పాల ఉత్పత్తులతో 15 వందల కోట్ల వ్యాపారం..ఓ మహిళ సాధించిన అపూర్వ విజయం
పాల వ్యాపారం అంటేనే మనం చులకనగా చూస్తాం. మనం పెరిగిన వాతావరణం..మన తీరే అంత. కానీ అదే పాల ఉత్పత్తులతో ఏకంగా 1500 కోట్ల టర్నోవర్ సాధించింది ఓ మహిళే అంటే నమ్మగలమా. కానీ నమ్మాలి. ఇది ఓ మహిళ సాధించిన వ్యాపార విజయ గాథ. అక్షాలీ షా ఈ పేరు ప్రపంచ దిగ్గజాలను ఆశ్చర్య పోయేలా చేసింది. ఇది ప్రతి ఒక్కరు తెలుసు కోవాల్సిన ప్రత్యేక కథ. తల్లిదండ్రులు పిల్లలను అడగటం మామూలే..మీరు పెద్దాయ్యాక ఏమవుతారని..అలాగే షాను కూడా ఆమె తండ్రి అలాగే అడిగాడు. కానీ ఆమె నుండి ఊహించని సమాధానం వచ్చింది. అదేమిటంటే ఏదో ఒకరోజు కోట్లాది రూపాయలు సంపాదించి పెడతా. నీకు మంచి పేరు తీసుకు వస్తానంది షా. చెప్పటమే కాదు చేసి చూపించింది ఈ 26 ఏళ్ల అమ్మాయి.
కాస్తంత డబ్బులు సమకూరితే ..జేబుల్లోకి వస్తే స్మార్ట్ ఫోన్లలో కాలాన్ని..లైఫ్‌ను కోల్పోతున్న నేటి తరం ఈ అమ్మాయి సాధించిన సక్సెస్ ను చూసి స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం పాలతో తయారు చేసిన ఉత్పత్తులను అమ్మడం ఆమె తండ్రి ప్రధాన వ్యాపారం. పరగ్ మిల్క్ ఫుడ్స్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశారు. భారతీయ మార్కెట్‌లో షా తండ్రి కంపెనీ అత్యధిక వాటాను కలిగి ఉన్నది. ప్రైవేట్ డెయిరీ కంపెనీల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్నది. ఇండియాలో మేనేజ్‌మెంట్ కోర్సులలో పేరొందిన ఎస్పీ జైన్ యూనివర్శిటీలో అక్షాలీ షా ఎంబీఏ లో ఫ్యామిలీ బిజినెస్ మేనేజ్‌మెంట్ చేశారు. 2010లో పరగ్ మిల్క్ ఫుడ్స్ లో మేనేజ్‌మెంట్ ట్రెయినీగా చేరారు. సేల్స్ అండ్ మార్కెటింగ్ లో శిక్షణ తీసుకున్నారు. ఫాదర్ నుండి ఆమె చేతుల్లోకి కంపెనీని తీసుకుంది. తనదైన మార్క్ ను పరగ్ మిల్క్ ఫుడ్స్ లో ఉండేలా చేసింది. 12 ఏళ్ల పాటు ఇదే సంస్థలో ఉద్యోగులు పనిచేస్తున్నారు.
వీరిని గాడిలో పెట్టడం..కంపెనీని లాభాల బాట పట్టించడం ఆమె ముందున్న సవాల్. దీనిని ఆమె సీరియస్ గా తీసుకుంది. చిన్నతనంలోనే వ్యాపారంలో బాధ్యతలు ఇచ్చేందుకు తండ్రి ఒప్పుకోలేదు. కానీ షా పట్టించు కోలేదు. ప్రతి ఛాలెంజ్‌ను తాను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని తండ్రికి కూతురు స్పష్టం చేసింది. పరగ్ మిల్క్ తో పాటు దాని ద్వారా తయారయ్యే ప్రొడక్ట్స్ ను నాణ్యవంతంగా ..రుచికరంగా ..కొన్ని రోజుల పాటు నిల్వ ఉండేలా తయారు చేసేలా పర్యవేక్షించింది. ఇందు కోసం సిస్టంను మార్చేసింది. సంస్థ పరంగా తయారయ్యే ఉత్పత్తులకు సంబంధించి స్వంతంగా ఆవులను కొనుగోలు చేస్తేనే బావుంటుందని ..ఎవరో ఇచ్చే వాటిలో నాణ్యత ఉండడం లేదని దీంతో తయారు చేసే వాటిపై ప్రభావం చూపిస్తుందని గ్రహించింది. ఈ విషయాన్ని తండ్రికి తెలిపింది. 2011లో 175 మంది కస్టమర్స్ తో ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్థానం ఇపుడు 1500 కోట్ల టర్నోవర్ కు చేరుకుంది.
