కోహ్లీ కోరికను తీర్చిన హరికేన్ - మళ్ళీ రవినే కోచ్

ఊహాగానాలకు తెర దించుతూ భారత జట్టు కోచ్ గా మళ్ళీ రవి శాస్త్రినే   టీమిండియా ఎంపిక కమిటీ చైర్మన్ కపిల్ దేవ్ ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు. నిన్నటి దాకా ఈ ఎంపికపై దేశ వ్యాప్తంగా పలు చర్చోప చర్చలు సాగాయి. బీసీసీఐ ఎన్నడూ  లేనంతటి టెన్షన్ అనుభవించింది. భారత్ జట్టు ప్రపంచ కప్ లో సెమి ఫైనల్ లో అనూహ్యంగా ఓడి పోయింది. ఈ సమయంలో అభిమానులు, మాజీ క్రికెటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జట్టు ఎంపిక సక్రమంగా లేక పోవడం వల్ల ఇండియా ఆశించిన రీతిలో ఆడ లేక పోయిందని మండిపడ్డారు. దీంతో కోచ్ ను ఎంపిక చేసేందుకు ప్రత్యేకంగా బీసీసీఐ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. 

చైర్మన్ గా కపిల్ దేవ్ , సభ్యులుగా గైక్వాడ్ ,శాంత రంగస్వామిని నియమించారు. అంతకు ముందు కోచ్ ఎంపిక కోసం బిసిసిఐ నోటిఫికేషన్ ఇచ్చింది. భారీ ఎత్తున క్రికెటర్లు దరఖాస్తు చేసుకున్నారు. కానీ టీమిండియా సారధి విరాట్ కోహ్లీ మాత్రం కోచ్ గా రవి శాస్త్రి నే ఉండాలని కోరారు. ఈ మేరకు తన అభిప్రాయాన్ని జట్టు ఎంపిక కమిటీకి తెలియ చేశారు. ఆయన ప్రత్యేకించి కపిల్ దేవ్ ను సంప్రదించారు. ఆఖరు దాకా కోచ్ వ్యవహారం పై హై డ్రామా నడిచింది . దీంతో చివరి వరకు లీకులు ..వార్తలు వైరల్ అయ్యాయి . మహేళ జయవర్దనే పేరు వినిపించింది. కానీ కోహ్లీ రవి కోసం పట్టుపట్టారు. తన పంతం నెగ్గించుకున్నారు. నిన్న రేపు అంటూ దాటవేస్తూ వచ్చిన ఎంపిక కమిటీ ఎట్టకేలకు చావు కబురు చల్లగా చెప్పింది. మళ్ళీ పాత కోచ్ కే పట్టం కడుతున్నట్టు వెల్లడించడంతో ఇన్ని రోజుల ఉత్కంఠకు తెరపడింది. 
 
భారత్‌లో 2021 వరకు జరిగే టీ20 ప్రపంచ కప్‌ వరకు శాస్త్రి ఈ పదవిలో కొనసాగుతారు.  మొదటగా క్రికెట్‌ మేనేజర్‌ గా, రెండోసారి టీమిండియా డైరెక్టర్‌ గా, మూడోసారి కోచ్‌గా పని చేశారు. కాగా మాజీ ఆటగాళ్లు రాబిన్‌ సింగ్‌, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌, న్యూజిలాండ్‌ మాజీ కోచ్‌ మైక్‌ హెసన్‌, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ టామ్‌ మూడీతో పోటీ పడగా రవిశాస్త్రి గెలిచారు. విండీస్‌ మాజీ క్రికెటర్‌, అఫ్గాన్‌ కోచ్‌ ఫిల్‌ సిమన్స్‌ వ్యక్తిగత కారణాలతో పోటీ నుంచి తప్పుకున్నారు. ‘పోటీలో మూడో స్థానంలో టామ్‌ మూడీ, రెండో స్థానంలో మైక్‌ హెసన్‌ నిలిచారు. మీరంతా అనుకున్నట్టుగా రవిశాస్త్రి అగ్రస్థానంలో ఉన్నారు. పోటీ మాత్రం చాలా హోరా హోరీగా సాగింది’ అని కపిల్‌దేవ్‌  వెల్లడించారు.

కామెంట్‌లు