త్యాగాల కుటుంబం..ఆదర్శనీయ జీవితం - మరిచిపోని జ్ఞాపకం..రాజీవ్ ప్రస్థానం
భారతదేశంలో ఎన్నదగిన నాయకులలో ఒకరిగా పేరొందిన వ్యక్తిగా దివంగత రాజీవ్ గాంధీ మొదటి వరుసలో నిలుస్తారు. ప్రపంచం ఆయన వైపు ఆదుర్దగా..అందివచ్చిన నాయకుడిగా పరిగణించింది. అంతలా ఆయన తనకు తాను ఎదిగారు. ఎందరో ఆయనను దగ్గరుండి చూసిన వాళ్లు ..తమను తాము మైమరిచి పోయేలా చేశారు. ఎంతో మంది ఇండియాకు ప్రధానమంత్రులుగా పనిచేశారు. కొందరు జీవించి ఉన్నారు. మరికొందరు మనమధ్య లేరు. కానీ సుదీర్ఘమైన చరిత్ర కలిగిన పార్టీకి రాజీవ్ గాంధీ జవసత్వాలు కల్పించారు. పార్టీకి ప్రాణం పోశారు. స్వతహాగా పైలట్ అయిన ఆయన చిన్న తనంలోనే విధి విసిరిన పంజాకు బలైపోయారు. ఈ సంఘటన దేశాన్ని..ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేసింది.
శాంతి కోసం నినదించిన మహాత్మా గాంధీని చంపేశారు. నిజాలు రాసినందుకు గౌరీ లంకేశ్‌ను పొట్టన పెట్టుకున్నారు. ప్రశ్నించే గొంతుకలను మూసి వేశారు. వీధి నాటకాలతో జనాన్ని చైతన్యవంతం చేస్తున్న షఫ్దర్ హష్మిని కాల్చేశారు. వేలాది మంది రాలిపోతున్నారు. కానీ రాజీవ్ గాంధీ మరణం చారిత్రిక తప్పిదంగా కొందరు మేధావులు అభివర్ణించారు. ఆయన మనల్ని వీడి 28 ఏళ్లవుతోంది. ఇది సుదీర్ఘ కాలం. దేశానికి సరికొత్త భవిష్యత్ ఉండాలని కలలు కన్నారు. వాటిని నిజం చేసేందుకు తన జీవితాన్ని పణంగా పెట్టారు రాజీవ్ గాంధీ. తన తల్లి ఐరన్ లేడీగా పేరు తెచ్చుకున్న ఇందిరా గాంధీ స్వంత బాడీ గార్డు చేతిలో నేలకొరిగారు. ఆ కుటుంబమే త్యాగాల కుటుంబం. మొన్నటికి మొన్న అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవి చేపట్టే అవకాశం వచ్చినా నెహ్రూ కుటుంబంలోని సోనియా గాంధీ ఒప్పుకోలేదు. తన కుమారుడు, తన కూతురు రెడీగా ఉన్నారు.
కుటుంబం చేతిలో పవర్ ఉంటుందన్న అపవాదును ఎందుకు మూటగట్టుకోవాలని ఆమె ఆలోచించింది. చెరగని చిరునవ్వు..భవిష్యత్ పట్ల అచంచలమైన నమ్మకం...విశ్వాసం కలిగిన నాయకుడిగా..మేధావిగా రాజీవ్ గాంధీ నిలబడ్డారు. అపారమైన మేధోతనం ఆయన స్వంతమైనా ..ఏరోజు తనను తాను అధినాయకుడిగా భావించు కోలేదు. కేంద్ర ఫలాలు, కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు పేదలకు, బడుగు, బలహీన వర్గాలకు అందాలని, చివరి వరకు పల్లెలకు చేరుకోవాలని పరితపించారు. అనుకోని రీతిలో ఆరవ ప్రధానమంత్రిగా ఈ దేశానికి పనిచేశారు. సమర్థవంతమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇతర దేశాలతో సయోధ్య కుదుర్చుకున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఈ దేశానికి తీసుకు రావాలని..ఆదిశగా ఆచరణలోకి తీసుకు రావాలని ప్రయత్నం చేశాడు. ఇవాళ అన్ని రంగాలలో దేశం కాస్తో కూస్తో అభివృద్ధి దిశలో పయనించడ రాజీవ్ గాంధీ చలవేనని చెప్పాల్సిందే.
