జెట్ కోలుకునేనా..ఎస్‌బిఐ చర్చలు ఫలించేనా
ఇప్పటికే కుప్ప కూలేందుకు సిద్ధంగా ఉన్న జెట్ ఎయిర్‌వేస్ ను ఎలాగైనా గట్టెక్కించాలనే ఉద్ధేశంతో చేస్తున్న ప్రయత్నాలు ఫలించేటట్లు లేవు. ఆ సంస్థకు భారీగా రుణం ఇచ్చిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిడ్డర్లతో, వ్యాపార దిగ్గజాలతో చర్చలు ప్రారంబించింది. మరో వైపు ఒక్కరొక్కరు ఎగ్జిక్యూటివ్ స్థాయిలో ఉన్న వారు జెట్ ఎయిర్ వేస్ ను వీడిపోతున్నారు. దీంతో దానినే నమ్ముకుని రోడ్డు పాలైన సిబ్బంది, ఉద్యోగుల్లో మరింత ఆందోళన ఎక్కువైంది. పీకల లోతు అప్పుల్లోకి కూరుకు పోయింది ఈ విమానయాన సంస్థ. దీనికి కాయకల్ప చికిత్స చేయాలంటే కోట్లాది రూపాయలు అవసరమవుతాయి. దీనిని గమనించిన సంస్థ యాజమాన్యం ఏదో రకంగా మూసి వేయాలన్న నిర్ణయానికి వచ్చారు.
కానీ భారతీయ ప్రభుత్వ లేబర్ యాక్ట్ ప్రకారం కంపెనీని అంత త్వరగా దుకాణం కట్టేయడానికి ఒప్పుకోవు. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు జెట్ ఎయిర్ వేస్ యాజమాన్యానికి డబ్బులు అప్పు రూపేణా ఇచ్చాయి. అవి తడిసి మోపడయ్యాయి. దీనిని భరించేందుకు ముందుకు ఎవరూ రావడం లేదు. మరో వైపు విమానయాన రంగం సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. ఆయిల్ ధరలు పెరగడం, నిర్వహణ ఖర్చులు మోయలేనంతగా మారడం ఒకింత ఆయా ఎయిర్ లైన్స్‌లను ఇబ్బందులకు గురి చేస్తోంది. టాటా కంపెనీల యాజమాన్యం కొనుగోలు చేసేందుకు ఉత్సుకత చూపించినా .. ఆతర్వాత ఎందుకనో వెనక్కి తగ్గారు. ఇండియాలో దిగ్గజ కంపెనీలు ఎన్నో ఉన్నాయి. కానీ తెల్ల ఏనుగుల్లా మారిన ఈ సంస్థలను తీసుకోవడం ఎందుకు..లేని తలనొప్పులు కొని తెచ్చుకోవడం ఎందుకని..దిగ్గజ కంపెనీలు, బిజినెస్ టైకూన్స్ మిన్నకుండి పోయారు. కేంద్ర విమానయాన శాఖ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది.
ఓ వైపు జెట్ ఎయిర్ వేస్ సంస్థ తీరు ఇలా ఉంటే..సర్వీసు పరంగా ..వసతుల పరంగా ఎంతో పేరుగడించిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఇపుడు నేల చూపులు చూస్తోంది. ఆకాశంలోకి ఎగురలేక పోతోంది. చాలా ఫ్లయిట్స్ ను నడపడం లేదు. దాని భారం గొంతు మీదకు వచ్చింది.ఎన్నికలు ఉండడంతో ..ప్రస్తుత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేక పోతోంది. ఎంతో కాలంలో విశిష్ట సేవలందించిన ఎయిర్ ఇండియా ఇవాళ సర్కార్ సాయం కోసం నిరీక్షిస్తోంది. ఉద్యోగులు సమ్మె బాట పట్టేందుకు రెడీ అవుతున్నారు. ఓ వైపు ప్రయివేట్ ఎయిర్ లైన్స్‌లు మరో ప్రభుత్వ ఎయిర్ లైన్స్ ఒకే దారిన వెళుతున్నాయి.
సంస్థలను నడపడం ఒక ఎత్తయితే వాటిని లాభాల బాట పట్టించక పోయినా కనీసం పెట్టిన పెట్టుబడి కి నష్టం రాకుండా చూస్తే చాలు. అదీ కూడా ఈ రెండు సంస్థలకు చేత కాలేదు. వేలాది కుటుంబాలు ఈ కంపెనీలను నమ్ముకుని జీవిస్తున్నాయి. కనీస చట్టాలు వర్తింప చేయక పోవడం బాధాకరం. ఎస్‌బిఐ రంగంలోకి దిగి ఎలాగైనా జెట్ ఎయిర్ వేస్ మూత పడకుండా చేయాలని కృత నిశ్చయంతో ఉందని సమాచారం. హిందూజాలు జెట్ ఎయిర్ వేస్ ను టేకోవర్ చేసేందుకు రెడీ ఉంది. దీంతో పాటు మరికొన్ని కంపెనీలు పోటీ పడితే..ఏదో రకంగా సంస్థకు మేలు చేకూరే అవకాశం ఉంది. లేక పోతే అప్పుల కుప్ప పేరుకు పోతూనే ఉంటుంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి