హెచ్‌సీఏ ఎన్నికల్లో అజ్జూ ప్యానల్ దే హవా

టీమిండియా మాజీ సారథి మహ్మద్‌ అజహరుద్దీన్‌.. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో ప్రత్యర్థులను చిత్తు చేశారు. అధ్యక్షుడిగా ఆయన విజయం సాధించడమే కాకుండా తన ప్యానల్‌ను కూడా గెలిపించుకున్నారు. హెచ్‌సీఏ చరిత్రలో ఒకే ప్యానెల్ అన్ని స్థానాలు కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. మాజీ అధ్యక్షుడు గడ్డం వివేక్ ప్యానెల్ సపోర్ట్ చేసిన ప్రెసిడెంట్ అభ్యర్థి ప్రకాశ్‌చంద్ జైన్‌ కేవలం 73 ఓట్లతో సరిపెట్టుకున్నారు. మరో ప్రత్యర్థి దిలీప్‌కుమార్‌కు కేవలం 3 ఓట్లు మాత్రమే దక్కాయి. అజహరుద్దీన్ 147 ఓట్లు దక్కించుకుని, 74 ఓట్ల ఆధిక్యం సాధించారు. 227 ఓట్లకు గాను 223 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా నలుగురు ఎన్నికలకు దూరంగా ఉన్నారు.

మొదటి నుంచి హెచ్‌సీఏ పై యెనలేని ఆరోపణలు ఉన్నాయి. అవినీతికి కేరాఫ్ గా మారిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. కాగా ఎప్పటి నుంచో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు అధ్యక్షుడు కావాలన్న కలను అజహరుద్దీన్‌ ఎట్టకేలకు సాకారం చేసుకున్నారు. రెండేళ్ల క్రితం హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేసి భంగపడ్డారు. ఆయన ఈసారి వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం అందుకున్నారు. హెచ్‌సీఏలో పట్టున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు హనుమంతరావు, తదితరుల అండతో మాజీ అధ్యక్షుడు వివేక్ ప్యానెల్ మద్దతు ఇచ్చిన ప్రకాశ్‌చంద్‌ను చిత్తుగా ఓడించారు. వివేక్‌ నామినేషన్‌ తిరస్కరణకు గురికావడం కూడా అజర్‌కు కలిసొచ్చింది. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో అజహరుద్దీన్ పార్టీ మారతారన్న ప్రచారం మరోసారి ఊపందుకుంది.

టీఆర్‌ఎస్‌ మద్దతుతోనే ఆయన గెలిచారన్న చర్చ కూడా జరుగుతోంది. దీనిపై ఆయన స్పంది​స్తూ.. పార్టీ మారతానో, లేదో ఇప్పుడే చెప్పలేనని అన్నారు. టీఆర్ఎస్‌లో చేరతానో, లేదో చెప్పే వేదిక ఇది కాదని అన్నారు. తన ప్యానల్‌తో సహా ప్రగతి భవన్‌కు వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవనున్నట్టు వెల్లడించారు. క్రికెట్‌ అభివృద్ధి గురించి సీఎంతో చర్చిస్తానని చెప్పారు. కాగా, అజహరుద్దీన్.. కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరో వైపు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో అజహరుద్దీన్ విజయం సాధించడం పట్ల కాంగ్రెస్ పార్టీ హర్షం ప్రకటించింది. హనుమంతరావు నేతృత్వంలో గాంధీభవన్ వద్ద బాణసంచా కాల్చి కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నారు.

కామెంట్‌లు