ప్రపంచంతో భారత్ పోటీ పడాలని కోరారు. ఆ దిశగా ప్రణాళికలు తయారు చేయించారు. ఎక్కడా రాజీ పడలేదు. ప్రతిపక్షాలను గౌరవించారు. ఏనాడూ తాను దేశానికి ప్రధానినన్న గర్వాన్ని ప్రదర్శించలేదు ఆయన. ఇదీ ఆయనకున్న సంస్కారం. ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రపతి జైల్‌సింగ్, వెంకట్రామన్ లతో కొంత విభేదించినా తర్వాత సర్దుకు పోయారు. ఆయన ఇండిపెండెంట్ మనస్తత్వం ఉన్న మనిషి. 1984 నుండి 1989 వరకు పీఎంగా ఉన్నారు. 40 ఏళ్ల వయసులో అత్యంత పిన్న వయస్సులో ఈ పదవిని అలంకరించారు. నెహ్రూ - గాంధీ ఫ్యామిలో ఇందిరాగాంధీది పాలనలో తనదైన ముద్ర వేస్తే..రాజీవ్ గాంధీ మాత్రం తనదైన మార్క్‌తో ఇండియాను ప్రపంచ మార్కెట్‌లో నిలబెట్టారు. 1966లో ప్రొఫెషనల్ పైలట్‌గా పరిణతి సాధించారు.
1968లో సోనియా గాంధీని పెళ్లి చేసుకున్నారు. వారి పిల్లలే ప్రియాంక, రాహుల్‌లు. 1970లో తన తల్లి ఇందిర పీఎంగా ఉంటే..తమ్ముడు సంజయ్ గాంధీ ఎంపీగా ఉన్నారు. 1980లో విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ చనిపోయారు. ఈ సమయంలో రాజీవ్ పాలిటిక్స్‌లో ఎంటర్ అయ్యారు. తమ్ముడు పోటీ చేసిన అమేథి నుండి రాజీవ్ పోటీ చేసి గెలుపొందారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. 1982లో ఇండియాలో ఏసియన్ గేమ్స్ సమర్థవంతంగా నిర్వహించారు. ఇది సక్సెస్ కావడంలో రాజీవ్ పాత్ర విస్మరించలేనిది. ఆయన చలవ వల్లనే అవి సక్సెస్ అయ్యాయి.
అక్టోబర్ 31న 1984లో ఇందిర హత్యకు గురైంది. దీంతో రాజీవ్ ఫ్యామిలీ షాక్‌కు గురైంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 543 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ 411 సీట్లు గెలుచుకుంది. ఇది ఓ రికార్డు కూడా.
రాజీవ్ గాంధీ పాలన సమయంలో భూపాల్ గ్యాస్ ఉదంతం, షాబానో కేసు ప్రస్తావనకు వచ్చింది. ఎల్‌టీటీఈని అణిచి వేసేందుకు శ్రీలంక సర్కార్‌కు రాజీవ్ మద్ధతు తెలిపారు. దానిని మనసులో పెట్టుకున్న ప్రభాకరన్ ఆయన హత్యకు కుట్ర పన్నారు. ఎన్నికల సమయంలో తమిళనాడులో మానవ బాంబు సంఘటనలో ప్రాణాలు కోల్పోయారు. 1991లో ఈ సంఘటన చోటు చేసుకుంది. జాతి బాగుండాలని..దేశం అత్యున్నతమైన స్థానంలో నిలవాలని ..ప్రతి ఒక్కరు కుల, మతాలకు అతీతంగా బతికి బట్టకట్టాలని రాజీవ్ గాంధీ కోరుకున్నారు. ఆ దిశగా తన పాలన సాగించారు. కొన్ని అంతర్గత శక్తులు ఆయనకు సహకరించలేదు. రాజకీయ అనుభవం..పాలనానుభవం వేర్వేరు. రెండింటిని సమన్వయం చేసుకోవాలంటే చాలా పరిణతి సాధించాల్సి ఉంటుంది.
చనిపోయేంత దాకా ఆయన కాంగ్రెస్ పార్టీకి నాయకుడిగా ఉన్నారు. పార్టీ పగ్గాలు ఆయన చేతిలో ఉన్నాయి. దౌత్య పరంగా రాజీవ్ గాంధీ ఏ ప్రధానమంత్రి సాధించని సక్సెస్‌ను ఆయన స్వంతం చేసుకున్నారు. ఒక రకంగా ఇండియా ఒక వెలుగు వెలిగింది. ఈ సమయంలోనే. ప్రిన్స్ ఛార్లెస్, లేడి డయానాల పెళ్లికి రాజీవ్ అటెండ్ అయ్యారు. 1981లో ఇందిరా యూత్ కాంగ్రెస్ కు బాధ్యతలు స్వీకరించారు. 33 మంది సభ్యులతో గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆయనకు క్రీడలంటే వల్లమాలిన అభిమానం. తల్లి చనిపోయిన సమయంలో ఆయన క్లిష్ట సమయంలో పీఎంగా బాధ్యతలు చేపట్టారు. తల్లి హత్యకు గురైతే..ఆయన మానవ బాంబుకు బలయ్యారు. పంజాయతీరాజ్ వ్యవస్థకు జీవం పోసిన చరిత్ర ఆయనదే. యాంటీ డిఫెక్షన్ లా ఆయన హయాంలోనే బయటకు వచ్చింది. 1980లో పార్టీకి పగ్గాలు చేపట్టారు.
దేశానికి స్పష్టమైన విజన్ ఉండాలని కోరుకున్నారు. టెక్నాలజీ పరంగా ఇండియా పురోగతి సాధించాలని కలలు కన్నారు. 1984లో ఎలక్షన్ మేనిఫెస్టోను తయారు చేయించారు. అది ఆయన కలల పంట. ప్రొ రిచ్..ప్రొ సిటీ ఈ రెండూ రాజీవ్ కు చెందినవే. సైన్స్, టెక్నాలజీ, ఇండస్ట్రీస్, స్పోర్ట్స్, ఎకానమీ, అగ్రికల్చర్..ఇలా ప్రతి రంగంలో భారత్ ముందంజలో ఉండాలని ..ప్రతి ఒక్కరి భాగస్వామ్యం తప్పక కావాలని పిలుపునిచ్చారు. టెలికాం రంగం కూడా ఆయన హయాంలోనే అభివృద్ధి చెందింది. భారత్ కు ఇది మరో వెలుగు. ప్రతి గ్రామానికి టెలిఫోన్ సౌకర్యం కూడా రాజీవ్ కాలంలోనే చోటు చేసుకుంది. 1990లో లైసెన్స్ రాజ్‌లకు ఒక రకంగా సంస్కరణలు తీసుకు వచ్చి ఝలక్ ఇచ్చారు. ఎవరి అనుమతి లేకుండానే తమకు ఇష్టం వచ్చిన వస్తువులను కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చారు. ఇది కూడా భారత్‌కు మేలు చేకూర్చింది. మరికొంత ఆదాయం వచ్చేలా చేసింది.
విదేశీ పాలసీ మరింత సమర్థవంతంగా ఆయన కాలంలోనే విరాజిల్లింది. ఫారిన్ పాలసీ విషయంలో రాజీవ్ గాంధీని స్కాలర్‌గా అభివర్ణించవచ్చు. ఏ ప్రధాని చేయని సాహసాన్ని ఆయన చేశారు. ప్రతి ఒక్కరిని ఆహ్వానించారు. రాజీవ్ కూడా ఆయా దేశాలను పర్యటించారు. ఎక్కడికి వెళ్లినా ఆ దేశంలో జరిగిన అభివృద్ధిని చూసి అవగాహన తెచ్చుకున్నారు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్‌ను తమ దేశానికి రావాలని ఆహ్వానం పంపించారు. దేశానికి వెపన్స్ కంటే టెక్నాలజీ కావాలని కోరారు. అప్పట్లో అది సంచలనం. ఏ దేశం బాగుండాలని.కోట్లాది ప్రజలు బాగుండాలని కోరుకున్నాడో ఆ కలల రాకుమారుడు.
ప్రజా నాయకుడు జనం సాక్షిగా ..ప్రాణాలు కోల్పోయాడు. ఇది తీరని విషాదం. చరిత్రలో చీకటి రోజుగా పేర్కొనక తప్పదు. 1987లో పాకిస్తాన్ ప్రెసిడెంట్ జియా హుల్ హక్ ఇండియాకు వచ్చారు. 1987లో రాజీవ్ గాంధీ శ్రీలంకలో పర్యటించారు. ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలు నెరిపేలా సంతకాలు చేశారు. ఇదే కొంప ముంచింది. భవిష్యత్ దార్శిక నేతను కోల్పోయేలా చేసింది. ఆయన మరణం దేశానికే కాదు..ప్రపంచాన్ని కుదిపేసింది. చెరగని మోము..ప్రజల పట్ల అచంచలమైన ప్రేమ కలిగిన నాయకుడిని కోల్పోయింది. ఆయన చనిపోలేదు. ఇంకా ప్రతి గుండెలో నిలిచే ఉన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి