బిత్తిరి స‌త్తి స్వ‌రం - ప‌ల్లెత‌న‌పు ప‌రిమిళం


తెలంగాణ ప్రాంతానికి ఎన‌లేని చ‌రిత్ర ఉన్న‌ది. ఘ‌న‌మైన క‌థ ఉన్న‌ది. దీని గురించి చెప్పాలంటే ఏడాదికి పైగా అవుతుంది. పోరాటాల‌కు, త్యాగాల‌కు పెట్టింది పేరు. ఒక‌ప్పుడు ఈ పేరు చెబితే నిషేధం. కానీ ఇపుడు ప్ర‌పంచపు మైదానం మీద ఎగురుతున్న ప‌తాకం తెలంగాణ‌. యాస‌, భాష‌, సంస్కృతి అన్నీ ఇపుడు మారి పోయాయి. ప్ర‌తి ఒక్క‌రు మ‌న ప్రాంత‌పు భాష‌ను నేర్చుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు ల‌క్ష‌లాది మంది. వ్యాపారం రాదు.వ్య‌వ‌హారం తెలియ‌దు అనే వాళ్లు. కానీ ఇపుడు సీన్ మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డాక‌..వ‌ర‌ల్డ్ వైడ్‌గా తెలంగాణ విస్మ‌రించ‌లేని ప‌దంగా మారింది. అంత‌టి చ‌రిత్ర త‌న స్వంతం చేసుకుంది ఈ నేల‌. ఈ మ‌ట్టిలో ఏదో మ‌హ‌త్తు దాగి ఉన్న‌ది. వేలాది మంది త‌మ మేధ‌స్సును ఈ ప్ర‌పంచ‌పు దారుల్లో న‌డుస్తూనే ఉన్నారు. త‌మ ఆలోచ‌న‌ల‌కు ప‌దును పెడుతున్నారు. త‌మ‌ను తాము నిరూపించుకుంటున్నారు.

కొత్త కొత్త ఆవిష్క‌ర‌ణ‌లతో తెలంగాణ‌కు ..దాని గుండె కాయ‌గా మిగిలి పోయిన హైద‌రాబాద్‌కు ఎన‌లేని కీర్తిని తీసుకు వ‌స్తున్నారు. లెక్క‌కు మించి ప్ర‌తిభ క‌లిగిన వారంతా మోత మోగిస్తున్నారు. క‌ళాకారులు, గాయ‌నీ గాయ‌కులు , ర‌చ‌యిత‌లు , ద‌ర్శ‌కులు, డ‌బ్బింగ్ ఆర్టిస్టులు , యాంక‌ర్లు..ఇలా ప్ర‌తి రంగానికి చెందిన వారంతా ఏదో ఒక ప్ర‌తిభ‌తో రాణిస్తున్నారు. త‌మ‌దైన శైలిలో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తెలుగు సినిమా రంగంలో తెలంగాణ ప‌ట్ల చిన్న చూపు నేటికీ కొన‌సాగుతూనే ఉన్న‌ది. ప్రాంతాలుగా వీడి పోయాక కొంత ప‌రిస్థితిలో మార్పు చోటుచేసుకుంది. ఇది శుభ ప‌రిణామం. చాలా మంది ఈ ప్రాంతానికి చెందిన వారు డైరెక్ట‌ర్లుగా దుమ్ము రేపుతున్నారు. వారిలో వంశీ పైడిప‌ల్లి, హ‌రీష్ శంక‌ర్ లాంటి వారుంటే..సుద్దాల అశోక్ తేజ‌, చంద్ర‌బోస్‌, వ‌రికుప్ప‌ల యాద‌గిరి, కాస‌ర్ల శ్యాం, త‌దిత‌రులు పాట‌ల ర‌చ‌యిత‌లుగా పేరు తెచ్చుకున్నారు.

మ‌రో వైపు తెలుగు టీవీల‌లో మొనాట‌నీ వ‌చ్చాక ..అవే ముఖాలు..అవే గొంతులు..కానీ ఉన్న‌ట్టుండి వీ6 ఛాన‌ల్ వ‌చ్చాక కొంత మార్పు వ‌చ్చేసింది. అంత‌కు ముందు జీ 24 గంట‌లు, హెచ్ ఎం టీవీ, టీ న్యూస్, 6టివి , జీ తెలుగు, మా టీవీ న్యూస్ అండ్ వినోదాత్మ‌క ఛాన‌ల్స్ సైతం తెలంగాణ భాష‌ను గౌర‌వించ‌డం ప్రారంభించాయి. ఆత్మ గౌర‌వానికి ద‌క్కిన గుర్తింపు ఇది. ఈ ఐడెంటిఫికేష‌న్ కోస‌మే 60 ఏళ్ల‌కు పైగా పోరాటం చేసింది..బ‌లిదానాల‌కు పాల్ప‌డింది. ప్రాణాలు కోల్పోయింది. స్వ‌రాష్టం సిద్ధాంచాక‌..స్వేచ్ఛ ల‌భిస్తుంద‌ని ఆశించిన యువ‌తీ యువ‌కుల‌కు..ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం లేకుండా పోయింది. టీఆర్ఎస్ పాల‌న‌లో గోస త‌ప్ప సంతోషం క‌రువైంది. ఈ స‌మ‌యంలో ఒక్క‌సారిగా ఇదే ప్రాంతానికి చెందిన బిత్తిరి స‌త్తి ఉన్న‌ట్టుండి రాకెట్‌లా మెరిశాడు.

డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా ప్రారంభ‌మైన బిత్తిరి స‌త్తి ఎన్నో క‌ష్టాలు ప‌డ్డారు. వీ6 అత‌డికి ఛాన్స్ ఇచ్చింది. త‌న ప్రోగ్రాంకు తానే యాంక‌రింగ్, తానే దుస్తులు, తానే మేకింగ్..అంతా అత‌డే. రాత్ర‌యితే చాలు 8.30కు ఇరు రాష్ట్రాల జ‌నం బిత్తిరి స‌త్తి మాట‌ల కోసం ఛాన‌ల్‌ను చూడటం ప్రారంభించారు. ల‌క్ష‌లు దాటి కోటికి పైగా చేరింది. రాష్ట్ర సీఎం ఎవ‌రంటే తెలియ‌క పోవ‌చ్చు..కానీ కోట్లాది జ‌నానికి స‌త్తి పేరు.ఆయ‌న ఆహార్యం గురించి జ‌నం మాట్లాడు కోవ‌డం ..అత‌డు సాధించిన ఫీట్ గా భావించాలి.
ప్రోగ్రామింగ్ రూప‌క‌ర్త దామూ అయితే..స‌త్తిని వెన్నుత‌ట్టి ప్రోత్స‌హించింది మాత్రం ..అంకం ర‌వినే. ఒక‌ప్పుడు శైలేష్ రెడ్డి వుండే వాడు..ఇపుడు ర‌వి ఒక్క‌డే తెలంగాణ ప్రాంత‌పు అస్తిత్వాన్ని నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఒక‌ర‌కంగా మెచ్చుకోవాల్సిందే. ఒక‌రు స‌ర్కార్ ఛాన‌ల్‌కు సిఇఓ అయితే మ‌రొక‌రు ప్రైవేట్ ఛాన‌ల్‌కు హెడ్‌.

ఏది ఏమైనా స‌త్తి ..తీసుకునే పాత్ర‌ల‌న్నీ జ‌నంలోనివే. అందుకే ఆయ‌న పాత్ర‌ల‌కు..ప్రోగ్రామ్స్‌కు అంత ఆదర‌ణ ల‌భిస్తోంది. తీన్మార్ వార్త‌లు ..టాప్ రేటింగ్ రావ‌డానికి స‌త్తి ఒక్క‌డే కార‌ణం. అత‌నితో పాటు మ‌రో యాంక‌ర్ కూడా పాపుల‌ర్ అయ్యారు. ఒక‌ప్పుడు వేషాల కోసం తిరిగినోడు..ఇవాళ ..తెలుగు సినిమాలో హీరోగా చేశాడు. క‌ష్టాలు ఎప్పుడూ వుంటాయి. కానీ విజ‌యం ఒక్క‌సారే వ‌స్తుంది..స‌త్తి ఇపుడు యాంక‌ర్ మాత్ర‌మే కాదు..స‌క్సెస్ ఫుల్ ప‌ర్స‌న్..తెలంగాణకు ఐకాన్. స‌త్తి మాట్లాడుతుంటే అమ్మ మాట్లాడిన‌ట్టు..ఊరు జ‌నం సంత‌లో పోగ‌యిన‌ట్టు..జాత‌ర‌లో కోలాటం వేసిన‌ట్టు..అనిపిస్తూ ఉంటుంది.

కామెంట్‌లు