అయ్యో పాపం పోలార్డ్

టీమిండియాతో జరిగిన మ్యాచ్ లో ఓడి పోవడం మాత్రం తనను ఎంతగానో బాధ పెట్టిందని తన మనసులోని మాటను బయట పెట్టాడు వెస్టిండీస్‌ సారథి కీరన్‌ పొలార్డ్‌. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ ఓటమి పాలవడంపై అసహనం వ్యక్తం చేశాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌పై టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి ఈ ఫార్మట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ నమోదు చేశాడు. అంతే కాకుండా అంతర్జాతీయ టీ20ల్లో భారీ ఛేజింగ్‌ మ్యాచ్‌గా నిన్నటి మ్యాచ్‌ నిలవడం విశేషం.

ఇక మ్యాచ్‌ అనంతరం కరేబియన్‌ సారథి పొలార్డ్‌ మాట్లాడాడు. క్రమశిక్షణ లేని బౌలింగ్‌, వ్యూహాలు అమలు చేయడంలో వైఫల్యం చెందడంతోనే ఓటమి చవిచూసినట్లు పేర్కొన్నాడు. పిచ్‌ గురించి ఏం మాట్లాడను. ఎందుకంటే టీ20 ఫార్మట్‌కు ఇలాంటి మైదానాలే కావాలి. మా బ్యాట్స్‌మన్‌ వారి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు. దీంతో భారీ స్కోర్‌ సాధించ గలిగాం. కానీ మా బౌలర్ల ప్రదర్శన ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. కనీస ప్రాథమిక సూత్రాలను కూడా మా బౌలర్లు పాటించలేదు. ఇందుకు 23 ఎక్స్‌ట్రాలు సమర్పించు కోవడమే ఉదాహరణ.

అంతే కాకుండా దాదాపు 15 వైడ్‌లు వేశారు. తొలి పది ఓవర్ల వరకు గేమ్‌ మా చేతిలోనే ఉందనిపించింది. అయితే కోహ్లి ధాటిగా ఆడి మ్యాచ్‌ను మా చేతుల్లోంచి లాగేసుకున్నాడు. ఈ విషయంలో కోహ్లి గొప్పతనం ఎంత ఉందో.. మా బౌలర్ల వైఫల్యం అంతే ఉంది. అయితే మరో రెండు మ్యాచ్‌లు ఉండటంతో ఈ లోపాలన్నింటిపై దృష్టి సారిస్తాం. తిరిగి పుంజు కుంటామనే నమ్మకం ఉంది అంటూ పొలార్డ్‌ పేర్కొన్నాడు. 

కామెంట్‌లు