దీని వెనుక అక్షాలీ షా చేసిన కృషి దాగి వుంది. ఓన్లీ బెస్ట్ పేరుతో పెద్ద ఎత్తున పరగ్ ప్రొడక్ట్స్ గురించి ప్రచారం చేశారు. ఈ ప్రయోగం ఫలించింది. జనం మెల మెల్లగా కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఈ కంపెనీ గురించి వాకబు చేయడం మొదలు పెట్టారు. సామాజిక మాధ్యమాల్లో కూడా విస్తృతంగా డిజిటల్ ప్రచారం చేపట్టారు. ప్రైడ్ ఆఫ్ కౌస్ పేరుతో ఆమె చేపట్టిన ఈ కార్యక్రమానికి భారీ ప్రచారంతో పాటు ఇండియన్ బిజినెస్ స్కూల్స్ నుండి స్టూడెంట్స్ ఇంటర్నిషిప్ తో పాటు సందర్శనకు రావడం మొదలు పెట్టారు. దీంతో ఆ నోటా ఈ నోటా ప్రచారం మరింత పెరిగింది. కస్టమర్లే టార్గెట్‌గా పరగ్ మిల్క్ ప్రొడక్ట్స్ సక్సెస్ సాధించింది. రుచి, నాణ్యత, అందరికి అందుబాటులో ధరలు ఉండేలా చూసింది షా. పరగ్ మిల్క్ బ్రాండ్ ఇండియాను షేక్ చేసేలా చేసింది. ముంబయి, థాణే, నవీ ముంబయి, పింపిరి చించ్వద్, పూణే నగరాల్లో 25000 మంది రెగ్యులర్ కస్టమర్లను చేర్చుకుంది.
సాంప్రదాయ పద్ధతులతో పాటు లేటెస్ట్ టెక్నాలజీని ఇందులో వాడుతున్నారు. మిగతా డెయిరీ కంపెనీలతో పోటీ పడటం, వాటి కంటే ఎక్కువగా మార్కెట్‌లో వాటాను పొందడం దీని మీదే కాన్ సెంట్రేషన్ చేసింది షా. పరగ్ మిల్క్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిడెట్ పేరుతో 1992లో ప్రారంభించారు. రైతులు ఈ కోఆపరేటివ్ మిల్క్ సెంటర్లకు పాలు పోసేవారు. దీనిని మార్చేశారు. వారికి అంతకంటే రేటు ఎక్కువ చెల్లించారు. నాణ్యతతో పాటు ఆకర్షణీయమైన ప్యాకేజింగ్ కూడా పరగ్ ప్రత్యేకం. సెలవు రోజుల్లో పాలు రైతులు ఇచ్చే వారు కాదు. దీనిని గమనించిన షా ..రైతుల దగ్గరకు తానే స్వయంగా వెళ్లారు. సెలవు రోజుల్లో కూడా పాలు ఇచ్చేలా వారిని ఒప్పించారు. 2008లో భారతదేశంలోనే అతి పెద్ద నెయ్యి తయారీ కేంద్రంగా పరగ్ మిల్క్ సంస్థ పేరు తెచ్చుకుంది.
డెయిరీ ఫామ్స్ తో పాటు మిల్క్ పార్లర్లను ఏర్పాటు చేశారు. ఉత్పత్తులన్నీ ఆరోగ్య పరంగా మంచి శక్తిని, బలాన్ని ఇచ్చేవిగా ఉండడంతో జనం భారీగా కొనుగోలు చేశారు. తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రచారం లభించింది. ఇతర దేశాల నుండి ఆర్డర్స్ రావడం మొదలు పెట్టాయి. షా ఆలోచనలు ..సిబ్బంది సహకారం..తండ్రి పోత్సాహం సంస్థ ఎదుగుదలకు దోహద పడింది. కోట్లు కుమ్మరించేలా చేసింది. అమ్మాయిలు వ్యాపారంలో రాణించడం అరుదు అన్న అపవాదును అక్షాలీ షా చెరిపి వేశారు. తన తండ్రికి మెరుగైన వారసత్వాన్ని తన కంపెనీ ద్వారా అందజేశారు. విజయం ఎలా వుంటుందో..ఊరించి ఊపిరి తీయకుండా చేస్తుందో చూడాలంటే షాను చూసి నేర్చుకోవాలి. సవాళ్లు ఎదురైనప్పుడే..సమస్యలు వచ్చినప్పుడే మనమేమిటో ..మన సత్తా ఏమిటో తేలుతుందని అంటారు షా.. కాదనడానికి మనం ఎవ్వరం కదూ..!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి