సుప్రియా..వారెవ్వా


మరాఠాలో గత కొన్ని రోజులుగా కొనసాగుతూ వచ్చిన రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. నెలకొన్న అనిశ్చితి తొలగి పోయే సమయం ఆసన్నమైంది. ఊహించని మలుపులతో నెల రోజులుగా మహా పొలిటికల్‌ ఎపిసోడ్‌ థిల్లర్‌ సినిమాను తలపించింది. అపర చాణక్యుడు శరద్‌ పవార్‌ సెంటిమెంట్‌తో ఫినిషింగ్‌ టచ్‌ ఇవ్వడంతో మహా వికాస్‌ కూటమి ప్రభుత్వం కొలువు తీరబోతోంది. కాంగ్రెస్‌, ఎన్సీపీ కలిసి శివసేన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో శరద్‌ పవార్‌ది ప్రధాన పాత్ర అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మహా పర్వంలో పవార్‌ కుమార్తె సుప్రియా సూలే కూడా తన వంతు పాత్రను సమర్థవంతంగా పోషించి తండ్రికి తగ్గ తనయ అనిపించుకున్నారు.

ఎన్సీపీని చీల్చడానికి సోదరుడు అజిత్‌ పవార్‌ ప్రయత్నించినప్పుడు ఆమె స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. రాజకీయాల కంటే బంధాలే ముఖ్యమని నచ్చ జెప్పి అజిత్‌ను తిరిగి పార్టీలోకి తీసుకు రావడంతో సుప్రియ చూపిన చాక చాక్యాన్ని మెచ్చు కోక తప్పదు. అంతే కాదు తమ పార్టీ ఎమ్మెల్యేలు చేజారి పోకుండా చూసు కోవడంలోనూ ఆమె ప్రదర్శించిన హుందాతనం ప్రశంసనీయం. ఎమ్మెల్యే లందరినీ పేరు పేరునా ఆప్యాయంగా పలకరిస్తూ ఐక్యతను నూరి పోశారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలు ప్రత్యర్థుల కుట్రలో పడకుండా తండ్రి పవార్‌తో ఆమె కూడా అనుక్షణం అప్రమత్తంగా ఉండి మంత్రాంగం నడిపించారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం సందర్భంగా సుప్రియ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచారు. అజిత్‌ పవార్‌ను ఆత్మీయ ఆలింగం చేసుకుని స్వాగతం పలికారు. అసెంబ్లీకి వచ్చిన తమ పార్టీ ఎమ్మెల్యేందరినీ దగ్గరుండి మరీ స్వాగతించారు. తమ పార్టీని చీల్చేందుకు ప్రయత్నించిన మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కూడా అంతే అభిమానంతో పలకరించి అందరి మన్ననలను చూరగొన్నారు. లోక్‌సభ సభ్యురాలిగా జాతీయ రాజకీయాల్లో రాణిస్తూనే మహారాష్ట్రలో తనదైన ముద్ర వేశారు సుప్రియ మహారాష్ట్రలో తలెత్తిన రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించడంలో ఆమె పాత్ర ఎనలేనిదని ప్రశంసలు కురిపిస్తున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!