బాధ్యతలు చేపట్టిన ఇంద్రా నూయి
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకురాలిగా పేరు గడించిన ఇంద్రా నూయి అమెరికాకు చెందిన ఈకామర్స్ దిగ్గజ కంపెనీ అమెజాన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో చేరారు. సుదీర్ఘమైన అనుభవం కలిగిన వ్యక్తిగా ఆమె ఎదిగారు. కొద్ది మంది సిఇఓలను ఎంపిక చేస్తే అందులో ఆమె ఒకరు. ఏ సంస్థలో చేరినా ఆ సంస్థను లాభాల బాటలో పయనించేలా చేయడం ఆమెకే చెల్లింది. కష్టాల్లో ఉన్నప్పుడు ..నష్టాల్లో ఉన్న కంపెనీలకు వెన్నుదన్నుగా నిలవడం..వాటిని ట్రాక్ మీదకు తీసుకు రావడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. పెప్సికో కంపెనీ మొదటి సారిగా ఓ మహిళకు పూర్తి బాధ్యతలు అప్పగించింది. ఆమె దానిని పరుగులు పెట్టించింది. గత ఏడాది అక్టోబర్ నెలలో ఆమె పెప్సికో సంస్థ నుండి తప్పుకున్నారు.
ఇంతవరకు ఎన్నో రకాలుగా ..అన్ని ఫార్మాట్‌లలో పనిచేశారు. సమర్థవంతంగా కంపెనీకి ఓ బ్రాండ్ ను తీసుకు వచ్చారు. కేవలం పానీయలకే పరిమితమైన పెప్సికోను ఇతర విభాగాలలో ఎంటర్ అయ్యేలా చేశారు. భిన్నమైన రంగాలను ఎంచుకోగలిగితే..తయారు చేసే వస్తువుల్లో నాణ్యత వుంటే..ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన పనిలేదంటారు ఇంద్రా నూయి. పని చేసేందుకు పురుషులతో మహిళలు పోటీ పడుతున్నారు. వారు ఎవ్వరికీ తీసిపోరు. ఈ విషయం నాతోనే రుజువైందని ఆమె ఓ సందర్భంలో పేర్కొన్నారు. అత్యంత కఠిన మైన నిర్ణయాలు తీసుకోవడం, తను పనిచేస్తూనే..తన వారిని..కింది స్థాయి సిబ్బందిని పనిలో నిమగ్నం అయ్యేలా చేయడం ఆమెకు చాలా ఇష్టం.
అదే ఆమెను మిగతా మహిళలు, పురుషులకంటే భిన్నంగా నిలబెడతోంది..ప్రస్తుత సమాజంలో. పెప్సికో, అమెజాన్‌లు రెండూ దిగ్గజ కంపెనీలే. ఒక కంపెనీ శీతల పానియాలను నమ్ముకుని వ్యాపారం చేస్తుంటే..మరో కంపెనీ ఈకామర్స్ రంగంలో తనకంటూ ఎదురే లేకుండా సాగుతోంది. ఒక కంపెనీ ఇంద్రా నూయిని వదులుకుంటే మరో కంపెనీ ఆమెను చేర్చుకుంది. ఇంద్రా పెప్సికోను వదిలే సమయానికి స్టార్ బక్స్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్న రోసాలిండ్ బ్రెవెర్ అమెజాన్ బోర్డు డైరెక్టర్‌గా చేరారు. ఈ నెలలో ప్రపంచంలోనే పేరు సంపాదించుకున్న ఎగ్జిక్యూటివ్ స్థాయిలో ఉన్న ఇద్దరు తమ సంస్థలో చేరడం తమకు ఎంతో ఆనందం కలిగించిందని అమెజాన్ ఛైర్మన్ తెలిపారు.
ఇది మా కంపెనీకి శుభపరిణామంగా మేం భావిస్తున్నాం. ఉద్యోగులే మా సంస్థకు మూలం. అన్నింటికంటే ఎక్కువ దానిని నడిపే డైరెక్టర్లపైనే ఆధారపడి ఉంటుంది. కాదనలేం. అందుకే సమర్థవంతమైన వ్యక్తుల సమూహం వల్ల కంపెనీ లాభాల బాట పట్టక పోయినా పర్వాలేదు..కానీ ఒక క్రమపద్ధతిలో వెళుతుందని మాత్రం చెప్పగలమని స్పష్టం చేశారు. 63 ఏళ్ల నూయి ఆడిట్ కమిటీలో ఉన్నారు. సిఇఓగా పెప్సీకో కంపెనీలో 2006 నుండి 2018 దాకా ఉన్నారు. చైర్మన్‌గా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా 2007 నుండి ఫిబ్రవరి 2019 వరకు పనిచేశారు. 2001లో ప్రెసిడెంట్‌గా, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా కూడా పనిచేశారు. ష్లంబెర్జెర్ లిమిటెడ్ కంపెనీకి గౌరవ డైరెక్టర్‌గా ఏప్రిల్ 2015 నుండి పనిచేస్తూ వస్తున్నారు. మొత్తం మీద ఇంద్రా చేరడంతో అమెజాన్ బ్రాండ్ ...గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగినట్లయింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి