అంపశయ్యపై ఆర్టీసీని ఆదుకోలేమా..?

తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించడమే కాదు ...రెండు నెలల పాటు సకల జనుల సమ్మెలో పాల్గొన్న ఘనత ఆర్టీసీ కార్మికులదే. రాష్ట్రం ఏర్పడినా ఈ రోజు వరకు ఎన్నో ఏళ్లుగా పేరుకు పోయిన సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు . రోజు రోజుకు  నెలనెలా జీతాలు ఇవ్వలేని స్థితికి చేరుకుంది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. ఆర్టీసీని కాపాడుకుంటామని చెప్పిన ప్రభుత్వం ..నష్టాల నుంచి గట్టెక్కించేందుకు గట్టి చర్యలు చేపట్టడం లేదని కార్మికులు, యూనియన్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీకి పూర్వ వైభవం రావాలంటే ముందు ఆ సంస్థలో ఏళ్ళ కొద్దీ తిష్ట వేసుకుని కూర్చున్న వారిని తొలగించాల్సి ఉన్నది.

ప్రతి ఏటా బస్సులపై భారం పడుతోంది . ఖాళీలు ఉన్నప్పటికీ ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక ఇబ్బనుడిలా దృష్ట్యా కొత్త వారిని తీసుకునే పరిస్థితి లేదు. దీంతో ఉన్న వారితోనే పని చేయించుకుంటున్నారు . వయసు పైబడిన వారు, రిటైర్మెంట్ కు దగ్గరవుతున్న వారు ఎక్కువ గా ఉన్నారు . వీరిపై పని భారం అధికం అవుతుండడంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి . కార్మిక చట్టాలు ఇక్కడ అమలు కావడం లేదు . ప్రభుత్వం తమ గురించి పట్టించు కోవడం లేదంటూ కార్మికులు ధర్నాలు, ఆందోళనకు దిగారు . ఆమేరకు ఆయా ఆర్టీసీ డిపోల వద్ద గెట్ ధర్నాలు చేపట్టారు. అయినా సర్కార్ స్పందించ లేదు . ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం పూర్తిగా దోపిడీకి లోనైంది . అందులో ఆర్టీసీ మొదటిది .

లెక్కకు మించి ప్రయివేట్ బస్సులను ప్రవేశ పెట్టారు .రాను రాను సిబ్బందిని తగ్గించుకుంటూ వచ్చారు. బస్సుల్లో కండక్టర్ లను లేకుండా చేశారు. నాన్ స్టాప్ బస్సులలో డ్రైవర్లకే టికెట్లు ఇచ్చే భాధ్యతను అప్పగించారు. దీంతో ఇద్దరు చేయాల్సిన పనిని ఇప్పుడు ఒక్కరే మోస్తున్నారు . తీవ్ర వత్తిళ్లకు లోనవుతూ అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నారు . ఈ విషయంపై నిలదీసినా పరిష్కరించే పరిస్థితి లేదు . కొత్త రాష్ట్రంలో తమకు అంతా మంచే జరుగుతుందని భావించిన కార్మికులు ఇప్పుడు లబోదిబో మంటున్నారు. ఆర్టీసీకి  3200 కోట్ల అప్పులు ఉండగా 3308 కోట్ల నష్టాలతో నడుస్తోంది . రాను రాను దీనిని కూడా ప్రయివేట్ పరం చేస్తారేమోనన్న భయంతో బతుకుతున్నారు కార్మికులు . వెయ్యికి కోట్ల రూపాయల దాకా సర్కార్ చెల్లించాల్సి ఉంది. పదవీ విరమణ పొందిన వారికి బెనిఫిట్స్ లేవు .

పెరుగుతున్న డీజిల్ భారం కూడా ఆర్టీసీకి తడిసి మోపెడవుతోంది . కార్మికుల సంక్షేమం కోసం పోగైన డబ్బులను సైతం సంస్థ వాడేసుకుంది . ఒక్క గ్రేటర్ హైదరాబాద్ లోనే 75 శాతానికి పైగా నష్టం రావడం, ప్రైవేట్ ట్రావెల్స్ పై నియంత్రణ లేక పోవడం కూడా ఆర్టీసీకి ఇబ్బందిగా మారింది . పెరుగుతున్న ఆయిల్ ధరలకు అనుగుణంగా చార్జీలు పెంచక పోవడం కూడా ఏయేటికాయేడు నష్టాల భారం అంతకంతకూ పెరుగుతూ వస్తోంది . ఇంత వరకు పాలక వర్గం లేదు . చైర్మన్ , ఎండీ లేరు . అద్దె బస్సులు ఆర్టీసీకి శాపంగా మారాయి . డీజిల్ పై వ్యాట్ తగ్గిస్తే కొంత ఉపశమనం కలుగుతుంది. కాలం చెల్లిన బస్సులను పక్కన పెట్టడం తో పాటు ప్రభుత్వం రాయితీలు కల్పిస్తే గట్టెక్క గలుగుతుందని కార్మికులు అంటున్నారు . రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ స్థలాలను లీజుకు ఇవ్వడం వల్ల భారీగా ఆదాయం సమకూరే వీలు కలుగుతుంది . మొత్తం మీద అంపశయ్యపై ఉన్న ఆర్టీసీని ఆదుకోవాల్సిన భాద్యత ప్రభుత్వంపై ఉంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!