త‌ల‌వంచిన ఆస్ట్రేలియా..నిలిచిన ఇండియా - మెరిసిన ఆట‌గాళ్లు..మురిసిన అభిమానులు..!

తాజాగా జ‌రుగుతున్న ప్ర‌పంచ‌క‌ప్ పోటీల్లో హాట్ ఫెవ‌రేట్ జ‌ట్టుగా భావిస్తున్న ఆస్ట్రేలియా జ‌ట్టు కోహ్లి సేన ముందు త‌ల‌వంచ‌క త‌ప్ప‌లేదు. చివ‌రి వ‌ర‌కు పోరాడినా గెలవ‌లేక చ‌తికిల‌ప‌డ్డారు కంగారూలు. ఇరు జ‌ట్లు స‌మ ఉజ్జీలు కావ‌డంతో మ్యాచ్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా జ‌రిగింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన ఇండియా జ‌ట్టు ఓపెనింగ్ జోడి అద‌ర‌గొట్టింది. ఎలాంటి త‌డ‌బాటుకు లోనుకాకుండా శిఖ‌ర్ ధావ‌న్ , రోహిత్ శ‌ర్మ‌లు ప‌రుగుల వ‌ర‌ద పారించారు. కెప్టెన్ కోహ్లి, ధోనీ, పాండ్య‌లు బ్యాటింగ్‌లో రాణిస్తే..బౌలింగ్‌లో బుమ్రా, భువి, చాహాల్ మెరిపించారు.

దీంతో టార్గెట్ ఛేదించ‌లేక అప‌జ‌యాన్ని మూట‌గట్టుకుంది ఆస్ట్రేలియా. ఇండియా జ‌ట్టుకు ఇది రెండో విజ‌యం కాగా.స‌మిష్టిగా రాణిస్తే ఏ జ‌ట్టు అయినా ఇలాగే గెలుస్తుంద‌ని అనుకోవాలి. ఈసారి ఎలాగైనా ఇండియ‌న్ ఫ్యాన్స్ కు మ‌రిచిపోలేని రీతిలో ప్ర‌పంచ క‌ప్ తీసుకు రావాల‌న్న సంక‌ల్పంతో కెప్టెన్ కోహ్లి క‌ల‌లు కంటున్నాడు. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టును బెంబేలెత్తించే రీతిలో ఆడే కంగారు జ‌ట్టు భారీ టార్గెట్‌ను ఛేదించేందుకు నానా తంటాలు ప‌డింది. ఇండియా 36 ప‌రుగుల తేడాతో ఓడించింది. శిఖ‌ర్ ధావ‌న్ 109 బంతులు ఆడి 16 ఫోర్ల‌తో 117 ప‌రుగులు చేసి అద్భుత‌మైన సెంచ‌రీ సాధించాడు. విరాట్ కోహ్లి 77 బంతులు ఆడి 4 ఫోర్లు, రెండు భారీ సిక్స‌ర్ల‌తో 82 ప‌రుగులు చేశాడు.

రోహిత్ శ‌ర్మ 70 బంతులు ఆడి 3 ఫోర్లు ఒక సిక్స‌ర్ తో 57 ప‌రుగులు, హార్దిక్ పాండ్యా 27 బంతులు ఆడి 4 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో 48 ప‌రుగులు చేసి ఆస్ట్రేలియా జ‌ట్టు బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు. దీంతో భార‌త జ‌ట్టు 5 వికెట్లు కోల్పోయి ..352 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. ల‌క్ష్య సాధ‌న కోసం మైదానంలోకి దిగిన ఆస్ట్రేలియా జ‌ట్టు ఆది నుంచి గ‌ట్టిగానే పోరాడింది. చివ‌ర్లో వికెట్ల‌ను పారేసుకుంది. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 316 ప‌రుగులకు ఆలౌట్ అయింది. స్టీవ్ స్మిత్ 70 బంతులు ఆడి 5 ఫోర్లు ఒక సిక్స‌ర్ తో 69 ప‌రుగులు చేయ‌గా, ఫించ్ 36, వార్న‌ర్ 56 ప‌రుగులు చేసి స్కోర్‌ను ముందుకు న‌డిపించారు.

61 ప‌రుగుల వ‌ద్ద మొద‌టి వికెట్ కోల్పోగా మెల్ల‌గా ఆడుకుంటూ ఆఖ‌రున వేగం పెంచాల‌న్న కంగారూల ఆలోచ‌న పార‌లేదు. స్పిన్న‌ర్లు చాహాల్, కుల్‌దీప్ ఎక్కువ‌గా ప‌రుగులు ఇవ్వ‌కుండా క‌ట్ట‌డి చేశారు. బుమ్రా మ్యాజిక్ చేశాడు. ఖ‌వాజాను ఔట్ చేసి మ‌రింత ఒత్తిడి పెంచాడు. 40 ఓవ‌ర్‌లో రంగంలోకి దిగిన భువి ..స్మిత్ , స్టాయినిస్ ల‌ను పెవిలియ‌న్ కు పంపించ‌డంతో మ్యాచ్ ఇండియా వైపు మొగ్గింది. మొత్తం మీద ప్ర‌పంచ క‌ప్ లో నిల‌క‌డ‌గా ఆడితే..స‌మిష్టిగా వుంటే..స‌క్సెస్ సాధించ‌వ‌చ్చ‌ని భార‌త జ‌ట్టు గ్ర‌హించిన‌ట్లుంది.

కామెంట్‌లు