బల నిరూపణ సక్సెస్..రమేష్ కుమార్ రాజీనామా..!
కన్నడ నాట నిన్నటి దాకా ఉన్న ఉత్కంఠకు ఒకే ఒక్క బల నిరూపణలో సక్సెస్ కావడంతో తెర పడింది. ప్రజా వేదికగా విశ్వాస పరీక్షకు రెడీ కావాలని, తమకున్న బలం ఏమిటో విధానసభలో నిరూపించు కోవాలని స్పీకర్ స్పష్టం చేశారు. తనకు విశేషమైన అధికారాలు ఉన్నాయని, తాను రాజ్యాంగబద్దంగా ఎన్నికైన వ్యక్తినంటూ ఆయన సుదీర్ఘమైన ప్రసంగం చేశారు. దీంతో రెబల్ ఎమ్మెల్యేలు కొందరు ముంబయికి వెళ్లడం, అక్కడ హోటళ్లలో గడపడం, కొందరు ఉన్నట్టుండి ఆరోగ్యం సరిగా లేదంటూ చిలుక పలుకులు పలకడం, చివరకు ఇదేమీ వర్కవుట్ కాక పోవడంతో తాము చేసిన రాజీనామాలు ఆమోదింప చేసేలా ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ సర్కార్ చివరి వరకు వేచి చూసే ధోరణిని అవలంభించింది. ఓ వైపు కుమార స్వామి, మరో వైపు సిద్దిరామయ్యతో పాటు ట్రబుల్ షూటర్‌గా పేరొందిన డీకే శివకుమార్ సైతం ఆఖరి వరకు విశ్వ ప్రయత్నాలు చేశారు. అయినా ఫలితం లేక పోయింది.
దేశ వ్యాప్తంగా కర్నాటక విధాన సభలో జరుగుతున్న బలపరీక్షకు సంబంధించిన ప్రతి సన్నివేశాన్ని టెలికాస్ట్ చేసేలా స్పీకర్ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా ఈ నిర్ణయం వైరల్‌గా మారింది. ఇంకో వైపు ఎట్టి పరిస్థితుల్లోను బలపరీక్ష నిర్వహించి తీరాల్సిందేనంటూ గవర్నర్ ఆదేశించారు. ఆ మేరకు లేఖ కూడా పంపించారు. అయినా స్పీకర్ ఒప్పుకోలేదు. డోంట్ కేర్ అన్నారు. అసలు స్పీకర్‌ను ఆదేశించే అధికారం గవర్నర్‌కు, సుప్రీంకోర్టుకు లేదని తేల్చి చెప్పారు. దీంతో అటు కోర్టు, ఇటు గవర్నర్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సర్వోన్నత న్యాయస్థానం మాత్రం స్పీకర్ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని, రాజ్యాంగరీత్యా ఆయనకు విశిష్టమైన అధికారాలు ఉన్నాయని, అయినా దాని ఆధారంగా విచక్షణా రహితంగా వ్యవహరిస్తానంటే చూస్తూ ఊరుకోబోమంటూ హెచ్చరించింది ధర్మాసనం. దీంతో స్పీకర్ పునరాలోచనలో పడినట్టు కనబడినా..ఏకంగా బలపరీక్షకు రెడీ కావాల్సిందిగా సీఎం కుమార స్వామికి తెలిపారు. దీంతో ప్రభుత్వానికి అనుకూలంగా 99 ఓట్లు రాగా విపక్షానికి 105 ఓట్లు పడ్డాయి. దీంతో సంకీర్ణ సర్కార్ కూలిపోయింది.
ఈ నేపథ్యంలో అప్పటికప్పుడు స్పీకర్ ..ముగ్గురు రెబల్స్ పై వేటు వేశారు. ఆ తర్వాత మరికొందరిని డిస్ క్వాలిఫై చేస్తూ ఆదేశించడం కలకలం రేగింది. ఆరోగ్యం బాగా లేదని చెప్పిన ఎమ్మెల్యేలు సరైన ఆధారాలు చూపించలేక పోయారని తెలిపారు. సీఎంగా యెడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. కానీ మంత్రివర్గంను ఏర్పాటు చేయలేక పోయారు. దీంతో తాను కూడా బలనిరూపణ చేసుకోవాలని స్పీకర్‌తో పాటు గవర్నర్ కూడా ఆదేశించడంతో యెడ్డీ మరో సారి బలపరీక్ష కు రెడీ అయ్యారు. ఆయన సక్సెస్ కావడంతో ముచ్చటగా నాలుగోసారి కర్నాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. దీంతో అటు వైపు విశ్వాస పరీక్ష నెగ్గడంతో స్పీకర్ రమేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్ ఆయన స్థానంలో బాధ్యతలు స్వీకరించారు.
రాజీనామా చేసిన వెంటనే రమేష్ కుమార్ నేరుగా హైదరాబాద్ వచ్చారు. ఇక్కడ కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. విలువలకు కట్టుబడి ఉన్నానని, ఏ రోజు పదవుల కోసం ఆశ పడలేదన్నారు స్పీకర్. కాగా ఎమ్మెల్యేలపై వేటు వేయడాన్ని ఆయన సమర్థించుకున్నారు. అయితే ఎవరిపై రివెంజ్ తీసుకోనని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యెడ్యూరప్ప స్పష్టం చేశారు. అంతకు ముందు విధాన సభలో ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. స్పీకర్‌గా చివరి మాటలు మాట్లాడారు రమేష్ కుమార్. సోనియా గాంధీ కోరడం వల్లనే తాను స్పీకర్ పదవిని చేపట్టానని చెప్పారు. పనిచేసినంత కాలం తాను ప్రతి అంశాన్ని జనం కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నానని తెలిపారు. పూర్తి కాలపు కేబినెట్‌ను కసరత్తు చేసేందుకు యెడ్యూరప్ప ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కొత్త కేబినెట్‌లో ఎవరు ఉంటారో, ఎవరికి చోటు దక్కుతుందనేది కన్నడ వాసులను తొలచి వేస్తోంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి