సర్వత్రా నిరసన .. ఆగని ఆందోళన..టీటీడీపై రేగిన రాద్ధాంతం..?

కోట్లాది మంది భక్తుల కోర్కెలు తీర్చే ఆ కొండపై వెలసిన శ్రీనివాసుడికి ఎనలేని కష్టం వచ్చి పడింది. అదేదో భక్తుల నుండి అనుకుంటే పొరపాటు పడినట్లే. ఏ ప్రభుత్వమైతే రక్షణగా ఉండాలో, అదే సర్కారు ఆ దేవదేవుడి పట్ల కనికరం చూపడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా, అధికారులు, పోస్టులు మారి పోతుంటాయి. ఇది గత కొన్నేళ్లుగా వస్తూ వున్న సాంప్రదాయం. గతంలో తిరుమలపై ఇలాగే పెత్తనం చెలాయించాలని ప్రయత్నం చేసిన వారంతా నామ రూపాలు లేకుండా పోయారు. ఆ వేంకటేశ్వరుడి మహిమ అలాంటిది.  ప్రపంచంలోనే వాటికన్ తర్వాత అత్యంత ధనవంతమైన, ఆదాయం కలిగిన పుణ్య క్షేత్రంగా తిరుమల కు పేరున్నది. కోట్లాది రూపాయలు, లెక్కలేనంతటి బంగారం, వజ్రాలు, వైఢూర్యాలు, ఆస్తులు, అంతస్తులు, భవనాలు, బ్యాంకుల్లో కోట్లాది ఫిక్సెడ్ డిపాజిట్స్ ఉన్నాయి.

వేలాది మంది ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు. ప్రత్యేకమైన వ్యవస్థ ఉన్నది. అంతే కాకుండా ప్రతి రోజు లక్షకు పైగా భక్తులు తిరుమలను దర్శించుకుంటారు. రవాణా పరంగా అటు ఆర్టీసీకి, రైల్వే శాఖ, విమానయాన శాఖలకు ఎనలేని ఆదాయం సమకూరుతోంది. అంతే కాకుండా పర్యాటక పరంగా కోట్లాది రూపాయలు సమకూరుతున్నాయి. ప్రతి రోజు వీఐపీలు, వీవీఐపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రి, ప్రెసిడెంట్, గవర్నర్లు, చైర్మన్లు, సినీ నటీనటులు, క్రీడాకారులు, సెలబ్రెటీలు, ఐఏఎస్ లు, ఐపీఎస్ లు ..ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడవుతుంది లిస్టు. వీరికి ప్రోటోకాల్ కోసమే సగం టైం సరిపోతోంది. టీటీడీ ఈవో కు . ఎక్కడా లేని విధంగా రాజకీయాలు ఇటీవల చోటు చేసుకున్నాయి. ఎన్ఠీఆర్ పుణ్యమా అని ఇవ్వాలా వేలాది మందికి నిత్యం అన్నం దొరుకుతోంది.

ఇక్కడ ఉన్నన్ని రాజకీయాలు ఇంకెక్కడా లేవు. తాజాగా జంబో టీమ్ ను టీటీడీ కి పాలక మండలిని ప్రకటించారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. గతంలో ఇదే పాలక మండలి లో సభ్యుడిగా ఉన్న శేఖర్ రెడ్డి ని తిరిగి ఏజే శేఖర్ పేరుతో నియమించడంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆయన కోట్లాది కరెన్సీతో పట్టుబడ్డారు. అలాంటి వ్యక్తిని తిరిగి తీసుకురావడంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం చెబుతున్నాయి. ప్రస్తుతం నియమించిన పాలక మండలిలో అంతా వ్యాపారవేత్తలు, ఆరోపణలు ఎదుర్కుంటున్న వారే ఉండడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భక్తులు పరమ పవిత్రంగా భావించే ఆ తిరుమలకు ఇలాంటి నీతి తప్పిన వ్యక్తులను నియమిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. సీఎం దీనిపై పునరాలోచించాలని కోరుతున్నారు. తెలంగాణ నుంచి ఎంపికైన వారంతా బిజినెస్ మేన్స్ ఉన్నారు. రామేశ్వర్ రావు, భాస్కర్ రావు , దామోదర్ రావు వీళ్ళ వల్ల టీటీడీకి ఒరిగేది ఏమీ ఉండదని భక్తులు , మేధావులు అంటున్నారు. మొత్తం మీద ఈ పదవుల పందేరం పెద్ద దుమారాన్నే రేపుతోంది. 

కామెంట్‌లు