అమరావతి భారమేనా..కలగా మిగిలేనా..!

ఎక్కడా లేని రాజకీయాలు ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే ఎక్కువగా ఉంటాయి. ఇక్కడి నాయకులతో పాటు ప్రజలకు చైతన్యం ఎక్కువ. అన్నిటికంటే కోట్లాది రూపాయలు పోగేసుకున్న నాయక గణం ప్రజా సేవ పేరుతో చిలుక పలుకులు పలుకుతున్నాయి. ఓట్లు వేసిన పాపానికి తమ ఇష్టానుసారం పాలన సాగిస్తూ, అడ్డగోలు ఆర్డర్స్ జారీ చేస్తూ జనాన్ని దద్దమ్మలుగా మార్చేశారు. సబ్సిడీలు ఇస్తూ, జనాన్ని సోమరులుగా మార్చేస్తూ గొర్రెల మందగా ప్లాన్ చేసి తమ పబ్బం గడుపుకుంటున్నారు. వీరి నిర్వాకానికి ఇంకో వైపు స్వామీజీలు , పీఠాధిపతుల గోల ఒకటి. మొక్కులు , ఆశీర్వాదాలు అవసరమైతే సన్మానాలు, ఆహా ఓహోలు..మొక్కులు తీర్చు కోవడాలు , యజ్ఞాలు , యాగాలు. వీటి పేరుతో పాలనను పడకేశారు.

తెలంగాణాలో కొలువుల ఊసే లేదు. పేరెత్తితే బంగారు తెలంగాణ. ఎక్కడుందో ..ఎప్పుడు వస్తదో తెలియదు. నియామకాల జాడ లేదు. ఏపీలో వరదలొచ్చి బాధితులు లబో దిబోమంటుంటే అమాత్యులు అధినేత జపం చేస్తున్నారు. టీడీపీపై ఆరోపణలు చేయడంతోనే సరిపోతోంది. తాజాగా జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో , చంద్ర బాబు ఆయన పరివారాన్ని టార్గెట్ చేశాడు. మెలమెల్లగా వారి ఆర్ధిక మూలాలపై దెబ్బ కొట్టుకుంటూ వస్తున్నాడు. మరో వైపు ఆకలి తీరుస్తున్న అమ్మ క్యాంటీన్లను మూసి వేసి వైఎస్ పేరుతో పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఓ వైపు వరదలతో సతమతమవుతుంటే జగన్ అమెరికాకు వెళ్లారని విపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి. ఇక బాబు హయాంలో రూపు దిద్దుకున్న రాజధాని అమరావతి పై కీలక కామెంట్స్ చేశారు మంత్రి బొత్స.

అంతకు ముందు ఇది పల్లపు ప్రాంతం అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి. దీంతో ఈ ప్రాంతం నిర్మాణంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అదనంగా భారం పడుతుందని, దీనిపై పునరాలోచించాల్సిన అవసరం ఉందంటూ పేర్కొన్నారు. ఒకప్పుడు ఇక్కడ భూముల ధరలు అమాంతం పెరిగాయి. కోట్లాది రూపాయలు పోసి కొనుక్కున్న వారంతా ఆందోళనకు లోనవుతున్నారు. అమరావతి పేరు చెప్పి రియల్ ఎస్టేట్ దందా భారీ ఎత్తున జరిగింది. వందల కోట్లు దాటి వ్యాపారం వేల కోట్లకు చేరుకుంది. దీని చుట్టూ అన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సుకత చూపాయి. తాజాగా బొత్స చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనినే నమ్ముకుని కోట్లు కుమ్మరించిన వారి పరిస్థితి ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడి అన్న చందంగా మారింది. ఇక్కడ ఏది నిర్మాణం చేయాలన్నా, లక్ష రూపాయలకు మరో లక్ష అదనపు ఖర్చు అవుతుందని, ఇక్కడ కట్టడాలు సురక్షితం కాదని నిపుణుల కమిటీ సూచించిందని వైసీపీ అంటోంది.

దీనిని బూచిగా చూపించి అమరావతి కేపిటల్ సిటీకి అనువు కాదంటూ , వేరే రాజధాని కోసం ప్లాన్ చేసేందుకు తెలివిగా పావులు కదుపుతోంది. వరదలు వస్తే ఆ ప్రాంతం ముంపునకు గురవుతుందని, తిరిగి ఖర్చు మోయలేనంత భారం అవుతుందని నేతలు బొత్స, విజయ సాయి అంటున్నారు. దీనిపై చంద్ర బాబు నిప్పులు చెరిగారు. తనపై ఉన్న అక్కసుతోనే వైసీపీ ఇలా చేస్తోందని, కావాలంటే తనపై కక్ష తీర్చుకోవచ్చని , కానీ ప్రజలను ఇబ్బందులకు గురి చేసే నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఒప్పుకోమని స్పష్టం చేశారు. దీనిపై వైసీపీ ఘాటుగా జవాబు ఇచ్చింది. త్వరలోనే బాబు అండ్ కంపెనీ చేసిన అడ్డగోలు వ్యవహారాలపై విచారణ జరుగుతుందని , చర్యలు తప్పక ఉంటాయని ఆళ్ళ రామ కృష్ణ రెడ్డి , రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. మొత్తం మీద బాబు , జగన్ ల మధ్య పోరు ఇప్పుడు ఏపీ పాలిట శాపంగా మారింది. మొత్తం మీద అమరావతి రాబోయే రోజుల్లో కలగా మిగిలిపోనుందా అన్నది కాలమే సమాధానం చెప్పాలి. 

కామెంట్‌లు