నల్లమల విలవిల ..అడవి బిడ్డలు వలవల..!


పచ్చని అందాలు , మైమరిచి పోయే ప్రకృతి సౌందర్యం, వానొచ్చినా, మట్టి బిడ్డలు, జంతు జీవాలు కలిసి బతికే అరుదైన నల్లమల ఇప్పుడు విలవిల మంటోంది. ఓ వైపు ఉమా మహేశ్వరం ఇంకో వైపు శ్రీశైలం ఉన్న ఈ అటవీ ప్రాంతం అపారమైన వనరులు, నిధి నిక్షేపాలు కలిగి ఉన్నది. అందుకే దీనిపై అక్రమార్కులు, బడా బాబులు , కేంద్ర, రాష్ట్ర పాలకులు కన్నేశారు. దివంగత ఉమ్మడి రాష్ట్ర సీఎం రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు డీబీర్స్ కంపెనీకి వజ్రాల వేట కొనసాగించేందుకు అనుమతి ఇచ్చారు. దీని వెనుక పెద్ద మతలబే జరిగిందని వార్తలు వచ్చాయి. దేని వెనుక వున్న విధ్వంసంపై అప్పట్లోనే నల్లమలలో వజ్రాల వేట అనే పేరుతో ఓ ప్రత్యేక కథనం రాయడం జరిగింది. ఈ కార్పొరేట్ కంపెనీ చర్యల్ని నిరసిస్తూ నల్లమల అడవి బిడ్డలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. వీరికి ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ కంపెనీ వెనక్కి తగ్గిందని అనుకున్న తరుణంలోనే మరో పిడుగు లాంటి వార్తను ప్రకటించింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం .

పర్యావరణ శాఖ కూడా హుటాహుటిన అనుమతులు కూడా ఇచ్చేసింది. నల్లమలలో అత్యంత ప్రమాదకరమైన, మానవాళి జీవన విధ్వంసం కలిగించే యురేనియంను వెలికి తీసుకోవచ్చంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో నల్లమల పూర్తిగా దోపిడీకి, మోసానికి లోనయ్యే ప్రమాదం పొంచి ఉన్నది. గతంలో చెర్నోబిల్ లాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. ఒకవేళ యురేనియం కోసం అన్వేషణ కొనసాగిస్తే కనీసం మూడు వేల దాకా బోర్లు వేయాల్సి ఉంటుంది. దీని వల్ల చుట్టూ ఉన్న అటవీ ప్రాంతం అంతా ఎండి పోతుంది. పచ్చదనం కోల్పోతుంది. పక్కనే ఉన్న కృష్ణమ్మ పూర్తిగా కాలుష్యపు కోరల్లో చిక్కుకుపోతుంది. భూమి లోపట కొన్నికిలోమీటర్ల మేరకు ఈ కాలుష్యం , దుమ్ము , ధూళి , ప్రమాదకర రసాయనాలు చేరుకున్తయి. దీంతో మనుషుల జీవనం కష్టమవుతుంది. ఆరోగ్య పరంగా తీవ్ర ప్రమాదకర రోగాలకు గురవుతారు. అరుదైన జంతు జీవాలు చనిపోతాయి.

టైగర్ ప్రాజెక్టు పరిధిలోని పులులు ఇక కనిపించవు. ఈ ఒకే ఒక్క యురేనియం దెబ్బకు అతి పెద్ద విస్తీర్ణం కలిగిన నల్లమల పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదానికి నోచుకుంటుంది. అంతే కాదు దాదాపు ఉమామహేశ్వరం నుండి శ్రీశైలం దాకా ఉన్న 100 కిలోమీటర్ల రహదారి పూర్తిగా ధ్వంసమై పోతుంది. రాక పోకలకు ఇబ్బందులు ఏర్పడుతాయి. పర్యాటక పరంగా నష్టం వస్తుంది. అంతే కాకుండా కొన్ని తరాల నుంచి నల్లమలనే నమ్ముకుని బతుకుతున్న అడవి బిడ్డలా బతుకులు బుగ్గి పాలవుతాయి. నల్లమలను రక్షించుందాం ..యురేనియం వద్దంటూ ప్రజా సంఘాలు, విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. అయినా సర్కార్ ససేమిరా అంటోంది. గిరి పుత్రులు మాత్రం మా భూమి నుంచి మమ్మల్ని విడదీయ లేరంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలాగే ఉండగానే భారీగా ఖనిజాలు ఉన్నట్లు టీఎస్ ఎండీసీ గుర్తించింది. అది కూడా తవ్వకాలు చేపట్టేందుకు సమాయత్తమవుతోంది. ఇక హరిత హారం చేపట్టాలని , అడవులను రక్షించు కోవాలని చెబుతున్న సీఎం కేసీఆర్ నల్లమలలో యురేనియం గురించి స్పందించక పోవడంపై విపక్షాలు, ప్రజా సంఘాలు మండి పడుతున్నాయి. మొత్తం మీద నల్లమలను కాపాడు కోవాల్సిన భాద్యత మనందరిపై ఉన్నది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!