మనసు పొరల్లో..మెడ వంపుల్లో..!

ప్రేమ అన్నది లేక పోతే జీవితాన్ని కొనసాగించడం కష్టం. ప్రపంచంలో మనకంటూ తోడు అన్నది లేకపోతే అంతా శూన్యం అనిపిస్తుంది. ఒకరిపై మరొకరికి ఉన్నది ప్రేమ ఒక్కటే. కష్టాల్లో తోడుంటుంది. సంతోషంలో భాగమవుతుంది. ఒకరికొకరు ప్రేమించు కోవడం అన్నది సహజం. ఇది ఒక్కటి లేకపోతే పరమ బోర్. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ .ఒక్కో పంథా. ఎవరి దారుల్లో వాళ్ళు ఉన్నా. ఎవరి లోకంలో వాళ్ళు లీనమై పోయినా. ఒకళ్ళ కోసం ఇంకొకరు వేచి చూడటం. నిరీక్షించి ఉండటం మామూలే. ఇలాంటి క్షణాలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. పైకి లేదని చెప్పినా లేదా బుకాయించినా ప్రేమ అన్నది అంతర్లీనమై ఉంటుంది. దానిని ఎవరూ చెరపలేరు. మరిచి పోకుండా ఉండలేరు. తలుచుకోకుండా, గుర్తుకు తెచ్చుకోకుండా బతకలేరు. స్త్రీ పురుషుల మధ్య ఈ ఆకర్షణ అన్నది లేక పోతే కాలం సాగదు.
కొందరు అనుకోకుండా తారస పడతారు. ఇంకొందరు మనతో పాటే వుండి పోతారు. ఇదంతా ప్రేమ మహత్యం. కాదనలేం. మనసుల్లో ఏదో మూలాల అభిమానం దాగి ఉంటూ ప్రేమగా మారి పోతుంది. ఎప్పుడూ స్తబ్దుగా ఉండే మనం, కావాల్సిన వాళ్ళు తారస పడినప్పుడో లేదా అనుకోకుండా కలుసుకున్నప్పుడో.. ఆ క్షణాన గుండె గోదారై ఉప్పొంగుతుంది. ప్రేమ అన్నది అంతులేని ప్రయాణం. ఇదే సమయంలో చేసుకున్న బాసలు, కోరుకున్న కలలన్నీ ఒక పట్టాన ఉండనీయవు. అందుకే ప్రేమంటే పడి చచ్చేది. అందు కోసమే ప్రాణాలు తీసుకునేది. ఒకరి కోసం ఒకరు ఉండలేరు. క్షణమైనా, నిమిషమైనా దూరంగా ఉండాలంటే విలవిలలాడి పోతారు. తరాలు మారినా, టెక్నాలజీ మారినా ప్రేమలో మాత్రం మార్పు రాలేదు. కాకపోతే కొంత కొత్తదనం వచ్చి చేరిందంతే. ఇలాంటి అరుదైన సన్నివేశాలు గతంలో చూడాలన్నా, జ్ఞాపకం చేసుకోవాలన్నా చాలా పట్టింపులు, కట్టుబాట్లు, నిబంధనలు ఉండేవి. ఇప్పుడు సీన్ మారింది.
ప్రేమకు కొత్త అర్థం చెబుతున్నారు నేటి తరం. అంతా త్వరగా అయిపోవాలి. ఎప్పుడైతే డాలర్ల మాయలో పడ్డారో ప్రేమ కూడా కమర్షియల్ గా మరి పోయింది. అంతా క్షణాల్లో జరిగి పోవాలనే ఆత్రుత ఎక్కువై పోయింది. అయినా ఎక్కడో ఓ మూల ప్రేమ పరిమళిస్తూనే ఉన్నది. సోషల్ మీడియా వచ్చాక ప్రైవసీ లేకుండా పోతోంది. హద్దులను దాటేసి పెద్దలు తల వంచుకునేలా ప్రవర్తించడం నేటి యూత్ కు మామూలై పోయింది. అయినా ఎక్కడో ఒక చోట ప్రేమ మినుకు మినుకు మంటూ ప్రకాశిస్తోంది. ప్రేమలో మోహం ఉండదు. కోల్పోవటమే తప్పా..సినిమాల్లో చూసి ఇదేనేమో ప్రేమంటే అనుకుంటూ ఎంజాయ్ చేసే స్థాయికి దిగజారారు. ఇప్పుడున్న సినిమాలు పెద్దలకు మాత్రమే దాటి పోయాయి. కొన్ని సినిమాలల్లో ఇండిపెండెంట్ కేరక్టర్ కలిగిన పాత్రలు ఆకట్టుకుంటున్నాయి. తెలుగు సినిమా ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది.
సాగర సంగమం లో జయప్రద , మరో చరిత్రలో సరిత, ఏక్ దూజే కేలియే లో కమల్ హాసన్ , హమ్ ఆప్ కె హై కౌన్ లో మాధురి కోసం సల్మాన్ పడిన తపన, కభీ కభీ సినిమాలో అమితాబ్ నటన, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మూవీస్ ఇద్దరి మధ్య కలిగే ప్రేమను, భావోద్వేగాలను సున్నితంగా తెరమీద ప్రతిఫలించేలా చేయడంలో ఎవరికి వారే పోటీ పడ్డవారే. అప్పుడే స్నానం చేశాక కురుల మధ్య లోంచి నీళ్లు బొట్లు గా రాలుతూ వుంటే, వెనక నుంచి మెడ వంపుల్లో మొహం పెట్టుకుని ముద్దు పెట్టు కోవడం గొప్ప థ్రిల్లింగ్. అద్భుతమైన ఫీలింగ్. ఈ మధ్యనే పరుశురాం గీత గోవిందం లో తీశాడు. రైలులో జర్నీ ..కిటికీ పక్కన కళ్ళల్లోకి కళ్ళు పెట్టుకుని చూసు కోవడం ఓహ్ ..ఆ అనుభూతే వేరు.. అలాంటి అరుదైన సన్నివేశాలు..సంఘటనలు..అరుదుగా వస్తాయి. అందుకే మనసు పొరల్లో..మెడ వంపుల్లో కొన్ని జ్ఞాపకాలను అలా వుండి పోతాయి..ఎప్పటికీ..!

కామెంట్‌లు