రాయుడు రిటైర్మెంట్ ..అంత‌ర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై

క‌ష్ట కాలంలో ఉన్న‌ప్పుడు క్రికెట్ జ‌ట్టుకు అడ్డు గోడ‌లా నిలిచి ..ఒడ్డుకు చేర్చే అరుదైన ఆట‌గాళ్ల‌లో ఒక‌డిగా పేరు తెచ్చుకున్న తెలుగు వాడైన అంబ‌టి రాయుడు అనూహ్యంగా , ప్ర‌పంచ క‌ప్ టోర్నీ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఇక నేనాడ‌లేనంటూ రిటైర్మెంట్ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. అంత‌ర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెపుతున్న‌ట్లు వెల్ల‌డించారు. వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీలో త‌న‌కు ఛాన్స్ ఇవ్వ‌క పోవ‌డంతో గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో అన్ని ఫార్మాట్‌ల నుండి వైదొలుగుతున్న‌ట్లు తెలిపారు. మ్యాచ్ లు జ‌రిగేట‌ప్పుటు ఏ జ‌ట్టుకైనా కీల‌కం నాలుగో స్థానానిదే. ఆ ప్లేస్‌లో వ‌చ్చే ఆట‌గాళ్లు కీల‌క‌మైన క్రికెట‌ర్స్‌గా పేర్కొంటారు. జ‌ట్టును ఆదుకోవాల‌న్నా, నిల‌దొక్కుకునేలా చేయాల‌న్నా, స్కోరును నెమ్మ‌దిగా ప‌రుగులు పెట్టించాల‌న్నా ఈ ప్లేస్‌లో వ‌చ్చే ఆట‌గాళ్లే కీల‌కంగా ఉంటారు. అదే స్థానంలో గ‌త కొన్నేళ్లుగా అంబ‌టి ఆడుతూ వ‌స్తున్నారు.

గ‌త ప‌దేళ్ల‌లో యువ‌రాజ్ సింగ్, సురేష్ రైనాలు ఇదే ప్లేస్‌లో ఆడుతూ టీమిండియాకు గెలుపుల్లో కీల‌క పాత్ర పోషిస్తూ వ‌చ్చారు. వీరిద్ద‌రూ దూర‌మ‌య్యాక వారి స్థానంలో ఎంత మంది ఆట‌గాళ్లు వ‌చ్చినా నిల‌దొక్కుకోలేక పోయారు. కెఎల్ రాహుల్, ర‌హానే, మ‌నీష్ పాండే, దినేష్ కార్తీక్, కేదార్ జాదవ్, ధోనీ ఇలా ఆ ప్లేస్‌లో జ‌ట్టు మేనేజ్‌మెంట్ ఆడించింది. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. వీరి స్థానాన్ని రాయుడు భ‌ర్తీ చేశాడు. కావాల్సిన‌న్ని ప‌రుగులు చేశాడు. కీల‌క స‌మ‌యాల్లో జ‌ట్టును ఆదుకున్నాడు. ఇటీవ‌ల జ‌రిగిన ఆస్ట్రేలియా సిరీస్‌లో ఫెయిల‌య్యాడు. ప్ర‌పంచ క‌ప్‌లో చోటు ద‌క్కుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ బీసీసీఐ రాయుడును ప‌క్క‌న పెట్టింది. నిల‌క‌డ‌లేని కార‌ణంతో ప‌క్క‌న పెట్టిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఇది రాయుడును ఎంత‌గానో నిరాశ‌కు లోను  చేసింది.

ప్ర‌పంచ క‌ప్ టోర్నీలో ఆట‌గాళ్లు గాయాల‌తో దూర‌మ‌వుతుంటే త‌న‌కు పిలుపు వ‌స్తుంద‌ని ఆశించాడు అంబ‌టి. కానీ అత‌నికి ఛాన్స్ ద‌క్క‌లేదు. విజ‌య్ శంక‌ర్‌ను జ‌ట్టుకు ఎంపిక చేశారు. ఆ త‌ర్వాత అత‌డిని స్టాండ్ బై ప్లేయ‌ర్‌గా ప్ర‌క‌టించారు. శిఖ‌ర్ ధావ‌న్ గాయంతో వైదొల‌గ‌గా పంత్‌కు అవ‌కాశం ద‌క్కింది. విజ‌య్ శంక‌ర్ కూడా గాయాల పాలు కావ‌డంతో రాయుడు త‌నను ఎంపిక చేస్తార‌ని భావించాడు. చివ‌ర‌కు నిరాశే మిగిలింది. ఒక్క వ‌న్ డే కూడా ఆడ‌ని మ‌యాంక్ అగ‌ర్వాల్ ను సెలెక్ట్ చేశారు. దీంతో షాక్ కు గురైన రాయుడు , సుదీర్ఘ‌మైన రాజీనామా లేఖ‌ను బీసీసీఐకి పంపించాడు. ఇక తాను ఆడ‌లేనంటూ ప్ర‌క‌టించేశాడు. ఒక్క‌సారిగా ఎంతో భ‌విష్య‌త్ ఉన్న ఈ క్రికెట‌ర్ ఇలా అర్ధాంత‌రంగా వైదొల‌గ‌డంపై ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే రాయుడు దుందుడుకు స్వ‌భావ‌మే అత‌డిని క్రికెట్ నుంచి దూరం చేసింద‌న్న ఆరోప‌ణ‌లు లేక‌పోలేదు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!