ఇక సెలవు..పదవికి బైబై..రాహుల్ రాం రాం..!
ఇండియాలో రాజకీయం అంటే రణరంగాన్ని తలపింప చేస్తోంది. ఎత్తులకు పై ఎత్తులు వేయాలి. ప్రత్యర్థుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతూ వుండాలి. వీలైతే వారిని డీమోరలైజ్ చేసేందుకు కుట్రలు పన్నాలి. వీలైతే తిమ్మిని బొమ్మి చేయాలి. డబ్బులు వెదజల్లాలి. సోషల్ మీడియాలో ఎప్పుడూ ప్రచారం చేస్తూనే ఉండాలి. అంతే కాకుండా మీడియా మేనేజ్‌మెంట్ లో ఆరితేరి ఉండాలి. సెలబ్రెటీలు, మోస్ట్ పాపులర్ పర్సనాలిటీస్ తో పాటు బిజినెస్ టైకూన్స్, కార్పొరేట్ కంపెనీల సపోర్ట్ తీసుకోవాలి. వీలైతే అవతలి పార్టీల నేతలకు గాలం వేయాలి, కోట్లు కుమ్మరించాలి. ఎవరికీ తెలియకుండా గల్లీ స్థాయి నుండి ఢిల్లీ దాకా ఎవరికీ తెలియకుండా డబ్బులు చేరవేయగలగాలి. ప్రత్యర్థి పార్టీలపై నిత్యం విషం కక్కుతూనే వుండాలి. చివరకు జనాన్ని ప్రభావితం చేసేందుకు మద్యాన్ని విచ్చలవిడిగా సరఫరా చేయాలి.
ఇన్ని చేస్తే గెలుపు దక్కుతుందా అంటే అదీ లేదు. అనుమానం కలిగితే పోలింగ్ సరళిని మార్చేసే సాంకేతిక నైపుణ్యాన్ని మేనేజ్ చేయగలగాలి. ఇవన్నీ చేయగలిగే పార్టీలే ఇపుడు భారతదేశంలో పవర్‌లో కొనసాగుతున్నాయి. ఇటీవల అధికారంలోకి రాగలిగినయి. ప్రచురణ, ప్రసార, సామాజిక మాధ్యమాలలో అనుభవం కలిగిన సంస్థలకు, కన్సల్టెంట్లకు ఎక్కడలేనంత డిమాండ్ ఏర్పడింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఒడిస్సాకు చెందిన ప్రశాంత్ కిషోర్‌కు 200 కోట్లకు పైగా చెల్లించినట్లు అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. ఆయా పార్టీలు మీడియా మేనేజ్‌మెంట్ కంపెనీలను ఆశ్రయిస్తున్నాయి. అందుకే ఢిల్లీతో పాటు కాస్మోపాలిటన్ సిటీలలో ఇవి ఏర్పాటయ్యాయి. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే , అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది ఈ పార్టీ పరిస్థితి. దేశ వ్యాప్తంగా గ్రామ స్థాయి నుండి దేశ రాజధాని వరకు విస్తృతమైన కేడర్ కలిగి ఉన్నా ఆశించిన మేర సక్సెస్ కాలేక పోయింది. జనరేషన్ మారింది, టెక్నాలజీ అప్ డేట్ అవుతోంది.
కానీ సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ నేతలు , బాధ్యులు ఉన్న చోటనే వుండి పోయారు. దీంతో ఊహించలేని షాక్‌కు గురయ్యారు. ఎన్నడూ లేనంతగా 100 ఏళ్ల కాలంలో పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ పార్టీ ఇపుడు అంపశయ్యపై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. మాజీ ప్రధాని, దివంగత పీఎం పాములపర్తి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీ ఒక వెలుగు వెలిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ ఆదరణ కోల్పోయింది. ఆయా ప్రాంతాల వారీగా చిన్న పార్టీలు తమ హవాను కొనసాగిస్తున్నాయి. కష్ట కాలంలో సోనియా గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత ఆమె తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో పార్టీకి తాను పూర్తి స్థాయిలో సేవలందించలేనంటూ చేతులెత్తేశారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితిలో తన కుమారుడు రాహుల్ గాంధీని భావి ప్రధాన మంత్రిగా ప్రొజెక్టు చేస్తూ సీనియర్లు వంత పాడడం మొదలు పెట్టారు.
పార్టీని బలోపేతం చేయడంలో రాహుల్ పూర్తిగా విఫలమయ్యారు. ఓ వైపు బీజేపీ చాప కింద నీరులా పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళుతుంటే, కాంగ్రెస్ పార్టీ సీనియర్లను నమ్ముకుని ముందుకెళ్లింది..బొక్క బోర్లా పడింది. దేశ వ్యాప్తంగా తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేక చతికిల పడింది. దీంతో రాహుల్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఇక పార్టీకి గుడ్ బై చెప్పేశారు. తాను అధ్యక్షుడిగా వుండలేనంటూ చేతులెత్తేశారు. షాక్‌కు గురైన ఆపార్టీ ప్రియాంక గాంధీ వైపు చూస్తోంది. ఆమెతోనైనా పార్టీ పూర్వ వైభవాన్ని పొందుతుందా లేక మీనమేషాలు లెక్కిస్తూ ఉన్న చోటనే ఉండిపోతుందా అన్నది వేచి చూడాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి