ఆతిథ్య జట్టే జగజ్జేత - ఇంగ్గండ్ విశ్వ విజేత - ఆద్యంతమూ ఉత్కంఠ భరితం
క్రికెట్ లెజెండ్స్ అంచనాలు తప్పు కాలేదు. అతిరథ మహా జట్లను మట్టి కరిపించి క్రికెట్ వరల్డ్ కప్ ను ఆతిథ్య జట్టు ఇంగ్లండ్ సగర్వంగా ముద్దాడింది. అనూహ్యమైన పరిణామాలు..ఉత్కంఠ భరితమైన క్షణాలు..వెరసి మ్యాచ్ తో పాటూ సూపర్ ఓవర్ కూడా టై కావడంతో ఏం జరుగుతుందో తెలియక ఫ్యాన్స్ గుండెల్ని బిగపట్టుకుని వీక్షించారు. అంతా అనుకున్నట్టే జరిగింది. టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుంచి ఇంగ్లండ్ జట్టే హాట్ ఫెవరేట్ జట్టుగా నీరాజనాలు అందుకుంది. అంతకంటే ఎక్కువగా బెట్టింగ్ రాయుళ్లు కూడా ఆ జట్టు మీదే కోట్లు పాడారు. ఇంగ్లండ్, కీవీస్ జట్ల మధ్య జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ క్రికెట్ ప్రేమికులకు ఎనలేని ఎంజాయ్‌ని కలుగ చేసింది. ఇదీ క్రికెట్ అంటే. అందుకే దీనికి అంతటి క్రేజు..ఆపై తీరని మోజు కూడా. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన ఫైనల్ పోరులో ఇంగ్లాండ్‌ను గెలుపు తీరాలకు తీసుకు వెళ్లింది మాత్రం స్టోక్స్ ఒక్కడే. ఇపుడు ఆ జట్టు తరపున అతడే రియల్ హీరో.
ఆతిథ్య దేశమే అయినప్పటికీ ..క్రికెట్ పుట్టినిల్లు మాత్రం ఆంగ్లేయులదే. ఇన్నేళ్లుగా ప్రపంచ కప్ జరుగుతూనే ఉన్నా..ఏ ఒక్కసారి దానిని అందుకోలేదు ఇంగ్లండ్ టీం. మొదటి సారిగా వరల్డ్ కప్‌ను ఎగరేసుకు పోయింది. ఎన్నో దశాబ్దాలుగా కలలు కంటూ వస్తన్నది ఆ జట్టు. ఎన్నో సంవత్సరాలుగా తపస్సులాగా శ్రమిస్తోంది. చివరి అంచుల దాకా వచ్చి..ఓటమి పలకరిస్తుందేమోనన్న బెంగ ఆ జట్టు ఆటగాళ్లను పీడించింది. వాటన్నింటిని తట్టుకుని ఇంగ్లండ్ జట్టు సగర్వంగా ప్రపంచ కప్ ఛాంపియన్ గా నిలిచింది. తామే నిజమైన ప్రొఫెషనల్స్ టీం అంటూ లోకానికి చాటి చెప్పింది. ఇంగ్లండ్ జట్టు టోర్నీలో అడుగు పెట్టినప్పటి నుంచి ఓ ప్లాన్ ప్రకారం ఆడింది. ఎక్కడా తడబడలేదు. ఒకానొక దశలో అపజయం వరిస్తుందేమోనన్న ఆందోళన కలిగినా..చివరి వరకు మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. కష్టాల్లో ఉన్న తమ జట్టుకు దేవుడిలా వచ్చాడు స్టోక్స్. దుమ్ము రేపాడు.
కీవీస్‌ను ఓ ఆట ఆడుకున్నాడు. తన టీంకు మేలు చేకూర్చాడు. కప్ సాధనలో కీలక పాత్ర పోషించాడు. తుది పోరు క్రికెట్ ఫ్యాన్స్‌లో ఉత్కంఠ రేపింది. ఉద్వేగాన్ని కలిగించింది. జట్టు బాధ్యతనంతా స్టోక్స్ ఒక్కడే మోశాడు. ఆశలు సన్నగిల్లిన సమయంలో ఆపద్భాందవుడిగా వచ్చాడు. స్కోరును సమం చేశాడు. దీంతో టెన్షన్ నెలకొంది. సూపర్ ఓవర్ ప్రకటించారు అంపైర్స్. అది కూడా ఈక్వల్ అయింది. దీంతో ఎవరు గెలిచారు అన్న ఉత్కంఠ ఎక్కువై పోయింది. దీంతో డగ్ వర్త్ లూయిస్ నియమ నిబంధనల ప్రకారం ..ఏ మ్యాచ్‌లోనైతే ఏ జట్టు అయినా ఫోర్లు, సిక్సర్లు ఎక్కువగా సాధిస్తే ..ఆ జట్టే విజేతగా ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో మొత్తం ఇరు జట్ల స్కోర్‌ను..కొట్టిన ఫోర్లు, సిక్సర్లను పరిగణలోకి తీసుకున్నారు. దీంతో ఇంగ్లండ్‌కే ఎక్కువగా ఫోర్లు ఉండడంతో ..విజేతగా ప్రకటించారు.
దీంతో కీవీస్ తీవ్ర నిరాశకు లోనైంది. గెలుపు అంచుల దాకా వచ్చి పోరాడిన ఆ జట్టు అనుకోని రీతిలో ఓటమిని చవి చూసింది. అంతకు ముందు టాస్ గెలిచి న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. నికోల్స్ 55 పరుగులు చేయగా లేథమ్ 47 పరుగులు చేసి రాణించడంతో ఆ జట్టు 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. ఛేదనలో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టును కీవీస్ బౌలర్లు ముప్పు తిప్పలు పెట్టారు. ఆ జట్టు లో బెన్ స్టోక్స్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. కీవీస్ బౌలర్లను చాలా తెలివిగా అడ్డుకున్నాడు. 98 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు 2 సిక్సర్లతో అడ్డు గోడలా నిలిచాడు. ఏకంగా 84 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 50 ఓవర్లలో సరిగ్గా 241 పరుగులు చేసి ఇంగ్లండ్ జట్టు ఆలౌట్ అయింది.సూపర్ ఓవర్ కూడా టైగా ముగియడంతో.. మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. స్టోక్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి