పొరపాట్లు జరిగాయి - చావు కబురు చల్లగా చెప్పారు
ఓ వైపు రెవిన్యూ శాఖలో అవినీతి, అక్రమాలు పెచ్చరిల్లిపోతుంటే..మరో వైపు విద్యా శాఖ పూర్తిగా గాడిన తప్పింది. దాని పరుగు బజారున పడింది. ఆ శాఖలో ఎవరు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. కేజీ టు పీజీ, గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, ఏకోపాధ్యాయ పాఠశాలలు, ఇలా పేర్లు మాత్రం ఘనంగా ఉన్నాయి. సౌకర్యాలు లేక, సిబ్బందిని నియమించలేక నానా తంటాలు పడుతున్నాయి. టిఆర్‌టీ నిర్వహించి ఫలితాలు ప్రకటించినా ఈ రోజు వరకు ఎంపికైన వారికి నియామక పత్రాలు ఇవ్వలేదు. అధికారుల అవినీతి, పాలకుల పాపం వల్లనే ఇవాళ ఇంటర్ బోర్డు ప్రజల ముందు దోషిగా నిలబడ్డది. దీనికంతంటికి కారణం విద్యా శాఖ మంత్రితో పాటు విద్యా శాఖ కార్యదర్శి, ఇంటర్ బోర్డు కార్యదర్శులదే.
సంఘటన జరిగి, పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష జరిపారు. ఫెయిల్ అయిన వారికి మాత్రం ఫీజు ఉండదన్నారు. మిగతా పిల్లల గురించి చెప్పలేదు. ఇప్పటికే ఫలితాల వెల్లడిలో విఫలమైన అధికారికే తిరిగి బాధ్యతలు కట్టబెట్టారు. సమావేశం ముగిశాక..అవును..తప్పులు దొర్లాయి..జరిగింది వాస్తవమేనంటూ చావు కబురు చల్లగా చెప్పారు విద్యా శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి. ఇలాంటి పొరపాట్లు ప్రతి ఏటా సామాన్యంగా జరుగుతాయంటూ తాపీగా సెలవిచ్చారు. వీలైనంత త్వరగా పునః పరిశీలన చేస్తామని వెల్లడించారు. అసలు దోషులను శిక్షకుండా, నిండు ప్రాణాలు గాల్లో కలిసి పోతే ..కనీసం స్పందించలేదు. ఖాళీ సంతాపం ప్రకటించి వదిలేసుకున్నారు.
ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని, అధికారులపై, గ్లోబరీనా సంస్థపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విద్యార్థి సంఘాలు, వామపక్ష పార్టీలు, ఇతర నాయకులు డిమాండ్ చేశారు. ఇంటర్ ఫలితాల వెల్లడిలో జరిగిన తప్పులకు అందరం బాధ్యులమేనంటూ చెప్పారు. ప్రతి ఏటా 20 వేల మంది తప్పుతున్నారని..వారంతా రీవాల్యూయేషన్ చేసుకుంటున్నారని పేర్కొన్నారు. వ్యవస్థలో పొరపాట్లు జరుగుతున్నందు వల్లనే పునః పరిశీలన, తిరిగి లెక్కింపు విధానాలను ఎప్పటి నుంచో అమలు చేస్తున్నారని చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామన్నారు. విద్యార్థుల్లో మనో ధైర్యం పెంచేందుకు కార్యక్రమాలు చేపడతామన్నారు.
విద్యార్థులు చనిపోవడం బాధాకరమన్నారు. సమస్యలు విప్పి చెప్పుకునేందుకు విద్యార్థులతో కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇక కీలక నిర్ణయం తీసుకుంది విద్యా శాఖ. ఇంటర్‌లో తప్పిన విద్యార్థుల జవాబు పత్రాల పునః పరిశీలన చేయాలని సీఎం నిర్ణయం తీసుకోవడంతో.. అధ్యాపకులకు సెలవులు రద్దు కానున్నాయి. త్వరలో ఉత్తర్వులు రద్దు కానున్నాయి. ఆయా కళాశాలల్లో పనిచేసే లెక్చరర్లు, ప్రిన్సిపాల్స్, కాంట్రాక్టు అధ్యాపకులు, అతిథి అధ్యాపకులు ఎనిమిది వేల మందిని విధుల్లోకి చేరాలని ఉత్తర్వులు త్వరలో రానున్నాయి. అంతా అయి పోయాక ..ఆకులు పట్టుకుని ఊరేగడం ఎంత వరకు సబబో ఏలిన వారికే తెలియాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి