దివికేగిన దిగ్గ‌జ నేత - పెద్ద‌దిక్కును కోల్పోయిన తెలంగాణ - పాల‌మూరు బిడ్డ మ‌రువ‌దు ఈ గ‌డ్డ..!

సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన నాయ‌కుడు ఇక‌లేడు..ఇక రాడు. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరి పోతే నిబిడాశ్చ‌ర్యంతో మీరే అంటూ ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలోని క‌ల్వ‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం మాడ్గుల‌కు చెందిన సూదిని జైపాల్ రెడ్డి తీవ్ర అస్వ‌స్థ‌తో హైద‌రాబాద్ లో క‌ను మూశారు. అద్భుత‌మైన మేధావిగా, రాజ‌కీయ దురంధరుడిగా, అప‌ర చాణుక్యుడిగా, ఉత్త‌మ పార్ల‌మెంటేరియ‌న్‌గా, న‌డిచే ఎన్‌సైక్లోపేడియాగా, ప‌దాల‌కు అర్థాలు వెతుక్కునే డిక్ష‌న‌రీ ఆయ‌న‌. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా ఆయ‌న ఎన్నో ప‌ద‌వులు నిర్వ‌హించారు. లోతైన ప‌రిశీల‌న‌, తార్కిక ప‌రిజ్ఞానం, దేశ‌, అంత‌ర్జాతీయ రాజ‌కీయ ప‌ర‌మైన అవ‌గాహ‌న క‌లిగి ఉన్నారు. అన్నిటికంటే ఆయ‌న గొప్ప భావుకుడు, మాన‌వ‌తావాది, ర‌చ‌యిత‌, చివ‌రి వ‌ర‌కు విలువ‌ల‌కు క‌ట్టుబ‌డి ఉన్న వ్య‌క్తి. జైపాల్ రెడ్డి గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆయ‌న‌తో సంభాషించాల‌న్నా లేక ఇంట‌ర్వ్యూ చేయాలంటే చాలా మంది జ‌ర్న‌లిస్టులు జ‌డుసుకున్న సంద‌ర్భాలు ఎన్నో. 24 ఏళ్ల సుదీర్ఘ‌మైన పాత్రికేయ అనుభ‌వంలో క‌ర‌వుకు కొండ‌గుర్తుగా ఉన్న ఈ జిల్లాకు చెందిన నాకు ఆయ‌న‌ను ఇంట‌ర్వ్యూ చేసే అవ‌కాశం ఓ దిన‌ప‌త్రిక ద్వారా ద‌క్కింది.

లోక్‌స‌భ ఎన్నిక‌లు జ‌రుగుతున్న సంద‌ర్భంలో ల‌భించింది. సామాజికంగా, రాజ‌కీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా, అధ్య‌య‌న‌శీలిగా ఎంత‌టి లోతైన ప‌రిజ్ఞానం ఉందో ప్ర‌త్య‌క్షంగా నాకు తెలిసి వ‌చ్చింది. ఇప్పుడున్నంత అవ‌కాశాలు అప్పుడు లేవు. రేడియోలో వార్తలు  వ‌చ్చేవి. జైపాల్ రెడ్డి గురించిన వార్త‌లు ఎక్కువ‌గా ఉండేవి. ఆయ‌న అసెంబ్లీలో మాట్లాడ‌టం అన్న‌ది వినాల‌న్న కోరిక ఉండేది. చిన్న‌ప్పుడే దుప్ప‌ల్లి గ్రామానికి ఎన్నిక‌ల సంద‌ర్భంగా వ‌చ్చారాయ‌న‌. ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వెళ్లి సంత‌కం తీసుకున్నా. అది మ‌రిచి పోలేని అనుభ‌వం. ఎప్పుడైతే సిగ్నేచ‌ర్ తీసుకున్నానో ..ఆరోజే డిసైడ్ అయ్యాను. ఏదో ఒక‌రోజు ఆయ‌న‌తో సంభాషించే రోజు వ‌స్తుంద‌ని. జ‌ర్న‌లిస్టుగా ఇది మ‌రిచి పోలేని జ్ఞాప‌కం. ఒక‌టా రెండా అనేక ర‌క‌మైన అంశాల గురించి మాట్లాడారు. ప్ర‌శ్నించ‌డం కూడా మ‌రిచి పోయేంత‌గా..అంత లోతుగా విడ‌మ‌రిచి చెప్ప‌డం ఆశ్చ‌ర్యం అనిపించింది. ఆయ‌న చేతిలో ఎప్పుడూ ఏదో ఒక పుస్త‌కం అంటూ ఉండేది. క్ర‌మం త‌ప్ప‌కుండా చ‌ద‌వ‌డం, నోట్స్ రాసుకోవ‌డం, ఏది మాట్లాడినా ఆచి తూచి పొల్లు పోకుండా చెప్ప‌డం బ‌హుషా ఆయ‌న‌కు మాత్ర‌మే చెల్లింది. అలా మొద‌లైన ప్ర‌యాణం నేటి దాకా కొన‌సాగుతూ వ‌చ్చింది.

వృత్తి ప‌రంగా ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా ..జైపాల్‌రెడ్డి పాలమూరుకు వ‌స్తున్నాడంటే చాలు ..మా రిపోర్ట‌ర్ల‌ను పుర‌మాయించ‌డం..వార్త‌లు తెప్పించు కోవ‌డం..ఏదైనా కొత్త విష‌యం చెబుతాడేమోన‌ని ..ఆతృత‌గా ఎదురు చూడ‌డం అల‌వాటుగా మారింది. ఉస్మానియా యూనివ‌ర్శిటీలో ఆయ‌న జ‌ర్న‌లిజం కోర్సు చ‌దివారు. అది కూడా కుండ బ‌ద్ద‌లు కొట్టేలా..ముక్కుసూటిగా మాట్లాడేలా చేసేందుకు దోహ‌ద‌ప‌డింద‌నుకుంటా. ఘ‌న‌మైన చ‌రిత్ర క‌లిగిన తెలంగాణ‌కు ఎంత క‌థ వున్న‌దో ..సూదిని జైపాల్‌రెడ్డికి కూడా అంతే క‌థ ఉన్న‌ది. తెర ముందు కేసీఆర్ నాయ‌కుడిగా క‌నిపిస్తే..తెర వెనుక మంత్రాంగం న‌డిపింది..తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యేలా చేయ‌డంలో కీల‌క భూమిక పోషించింది మాత్ర‌మే సూదిని జైపాల్‌రెడ్డేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. భార‌త రాజ్యాంగం ఆయ‌న‌కు కంఠ‌త‌హ వ‌చ్చు. అప‌రిమిత‌మైన మేధోత‌నం ఆయ‌న స్వంతం. వైక‌ల్యం అన్న‌ది శారీర‌కంగా ఎంతో ఇబ్బందుల‌కు గురి చేసినా..ఆయ‌న మొక్క‌వోని ధైర్యం, ప‌ట్టుద‌ల ముందు అది ఓడి పోయింది.

చిన్న‌ప్ప‌టి నుంచి నేడు చ‌నిపోయేంత దాకా ఆయ‌న పార్టీలు మారి ఉండ‌వ‌చ్చు..కానీ సైద్ధాంతిక‌ర‌మైన విలువ‌ల‌కు చివ‌రి వ‌ర‌కు క‌ట్టుబ‌డే ఉన్నారు. ఎంద‌రితో విభేదించినా స‌రే..త‌ను న‌మ్ముకున్న సిద్ధాంతాన్ని ఆయ‌న ఏనాడూ విడిచి పెట్ట‌లేదు. ఇంకొక‌రైతే త‌మ కుటుంబీకుల‌ను తీసుకు వ‌చ్చే వారేమో..కానీ జైపాల్‌రెడ్డి త‌న వారికి ప్రేమ‌ను పంచారు. కుటుంబ పెద్ద‌గా తోడుగా ఉన్నారు. కానీ ఏనాడూ జోక్యం చేసుకోనీయ‌లేదు. వృత్తి వేరు..కుటుంబం వేరు. రాజ‌కీయం వేరు..బంధం వేరు.అని న‌మ్మారు ఆయ‌న‌. ఇవాళ పాల‌మూరు మ‌ట్టికి తీర‌ని లోటు. తెలంగాణ రాష్ట్రానికి పెద్ద దిక్కు..దేశానికి బెస్ట్ పార్ల‌మెంటేరియ‌న్ దూరం కావ‌డం విషాద‌క‌రం. బాధాక‌రం. ఎన్నో అవార్డులు..మ‌రెన్నో పుర‌స్కారాలు..అందుకున్న గొప్ప పొలిటిషియ‌న్‌ను కోల్పోవ‌డం వ్య‌క్తిగ‌తంగా లోటే. ప్రింట్, మీడియా, సామాజిక మాధ్య‌మాల‌లో ప‌నిచేయాల‌నుకునే వారు త‌ప్ప‌క జైపాల్‌రెడ్డిని చ‌ద‌వాలి. ఆక‌ళింపు చేసుకోవాలి. ఎలా మాట్లాడాలో ..ఏం మాట్లాడ‌కూడ‌దో..ఎలా రాయాలో ..ఎక్క‌డ దేనిని వ‌దిలి పెట్టాలో తెలుస్తుంది. భౌతికంగా లేక పోయినా సూదిని జైపాల్ రెడ్డి ప్ర‌జ‌ల మ‌దిలో ప‌దిలంగా ఉన్నారు. 

కామెంట్‌లు