సుప్రీం ధర్మాసనం సీరియస్ - వీళ్లు ప్రజాప్రతినిధులేనా - ఈసీకి ఝలక్
కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ధర్మాసనం ఝలక్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో ఆయా పార్టీలకు చెందిన నేతల వ్యవహార శైలిపై ఇంతవరకు ఎందుకు నాన్చుడు ధోరణిని ప్రదర్శిస్తున్నారంటూ ప్రశ్నించింది. అంతేకాకుండా మాటలతో మంటలు రేపి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ..ఓట్లు కొల్లగొట్టాలని ప్రయత్నం చేస్తున్న సదరు పార్టీ నేతలు, అధిపతులపై చర్యలు ఎందుకు చేపట్టలేదంటూ నిలదీసింది. అసలు ఎన్నికల సంఘం తన బాధ్యతలను విస్మరించడం వల్లనే ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయని..ప్రతి దానికి న్యాయస్థానాన్ని ఆశ్రయించడం అలవాటై పోయిందని ఘాటైన వ్యాఖ్యలు చేసింది. కేంద్రంలో, రాష్ట్రంలో పాలన సాగిస్తున్న ప్రభుత్వాలు చూసీ చూడనట్టుగా వ్యవహరించడం, ఎన్నికలు నిర్వహించే బాధ్యతను భుజాన వేసుకున్న ఈసీ నిమ్మకుండి పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్వేష పూరితమైన ప్రసంగాలు చేస్తుంటే ఎలా ఊరుకున్నారని మండిపడింది. ఎన్నికల సంఘానికి ఎలాంటి హక్కులు ఉన్నాయో తెలుసా అని ప్రశ్నించింది. వీలైతే మరోసారి రాజ్యాంగాన్ని చదవాలని సూచించింది.
ఎన్నికల సమావేశాల్లో ..ఇతర సమయాల్లో ఆయా పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. యుపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ..పలు పార్టీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపాయి. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలకు ఆలీపై నమ్మకం వుంటే..మాకు భజరంగ్ బలీపై విశ్వాసం వుందంటూ మాట్లాడిన మాటల్ని సుప్రీం సీరియస్‌గా తీసుకుంది. దీనిని విద్వేష పూరితమైన మాటలుగానే పరిగణిస్తూ మూడు రోజుల పాటు యోగిపై నిషేధం విధించింది ఈసీ. బీఎస్పీ అధినేత్రి కుమారి మాయావతి మాట్లాడిన మాటలు మంటలు రేపాయి. ముస్లింలు మహాకూటమికి ఓటు వేయాలి..కాంగ్రెస్ కు వేయొద్దంటూ కోరారు. మాయావతి ప్రచారం చేయకుండా రెండు రోజుల పాటు నిషేధం విధించింది. ఇక ఎస్పీ నాయకుడు ఆజాంఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇండియాలో సంచలనం రేపాయి.
జయప్రదను ఉద్ధేశించి ఆయన మాట్లాడిన మాటలను ఈసీతో పాటు మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. రాంపూర్ ప్రజలారా తను ఏమిటో తెలుసు కోవడానికి మీకు 17 ఏళ్లు పట్టింది..తను వేసుకున్న అండర్ వేర్ ఖాకీయేనని నేను `17 రోజుల్లో తెలుసుకున్నానని ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయనపై ఈసీ కొరఢా ఝులిపించింది. మూడు రోజుల పాటు ప్రచారం చేపట్టకుండా నిషేధం విధించింది. బీజేపీకి చెందిన మేనకా గాంధీ తాను ఏం తక్కువ కాదంటూ ..మాటలతో మంటలు రేపారు. సుల్తాన్ పూర్ లో ముస్లింలు ఓటు వేసినా ..వేయక పోయినా నేను గెలుస్తా..ఆ తర్వాత ఏం కావాలో వాళ్లే తేల్చుకోవాలంటూ వ్యాఖ్యానించారు. ఆమె పై ఈసీ రెండు రోజుల పాటు నిషేధం విధించింది.
కేవలం వీరు చేసిన వ్యాఖ్యలపైనే సుప్రీంకోర్టు సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. ఎన్నికల సంఘాన్ని నిలదీసినంత పనిచేసింది. ఒక్కో ప్రశ్నకు సీఇసీ లాయర్ నీళ్లు నమిలారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎన్నికల సంఘం తన తడాఖా చూపించింది. వేలూరు లోక్ సభ ఎన్నికను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. డీఎంకే వద్ద కోట్లాది రూపాయలు దొరకడంతో దానిని ఆధారంగా తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంది ఈసీ. అప్పట్లో ఎన్నికల కమిషనర్ టి.ఎన్. శేషన్ తన పవర్ ఏమిటో చూపించారు. పోటీ చేసిన అభ్యర్థుల గుండెల్లో గుబులు రేపారు. ఎన్నికల సంఘానికి విశిష్ట అధికారాలు ఉన్నాయంటూ నిరూపించారు. నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా ఈసీ ఏమీ చేయలేక చతికిల పడింది. మీ అధికారాలు మీరు తెలుసుకుంటారా లేక మమ్మల్ని గుర్తు చేయమంటారా అంటూ ఓ దశలో ప్రధాన న్యాయమూర్తి హెచ్చరించారు. తప్పించుకునే ధోరణి ప్రదర్శిస్తే ఎన్నికల కమిషనర్‌ను ఇక్కడికి పిలిపించాల్సి వస్తుందని గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం వార్నింగ్ ఇచ్చింది.
ఎన్నికల సమయంలో కులం, మతం, జాతి ఆధారంగా నేతలు వ్యాఖ్యలు చేస్తే సంబంధిత రాజకీయ పార్టీలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారణకు చేపట్టింది. విద్వేష పూరిత ప్రసంగాలు చేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీఎస్పీ అధినేత మాయావతిలపై ఏం చర్య తీసుకున్నారని సుప్రీంకోర్టు ఈసీని ప్రశ్నించింది. మాయావతి ఏప్రిల్ 12న బదులివ్వాల్సి ఉందని, ఇంతవరకు సమాధానం ఇవ్వలేదని న్యాయస్థానం దృష్టికి ఈసీ లాయర్ తెచ్చారు. ఇలా నేతలు లెక్క చేయకుంటే మీరు తీసుకోదగ్గ చర్యలేవీ లేవా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. ఎడ్వయిజరీ జారీ చేస్తామని, దాన్నీ లెక్క చేయకుంటే కేసు నమోదు చేస్తామని న్యాయవాది చెప్పారు. నేతలకు టైం ఇవ్వాల్సి ఉంటుందని, విధానాలు పాటించక తప్పదని అన్నారు. ‘‘అంటే, విద్వేష ప్రసంగాలపై మీరేమీ చేయలేరన్న మాట. మీకు కోరల్లేవు.. అధికారాల్లేవు.... గీత దాటిన అభ్యర్థికి నోటీసు జారీచేసి ఊరుకోవడం తప్ప మీరేమీ చేయలేరన్న మాట. అప్పటికీ అభ్యర్థి లెక్క చేయకపోతే క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. ప్రస్తుత చట్టం కింద మీకున్న అధికారాలు మొత్తం ఇవేనన్న మాట’’ అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు.
సుప్రీం దెబ్బకు ఈసీ దిగి వచ్చింది. రాజ్యాంగంలోని 324 నిబంధనలో పేర్కొన్న ఎన్నికలను నియంత్రించే అధికారాన్ని అన్వయించుకొని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీఎస్పీ అధినేత మాయావతి, ఎస్పీ నేత ఆజంఖాన్, కేంద్ర మంత్రి మేనకాగాంధీలను ఈసీ అభిశంసించింది. యోగి, ఆజంఖాన్‌లను మూడు రోజుల పాటు, మాయావతి, మేనకాగాంధీలను రెండు రోజుల పాటు ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. ఈ మేరకు విడివిడిగా ఆదేశాలు జారీ చేసింది. మరో వైపు ఈసీ నిర్ణయంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి తప్పు పట్టింది. ఇది తన భావ ప్రకటన స్వేచ్చను అడ్డుకోవడమేనంటూ వ్యాఖ్యానించింది.
ఎన్నికల సభల్లో సాయుధ బలగాలను వాడుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ మీద చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అసలు దోషిపై చర్యలు తీసుకొనే దమ్ము ఎన్నికల సంఘానికి లేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం దళిత వ్యతిరేక మైండ్‌సెట్‌కు ఈ నిషేధం నిదర్శనమని చెప్పారు. తనకు ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసులో ఎక్కడా తాను విద్వేష ప్రసంగం చేస్తున్నట్లు లేదని ప్రస్తావించడం గమనార్హం. మొత్తం మీద సుప్రీం హెచ్చరికలతో ఈసీలో కొంత కదలిక రావడం మంచి పరిణామంగా భావించాల్సి వుంటుంది. ఇకనైనా నేతలు ప్రజలకు జవాబుదారీగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. నోరుంది కదా అని వాగితే ఇలాగే అవుతుందని తెలుసుకోవాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి