బంగ్లాకు షోయబ్ కితాబు
టీమిండియాతో బంగ్లా క్రికెట్ జట్టు గట్టి పోటీ ఇచ్చిందని, మెరుగైన ఆటతీరు ప్రదర్శించిందని పాకిస్తాన్ మాజీ క్రికెటర్, పేసర్ షోయబ్ అక్తర్ కొనియాడారు. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో ఓటమి పాలై, మిగతా రెండు మ్యాచ్‌ల్లో ఘన విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత క్రికెట్ జట్టును కూడా పొగిడారు. మూడో టీ20లో అద్వితీయ ప్రదర్శనను కనబరచడంతో టీమిండియాను బాస్ ఆఫ్ ద గేమ్ అంటూ ప్రశంసించారు. టీమిండియా సమిష్ట ప్రదర్శనతో సిరీస్‌ను గెలుచుకుంది. రోహిత్‌లో అసాధారణ బ్యాటింగ్ టాలెంట్ ఉంది.
అతను పరుగులు చేయాలని ఏ సందర్భంలో అనుకున్నా సాధిస్తాడు. చివరి టీ20 ఆసక్తికరంగా ఉంటుందనుకున్నా. కానీ భారత్ ఒక్కసారిగా విజృంభించడంతో హోరా హోరీ మ్యాచ్ కాస్తా ఏకపక్షంగా మారి పోయింది. ఇక్కడ బంగ్లాదేశ్ ఆటను తక్కువ చేయలేం. బంగ్లాదేశ్ సిరీస్ ఆద్యంతం ఆకట్టుకుంది. భారత్‌కు కచ్చితంగా గట్టి పోటీ ఇచ్చింది. హ్యాట్సాఫ్ బంగ్లాదేశ్. బంగ్లా పసికూన కాదనే విషయం మరోసారి రుజువైంది. బంగ్లా పులులు ఏ జట్టు ముందైనా అంత తేలిగ్గా తలవంచరు.
ప్రతీ జట్టుకు గట్టిపోటీ ఇస్తూ బంగ్లాదేశ్ పటిష్టమైన జట్టుగా ఎదిగింది అని అక్తర్ పేర్కొన్నాడు. ఇక దీపక్ చాహర్ బౌలింగ్‌పై కూడా అక్తర్ ప్రశంసలు కురింపిచాడు. అటు మీడియం పేస్‌ను, ఇటు సీమ్‌ను మిక్స్ చేసి చాహర్ మంచి ఫలితాన్ని రాబట్టాడని అన్నాడు. హ్యాట్రిక్‌తో పాటు ఆరు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించడానికి స్లో పేస్‌తో బంతిని స్వింగ్ చేయడమే కారణమన్నాడు షోయబ్ అక్తర్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి