దాతృత్వంలో శివ్ నాడార్ టాప్
ప్రపంచంలో లెక్కలేనంత మంది ధనవంతులు ఉన్నారు. పట్టలేనంతగా కరెన్సీ, బంగారం, వజ్రాలు, వైఢూర్యాలు ఉన్నాయి. కానీ అంత కంటే ఎక్కువగా పేదలు కాలే కడుపులతో చావుకు దగ్గరవుతున్నారు. ఇక ఇండియా పరంగా చూస్తే జనాభా 130 కోట్లు ఉన్నా వీరిలో కేవలం 10 శాతం మంది చేతుల్లో మాత్రమే సంపద పోగై ఉన్నది. వీరిలో ఎక్కువగా దేశానికి పన్ను చెల్లించకుండా అక్రమ మార్గాల్లో, హవాలా రూపంలో ఇతర దేశాలకు తరలించి, అక్కడి బ్యాంకుల్లో దాచుకున్న వారే. వీరిలో ఇప్పటికే వేలాది మంది స్విస్ బ్యాంక్ లో దాచుకున్న వారున్నారు. మరో వైపు కోట్లాది ఆస్తులు, డబ్బులున్నా ఒక్క పైసా పేదల కోసం, సమాజ అభివృద్ధి కోసం పాటు పడిన దాఖలాలు లేవు. ఇదిలా ఉండగా కొందరు డబ్బున్న మారాజులు మాత్రం తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
వారిలో మొదటి స్థానంలో ఉన్నారు చెన్నైకి చెందిన పారిశ్రామిక టెక్ దిగ్గజం శివ్ నాడార్. తాజాగా ఇండియాలో దేశ ప్రజల సంక్షేమం కోసం వ్యక్తిగతంగా, తమ సంస్థల ద్వారా చేస్తున్న కృషి ఆధారంగా దాతల జాబితాను..రూపొందించారు. ఈ జాబితాలో ప్రముఖ రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ మూడో స్థానంలో నిలిచారు. గతంలో ఆయన రెండో స్థానంలోఉండగా, తాజా ర్యాంకుల ప్రకారం అజీం ప్రేమ్‌జీ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఏడెల్‌గివ్ ఫౌండేషన్, హురున్ ఇండియా తమ 6వ ‘ఎడెల్‌గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రపీ లిస్ట్ 2019’ను విడుదల చేసింది. వ్యక్తిగతంగా, కార్పొరేట్ సంస్థల పరంగా సంవత్సరానికి 5 కోట్ల రూపాయలకు మించి విరాళాలు ఇచ్చిన వారితో ఈ జాబితాను రూపొందించారు. మొత్తం 100 మందితో ఈ జాబితాను వెల్లడించారు.
ఈ వంద మంది ఇచ్చిన విరాళాల మొత్తం 4,391 కోట్లు. కాగా ఈ సొమ్ములో 63 శాతం మొదటి పది ర్యాంకులు పొందిన వారు ఇచ్చినదే కావడం గమనార్హం. హెచ్‌సీఎల్ చైర్మన్ శివ్ నాడార్ 826 కోట్లు విరాళంగా ఇస్తే, విప్రో వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్‌జీ 453 కోట్లు, ముఖేశ్ అంబానీ 402 కోట్లు విరాళాలు ఇచ్చారు. ఈ ముగ్గురు ప్రధానంగా విద్యా రంగం అభివృద్ధి కోసం సాయం చేశారు. కాగా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు. ఆయన 204 కోట్లు విరాళం ఇచ్చారు. మరో వైపు 200 కోట్లు విరాళం ఇచ్చిన అజయ్ పిరమల్, ఆయన కుటుంబం ఐదో స్థానాన్ని ఆక్రమించింది.దాతల్లో అత్యధికులు ముంబైవారే ఉండగా రెండో, మూడో స్థానాల్లో న్యూఢిల్లీ, బెంగళూరు వాసులు ఉన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి