రోడ్డెక్కని బస్సులు..ప్రయాణీకుల అవస్థలు
ప్రజలకు కొన్నేళ్లుగా నిజాయితీగా విశిష్టమైన రీతిలో సేవలు అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. మరోవైపు ఏపీలో ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేసుకున్నది. దీంతో తెలంగాణాలో కూడా కార్మికులు, సిబ్బంది తమ సంస్థను యుద్ధప్రాతిపదికన విలీనం చేయాలని అంతవరకు తమ ఆందోళన కొనసాగుతుందని టీఎస్ ఆర్టీసీ కార్మిక నాయకులు స్పష్టం చేస్తున్నారు. అయినా ప్రభుత్వం దిగి రావడం లేదు. దాదాపు 75 శాతానికి పైగా బస్సులు డిపోల నుండి రోడ్డెక్కలేదు. పండగ వేళ పిల్లా పాపలతో ఊళ్లకు బయలు దేరిన వారికి ప్రయాణం నరకంగా మారింది.
ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ఉదయం వేళ డిపోల నుంచి ఒక్క బస్సు కూడా ప్లాట్‌ఫారంల పైకి రాలేదు.
ప్రైవేటు డ్రైవర్లతో బస్సులు నడిపే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇచ్చినా ఆచరణ సాధ్యం కాలేదు. బస్సుల్లేక పోవటాన్ని ఆసరా చేసుకున్న ప్రైవేటు వాహనదారులు పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడ్డారు. ప్రతి చోటా వాస్తవ ధరలకంటే ఎక్కువగా మూడు రేట్లు పెంచారు. దీంతో జనం లబోదిబో మంటున్నారు. ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లు మెల్లగా అందుబాటులోకి వస్తుండటంతో బస్సులు డిపోల నుంచి కొన్ని బయటకు వచ్చాయి.
ఆర్టీసీ బస్సులు, అద్దె బస్సులతోపాటు జీపులు, వ్యాన్లు, విద్యా సంస్థల బస్సు లు..ఇలా అన్ని రకాల వాహనాలను అందుబాటు లోకి తేవటంతో ప్రయాణాలు సాధారణంగా సాగిపోయా యి.
మహబూబ్‌నగర్, ఖమ్మం లాంటి కొన్ని ప్రాంతాల్లో ఉదయం రద్దీ ఎక్కువగా కనిపించినా, సమ్మె ప్రభావం ఉందని, బస్సుల్లేవన్న సమాచారంతో బస్టాండ్లకు జనం రాక తగ్గిపోయింది. కానీ మధ్యాహ్నం తర్వాత మళ్లీ రద్దీతో బస్సులు కదిలాయి. శనివారం నుంచి సమ్మె ఉం డటంతో పలువురు శుక్రవారమే ఊళ్లకు వెళ్లిపోయారు. ప్రైవేటు డ్రైవర్లకు ఆర్టీసీ, రవాణ శాఖ అధికా రులు ట్రయల్ రన్ నిర్వహించారు. వారితో ఒక్క రౌండు బస్సు నడిపించి..వారి డ్రైవింగ్ నైపుణ్యాన్ని అంచనా వేశారు. ఉత్తీర్ణులైన వారిని డిపోలకు పంపి, బస్సులు చేతికిచ్చారు. ఈ ప్రక్రియకు నాలుగైదు గంటల సమయం పట్టింది. ఇలా క్రమంగా మధ్యాహ్నం 3 గంటల వరకు 9 వేల బస్సులను అధికారులు రోడ్డెక్కిం చగలిగారు.
ఇందులో సాధారణ ఆర్టీసీ బస్సులు 2,129, ఆర్టీసీలోని అద్దె బస్సులు 1,717 ,ప్రైవేటు వాహనాలు 1,155, విద్యా సంస్థల బస్సులు 1,195, మ్యాక్సీ క్యాబ్ సర్వీసులు 2,778 అందుబాటులోకి తెచ్చారు. కొన్ని బస్సుల్లో సాధారణ టికెట్ ధర వసూలు చేయగా, మరిన్ని బస్సుల్లో అదనపు మొత్తం వసూలు చేశారు. 6 గంటలలోపు విధుల్లోకి రాని సిబ్బంది డిస్మిస్ అయినట్లే భావించాల్సి ఉంటుందని ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికను కార్మికులు, ఉద్యోగులు పట్టించుకోలేదు. కొన్ని చోట్ల తాత్కాలిక డ్రైవర్లతో బస్సులు తీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆర్టీసీ జేఏసీ నేతలు, కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్‌లో మూడున్నర వేల సిటీ బస్సులు పరుగులు తీసేవి. రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మెట్రో రైళ్ల సంఖ్య పెంచాలని మెట్రో కార్పొరేషన్‌ను కోరటంతో అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేశారు. మెట్రో రైళ్లలో రోజువారీ 3 లక్షల మంది రాకపోకలు సాగిస్తుండగా, శనివారం 4 లక్షలు దాటింది. ఎస్మాలు , అరెస్టులు తమకు కొత్త కాదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. అన్ని డిపోల ఎదుట తమ కుటుంబాలతో కలిసి బతుకమ్మ ఆడుతామని చెప్పారు. ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేస్తామని చెప్పారు. కాగా కార్మికులు .. పాలకుల మధ్య ఆధిపత్య పోరు ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. తమకు ఉద్యోగ భద్రత కల్పించేంత దాకా ఆందోళన కొనసాగిస్తామన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి