కుటుంబీకులంతా సిపిఐ పార్టీకి సపోర్టర్స్‌గా ఉన్నారు. ఆఫ్రీకన్ స్టడీస్ పై జెఎన్‌యులో పీహెచ్‌డి చేశారు. కాలేజీ ఆఫ్ కామర్స్ లో చదువుతుండగానే పాలిటిక్స్‌లో చురుకుగా పాల్గొన్నారు. ఏఐఎస్ ఎఫ్ లో జాయిన్ అయ్యాడు. నలంద ఓపెన్ యూనివర్శిటీలో ఎంఏ సోషియాలజీ చేశారు. 2015లో కన్నయ్య కుమార్ ఏఐఎస్ ఎఫ్ నుండి జెఎన్‌యు స్టూడెంట్ యూనియన్‌కు ప్రెసిడెంట్‌గా ఎన్నికై రికార్డు సృష్టించాడు. జెఎన్‌యులో ఏబీవిపి, ఎస్ ఎఫ్ ఐ, ఎన్ ఎస్‌యుఐ విద్యార్థి సంఘాలు బరిలో ఉన్నా కన్నయ్య నాయకుడిగా ఎదిగారు. బీహార్ టు తీహార్ పేరుతో ఓ పుస్తకాన్ని ప్రచురించారు. 2018లో సీపీఐ నేషనల్ కౌన్సిల్ మెంబర్‌గా ఎంపికయ్యారు.
సమస్యలపై నిలదీయడం, వివిధ ప్రాంతాలు పర్యటించడం, బీజేపీ సర్కార్‌పై తీవ్ర ఆరోపణలు చేయడంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చట్ట సభల్లోకి వస్తేనే ప్రజలకు ఏదైనా సేవ చేసేందుకు వీలవుతుందని కన్నయ్య కుమార్ తలంచారు. ఈసారి ఎన్నికల బరిలో నిలిచారు. దేశమంతా ఒక ఎత్తయితే..బీహార్‌లోని బెగవరాయ్ మాత్రం డిఫరెంట్. ఎందుకంటే ఇక్కడే విద్యార్థి నాయకుడు కన్నయ్య ఎన్నికల్లో పోటీకి దిగారు. నిన్నటి మొన్నటి దాకా ఈ పేరు ఎవరికీ తెలియదు. కానీ జెఎన్‌యు విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య పోటీ చేయడంతో ఒక్కసారిగా దేశమంతటా చర్చనీయాంశమైంది ఈ నియోజకవర్గం. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేస్తున్నారు కన్నయ్య. కేంద్ర మంత్రి కన్నయ్యపై పోటీకి దిగారు.
ఈ నియోజకవర్గంలో 17.18 లక్షల ఓటర్లుండగా 9 లక్షల 49 వేల మంది పురుష ఓటర్లు, 8 లక్షల 28 వేల మంది మహిళా ఓటర్లున్నారు. బెగువ రాయ్ నియోజకవర్గం వామపక్ష పార్టీలకు కంచుకోట. ఇపుడు సీన్ మారింది. అన్ని పార్టీలు దీనిపై పట్టు సాధించాలని చూస్తున్నాయి. పూర్వ వైభవాన్ని తీసుకు రావాలని పట్టుపట్టి కన్నయ్య కుమార్‌ను బరిలోకి దింపింది సీపీఐ పార్టీ. కన్నయ్యకు మహా కూటమి మద్ధతు ఉంటుందని భావించారు. కానీ అనుకోని పరిస్థితుల్లో ఆ మద్ధతు రాకుండా పోయింది. ఎలాగైనా సరే కన్నయ్య కుమార్‌ను గెలిపించాలనే పట్టుదలతో సీపీఐ ప్రయత్నం చేస్తోంది.
బీజేపీ సర్కార్ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌ను కన్నయ్యకు వ్యతిరేకంగా నిలిపింది. సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా, సీపీఎం నేత సీతారాం ఏచూరి వంటి ఉద్దండులు కన్నయ్యకు మద్ధతుగా ప్రచారం చేస్తున్నారు. వీరితో పాటు మేధావులు, కళాకారులు, రచయితలు, వివిధ రంగాలకు చెందిన వారు కన్నయ్యకు స్వచ్ఛంధంగా ప్రచారం చేస్తున్నారు. ప్రముఖ నటి షబానా ఆజ్మీ, రచయిత జావెద్ ఆక్తర్, స్వర్ణ బాస్కర్ వంటి బాలీవుడ్ ప్రముఖులు కన్నయ్య వెంటే ఉన్నారు. నువ్వా నేనా అన్న రీతిలో పోటా పోటీగా ఇక్కడ ప్రచారం కొనసాగుతోంది. ఓ వైపు సింగ్ మరో వైపు కన్నయ్యల మధ్య వార్ మొదలైంది. ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారో అన్నదే త్వరలో తేలుతుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి