సామాజిక మాధ్యమాలు..ప్రజా చైతన్యానికి ప్రతీకలు..!
ప్రచురణ, ప్రసార మాధ్యమాలు అనేవి లేకపోతే ప్రపంచం ఎప్పుడో జనాన్ని నట్టేట ముంచి వుండేది. ప్రశ్నించే హక్కుల్ని కోల్పోతే ఎన్ని వున్నా ఏం లాభం. జీవితం వ్యర్థమే. ప్రతి చోటా ఎక్కడో ఒక చోట ఈ లోకంలో నిరసనలు, ఆందోళనలు, పోరాటాలు, నిలదీయడాలు, శాంతియుతంగా ధర్నాలు, రాస్తారోకోలు, సమ్మెలు..కొనసాగుతూనే ఉన్నవి. నిత్యం వాటికి ఎక్కడో ఒక చోట స్పేస్ దొరుకుతోంది. యుద్ధం అనివార్యమైన చోట..శాంతికి తావుండదు..ఇక పోరాటం మాత్రమే మిగిలి ఉంటుంది. మౌనంగా చూస్తూ భరించడం కూడా నేరమే అంటాడు దాస్తోవస్కీ ఓ సందర్భంలో. ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసిన మార్పుల్లో..మొదట మాగ్నాకార్టనే. ఆ తర్వాత ఎన్నో పోరాటాలు చోటు చేసుకున్నాయి. లక్షలాది మంది జనం ఆధిపత్య పోరులో అంతమై పోయారు. నామ రూపాలు లేకుండా ..చరిత్ర దరిదాపుల్లోకి రాకుండా పోయారు. ఇది విషాదకరమైన సన్నివేశం. ఎంత చెప్పినా తక్కువే. బలిదానాలు చేసిన వాళ్లు, త్యాగాలు చేసిన వాళ్లు మరెందరో. వీరికి చరిత్ర పుటల్లో చోటు దక్కలేదు.
మహాకవి శ్రీశ్రీ అనలేదా..నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని. అందుకేగా కార్ల్ మార్క్స్ ఆక్రోశించింది. సర్ ప్లస్ థియరీని తీసుకు వచ్చింది. టెక్నాలజీ మారినా..సమస్యలు అలాగే ఉన్నాయి. ఇంకా అంతరాలు ఎక్కువయ్యాయి. ప్రతి ఒక్కరు సమానమే అన్న నినాదం దిగంతాలకు వ్యాపించినా..ఆచరణలో ఇంకా ప్రారంభంలోనే ఉన్నది. అధికారం, రాజకీయం, వ్యాపారం, మీడియా , మాఫియా , ఆర్థిక నేరాలు..కార్పొరేట్ కంపెనీల ఆధిపత్యాలు ప్రతి చోటా తమ చెప్పుచేతుల్లో ఉంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకే కేసులు, అక్రమ బనాయింపులు, రాజీ పడ్డామా ఓకే లేకపోతే భౌతికంగా లేకుండా చేయడాలు షరా మామూలై పోయాయి. ఏ ప్రజల కోసం ..ఏ సమాజం కోసం ఏర్పాటు చేసుకున్నామో ..సామాన్యులకు అండగా, ఆసరాగా, తోడ్పాటు అందిస్తున్నాయని భావిస్తున్నామో అవన్నీ అట్టడుగు వర్గాలను నిర్దద్వందంగా తిరస్కరించాయి. గడీల పాలనలో దారుణాల గురించి మాట్లాడటం మానేసినవి. ఏ పార్టీలో పవర్‌లో ఉన్నా సరే ప్రభుత్వాలకు వంత పాడుతున్నాయి.
నమ్ముకున్న ప్రింట్, మీడియా రంగాలన్నీ డబ్బుకలిగిన వారికి, కార్పొరేట్ కంపెనీలకు, వ్యాపారులకు వంత పాడుతున్నాయి. మరికొన్ని పొలిటికల్ పార్టీలకు వాయిస్ బాక్సులుగా ఉపయోగ పడుతున్నాయి. ఈ సమయంలో గత కొంత కాలంగా ప్రపంచ వ్యాప్తంగా గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంటర్నెట్ డేటా యాక్సెసబిలిటీ పెరగడం, టెక్నాలజీ అప్ డేట్ కావడంతో ఒక్కసారిగా మొబైల్ కనెక్టివిటీ ప్రపంచాన్ని ఒక్కటిగా మార్చేసింది. ఎక్కడ ఏం జరిగినా..ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరిగినా క్షణాల్లో లోకమంతటా వైరల్ అవుతోంది. ఎప్పుడైతే సామాజిక మాధ్యమాలు ఎంటరయ్యాయో ..మీడియా మాఫియా ఆధిపత్యానికి గండి పడింది. అన్ని మాధ్యమాలు సోషల్ మీడియాపైనే ఆధారపడుతున్నాయి.
దీంతో సామాన్యులకు తమకు దిక్కెవరూ అంటూ బాధ పడుతున్న సమయంలో సామాజిక మాధ్యమాలు భరోసా కల్పించాయి. బాసటగా నిలిచాయి. అనేక పోరాటాలకు ప్రపంచ వ్యాప్తంగా వెన్ను దన్నుగా నిలిచాయి. వాట్సప్ దెబ్బకు ఇపుడు వరల్డ్ షేక్ అవుతోంది. అంతెందుకు..నిన్న జరిగిన తెలంగాణ రాష్ట్ర సాధనకోసం జరిగిన పోరాటానికి పెద్ద ఎత్తున మద్ధతుగా నిలిచినవి ఈ మాధ్యమాలే. ఇపుడు ప్రజల చేతుల్లో ఆయుధాలు లేక పోవచ్చు.. రాకెట్లను తయారు చేయలేక పోవచ్చు..కానీ అంతకంటే పవర్ ఫుల్ వెపన్స్ వీరి చేతుల్లో ఉన్నాయి. అవే సామాజిక మాధ్యమాలు. ప్రజా చైతన్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. ఇక మన కథలు మనమే చెప్పుకునే ప్లాట్‌ఫాం మనకు ఉండనే ఉంది. ఇంకెందుకు ఆలస్యం..మీ వాయిస్ మీ ఇష్టం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి