ధన ప్రవాహం - దొరబాబులదే రాజ్యం - కార్పొరేట్ కంపెనీలదే ఆధిపత్యం
ఇండియాలో ఎన్నికలంటే ఆషామాషీ వ్యవహారం కానే కాదు. మీడియా, మనీ , పీపుల్స్ మేనేజ్‌మెంట్ ఆపరేటింగ్ సిస్టం అనే ప్రక్రియ కొత్తగా మొదలైంది. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గంలో సగటున 75 కోట్ల నుండి 100 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కొలువుతీరిన ప్రజాప్రతినిధులు తమను తాము దైవాంశ సంభూతులుగా ఊహించుకుంటున్నారు. రెడ్ లైట్, బుగ్గ కారు, సెక్యూరిటీ, లెక్కనేంత నిధులు, ఆశించిన దానికంటే ఎక్కువ వసతులు ఇంకేం దోచుకున్నోడికి దోచుకున్నంత. ఇదీ భారతీయ ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ఎలక్షన్స్ అంటేనే మనీతో మేటర్ సెటిల్ మెంట్ చేసుకోవడం.
గెలుపొందాక తిరిగి పిండు కోవడం. ఇది మామూలై పోయింది. టికెట్ తెచ్చుకోవడం దగ్గరి నుండి ఎన్నికలై పోయేంత వరకు మనీతోనో పని. గతంలో అభ్యర్థులు ఇంటి ఇంటికి తిరిగి ప్రచారం చేసేవారు. ఇప్పుడు ఆ సీన్ కనిపించడం లేదు. పోస్టర్లు, క్యాంపెయిన్లు, మీడియా మేనేజ్‌మెంట్, ప్రెస్ మీట్స్, డిజిటల్, సోషల్ మీడియాను వాడుకోవడం ..సాధ్యమైనంత మేరకు పబ్లిసిటీ వచ్చేలా చూసుకోవడం. గెలిచాక డోంట్ కేర్ అంటూ వెళ్లిపోవడం. మళ్లీ కనిపిస్తే ఒట్టు..ఐదేళ్లకంటే ఓ ఆరు నెలల ముందు మళ్లీ ఓట్లడిగేందుకు వస్తారు. గెలిచాక..తిరిగి నాలుగున్నర ఏళ్ల తర్వాత టికెట్ వస్తే మళ్లీ అదే ముఖం లేదంటే కొత్త ముఖం. పిండి కొద్ది రొట్టె. ఎన్ని కోట్లు సమర్పించుకుంటే బి ఫాం వస్తుంది. జనానికి అన్నీ అర్థమయ్యాయి కనుకే డబ్బులు బాజాప్తాగా డిమాండ్ చేస్తున్నారు.
మనీ ఇవ్వకపోతే నో ఛాన్స్ అంటూ వీరే బోర్డు పెట్టేస్తున్నారు. ఇంకొందరు గ్రామాల్లో అయితే మా ఓట్లన్నీ మీకే..మరి మాకేమిస్తారంటూ ప్రశ్నించడం మామూలై పోయింది. ఇంటికో 2 లేదా 5 వేలు..తాగినంత మద్యం. కడుపారా తిండి. రోజు గడవాలంటే కూలీ. గత ఎన్నికలంటే ఈసారి ఎన్నికల్లో డబ్బులు ప్రవాహంలా నేతల చేతులు మారాయి. దేశ వ్యాప్తంగా ఏకంగా 60 వేల కోట్లు ఖర్చు చేశారట. వామ్మో ..ఇది సాక్షాత్తు సెంటర్ ఫర్ మీడియా అనే సంస్థ బట్టబయలు చేసింది మన ఎన్నికల బండారాన్ని. నగదు బదిలీ పథకాల ద్వారా ఈ తతంగం నడిచిందంటూ పేర్కొంది. నేరుగా ఇస్తే ఎన్నికల కమిషన్, పోలీసుల వేధింపులు, కేసులు ..ఇంకేం ఆయా పార్టీల నేతలు ఇలా పోల్ మేనేజ్‌మెంట్ కు పాల్పడుతున్నాయి.
ఆయా పథకాలు ప్రవేశ పెట్టడం. అందరికీ లబ్ది చేకూరేలా చేయడం..చివరగా ఓట్లు వేయించు కోవడం..ఎలాగైనా గెలుపొందడం ..ఇదీ పక్కా ..పకడ్బందీ ప్లాన్. ప్రపంచంలో ఏ దేశ ఎన్నికల్లోనూ లేనంతగా మన దేశంలో భారీగా ఖర్చు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జరిగిన ఖర్చు కంటే అధికంగా 25 శాతానికి పైగా ఇండియాలో అభ్యర్థులు నీళ్ల కంటే వేగంగా ఖర్చు చేశారంటూ వెల్లడించింది. పోటీ చేసిన వారిలో 40 శాతాని కంటే పైగా అభ్యర్థులకు కార్పొరేట్ కంపెనీలు, రియల్టర్లు, మైనింగ్ కాంట్రాక్టర్లు డబ్బులు సమకూర్చారని తెలిపింది. మొత్తం మీద అన్ని పార్టీల ఖర్చు 2.5 లక్షల కోట్లకు పై మాటే. వామ్మో ఎన్నికలంటే ఇంత భారీ ఖర్చు కదూ.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి