హైదరాబాద్ బాద్..షా..అమెజాన్ షెహన్ షా..!
ఈకామర్స్ రంగంలో ప్రపంచంలోనే టాప్ వన్ లో కొనసాగుతున్నఅమెరికాకు చెందిన అమెజాన్ అరుదైన రికార్డ్ నమోదు చేసింది. ఏ దేశంలో లేని విధంగా భారీ ఖర్చుతో భారీ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసింది. ఆ అరుదైన సన్నివేశం కేవలం యుఎస్ లో కాకుండా , ఆసియా ఖండంలోని ఇండియాకు చెందిన, తెలంగాణ రాష్ట్ర రాజధాని భాగ్యనగరం లో సాక్షాత్కారమైంది. ఇప్పటికే మార్కెట్ రంగంలో అతి పెద్ద ఆదాయ వనరు కలిగిన ప్రాంతంగా భారత్ అవతరించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన కంపెనీలన్నీ ఇప్పుడు క్యూ కట్టాయి. ఇండియా వైపు చూస్తున్నాయి. నిన్నటి దాకా ఐటి అంటేనే బెంగళూర్ అనే వారు..లేదంటే చెన్నై ని సూచించే వారు. ఇప్పుడు ఆ సీన్ మారింది.
ఇక్కడ కొలువు తీరిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం వినూత్నమైన ఇండస్ట్రియల్ పాలసీని తీసుకు వచ్చింది. ప్రత్యేకంగా ఐటి చట్టాన్ని తయారు చేసింది. ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. ఎవరికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. అంతా ఆన్ లైన్ లోనే. ప్రవాస భారతీయులతో పాటు ఏ దేశానికి చెందిన వారైనా సరే, ఇక్కడికి వస్తే ప్రభుత్వమే అన్నీ చూసుకుంటుంది. కేవలం ఏడు రోజుల్లో అనుమతులు ఇస్తుంది. దీంతో పారిశ్రామికవేత్తలు , ఔత్సాహికులు , ఆంట్రపెన్యూర్స్ తో పాటు పేరొందిన కంపెనీలన్నీ హైదరాబాద్ ను ఎంచుకుంటున్నాయి. దీంతో ఒక్కసారిగా ఈ నగరం పేరు ఇప్పుడు ప్రపంచంలోనే మరింత పాపులర్ గా మారి పోయింది.
అమెరికాలోని ప్రతి ఐటి కంపెనీలలో మన తెలుగు వారు కనీసం 30 శాతానికి పైగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. మరో వైపు అమెజాన్ అతి పెద్ద ప్రాంగణాన్ని ఏర్పాటు చేసింది. ఈ కామర్స్ రంగంలో అగ్రగామి సంస్థగా ఈ కంపెనీకి పేరుంది. పదివేల మందికి ఉపాధి కల్పించేలా, పది ఎకరాల స్థలంలో నిర్మించారు.15 అంతస్తులలో 30 లక్షల చదరపు అడుగుల స్థలంలో దీని నిర్మాణం చేపట్టారు. ఇందులో పది లక్షల చదరపు అడుగులను పార్కింగుకు కేటాయించారు.
పూర్తిగా అధునాతన నమూనాలో సకల వసతులతో దీనిని నిర్మించారు. అమెజాన్‌కు ప్రస్తుతం ఏడు వేల మంది ఉద్యోగులున్నారు. వచ్చే నెలాఖరు నాటికి ఈ సంఖ్య పది వేలకు చేరనుంది. శంషాబాద్ విమానాశ్రయం వద్ద నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫుల్ ఫిల్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది..400 కోట్ల పెట్టుబడితో దీనిని నిర్మించింది. ఈ ప్రాంగణం నుంచి అమెజాన్ ప్రపంచ వ్యాప్తంగా కార్యకలాపాలను నిర్వహించనుంది. దీని వల్ల మరికొన్ని కంపెనీలు వచ్చే వీలుంది. మరికొన్ని కంపెనీలు వస్తే, కొంత మేరకైనా కొలువులు వచ్చే అవకాశం ఉంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి