జాడలేని వానలు ..ఆందోళనలో రైతులు ..నీటి కోసం యుద్ధాలు
మృగశిర కార్తె పోయినా ఇప్పటి దాకా చినుకమ్మ జాడలేదు. భూమినే నమ్ముకుని..మట్టితో నిత్యం సహవాసం చేస్తూ..వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న తెలంగాణలోని రైతుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి అన్న చందంగా తయారైంది. ఆయా జాతీయ రహదారుల చుట్టూ కార్పొరేట్ కంపెనీల బోర్డులు దర్శనమిస్తున్నాయి. ప్లాట్లు, ఫ్లాట్స్, విల్లాలు నిర్మిస్తూ సాగుకు బొంద పెడుతున్నరు. వ్యవసాయం దండుగ కాదని పండుగ అంటూ ప్రకటించిన సర్కార్ ..నీళ్లు అందించేందుకు మిషన్ కాకతీయను ప్రవేశ పెట్టింది. ఇప్పటికే చెరువులు, కుంటలను పునరుద్దరించింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జలాశయాలన్నీ నీటితో కళకళలాడాల్సి ఉండగా అన్నీ బోసిపోయి కనిపిస్తున్నవి. ఇదిగో వస్తుంది ..అదిగో వస్తుంది వాన అంటూ ఆశలు రేపుతున్న వాతావరణ శాఖ అధికారుల మాటలు నీటి మూటలయ్యాయి. గత ఏడాది కనీసం ఓ నెల పాటు వర్షాలు కురిసాయి. ఇపుడు ఆ వానలు కూడా కురిసిన పాపాన పోలేదు. కేరళ రాష్ట్రాన్ని రుతుపవనాలు ఇంకా తాకనేలేదు. అక్కడి నుంచి మన దాకా రావాలంటే ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. చెన్నై, కర్ణాటక, తదితర ప్రాంతాల్లో ఇప్పటికే హోటళ్లు, రెస్టారెంట్లలో నీళ్లు లేవంటూ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వివిధ పనుల నిమిత్తం, ఉద్యోగాలకు ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు , కూలీ పనులు చేసుకునే వారు ఈ దెబ్బకు లబోదిబోమంటున్నారు.
గ్లాసు నీళ్లు ఇవ్వాలంటే డబ్బులు భారీగా డిమాండ్ చేస్తున్నారు. నీళ్లు, నిధులు, కొలువులు, విద్య, ఆరోగ్యం మనందరి ప్రాథమిక హక్కు. వీటిని కల్పించలేని స్థితిల్లో పాలకులు ఉండడం బాధాకరమంటున్నారు కొందరు విశ్లేషకులు. ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షానికే ఆయా పొలాల్లో విత్తనాలు వేశారు. చినుకు జాడ లేక పోవడంతో అవి కూడా ఎండిపోయాయి. ఉమ్మడి పాత జిల్లాల పరంగా చూస్తే అన్ని ప్రాంతాల్లోని వ్యవసాయ పొలాలు నెర్రెలు విచ్చినవి. పాలమూరు జిల్లా రైతులు వర్షాలు రాక పోవడంతో పూజలు చేస్తున్నారు. వరుణ దేవుడు కరుణించాలని కోరుతున్నారు. మెదక్ , కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం , తదితర జిల్లాలన్నీ వాన కోసం వేచి చూస్తున్నాయి.
వానలు ఆలస్యం కావడంతో సాగు మరింత తగ్గే అవకాశం ఉందంటూ ఆందోళనకు గురవుతున్నారు రైతన్నలు. వాతావరణ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, నీటి పారుదల శాఖలు సమన్వయం చేసుకుంటూ భరోసా ఇవ్వాల్సి ఉండగా రైతుబంధు పథకం పైసలు ఇస్తుండడంతో అసలు సాగు మరిచి పోతున్నారు. ప్రత్యామ్నాయ పంటలు వేయాలా లేక ఎలాంటి పద్ధతలు పాటిస్తే రాబోయే రోజుల్లో గట్టెక్కవచ్చన్నది ఈరోజు వరకు చెప్పడం లేదు. ఇప్పటికప్పుడు వానలు భారీగా కురిస్తేనే తాగు, సాగుకు మేలవుతుంది. లేక పోతే నీటి కోసం యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. తస్మాత్ జాగ్రత్త.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి