భళిరా బంగ్లాదేశ్..తలవంచిన విండీస్ - భారీ టార్గెట్ ఛేజ్
పసి కూనలు పులులు అయ్యాయి. తమ ప్రతాపాన్ని చూపించారు. కలిసి పోరాడితే విజయం ఎందుకు రాదో చేసి చూపించారు బంగ్లాదేశ్ క్రికెటర్లు. ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో బంగ్లా తన పవర్ ఏమిటో చూపించింది. ఇరు జట్లు సమ వుజ్జీలే. అండర్ డాగ్స్ గా ట్రీట్ చేసిన ఇతర జట్లకు తాము పిల్లులు కామంటూ..పులులమంటూ నిరూపించారు. వాట్ ఏ మ్యాచ్ ..వాట్ ఏ విక్టరీ. ఎదురుగా కొండంత లక్ష్యాన్ని వెస్టిండీస్ నిర్దేశించింది. కరేబియన్ ఫేసర్లు పేస్, బౌన్స్, షార్ట్, స్వింగ్‌లతో విరుచుపడితే..బంతులు రాకెట్ కంటే వేగంగా వస్తుంటే ..ఎంత పవర్ ఫుల్ బ్యాట్స్‌మెన్స్ అయినా జడుసు కోవాల్సిందే.
కానీ బంగ్లా కూనలు అధైర్య పడలేదు. చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రతి బంతిని ఎదుర్కొన్నారు. టార్గెట్ ను ఛేదించేందుకు ట్రై చేశారు. కాకలు తీరిన విండీస్ బౌలర్ల భరతం పట్టారు బంగ్లా క్రికెటర్లు. 22 గజాల పిచ్ పై బంతి రాకెట్ లా వస్తున్నా తడుము కోలేదు. నిర్దాక్షిణ్యంగా దాడికి దిగారు. సంయమనం పాటిస్తూ..సీనియర్ ప్లేయర్ షీబల్ 99 బంతుల్లో 16 ఫోర్లతో 124 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కొండలా పేరుకు పోయిన రన్స్‌ను ఈజీగా బాదేశారు. సీబల్ గోడలా నిలబడితే..లిటన్ దాస్ 69 బంతుల్లో 8 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 94 పరుగులు చేసి ఫీనిక్స్‌లా ఉన్నాడు. మరో 51 బంతులు మిగిలి వుండగానే బంగ్లాదేశ్ అపూర్వమైన విజయాన్ని స్వంతం చేసుకుంది.
మొన్నటికి మొన్న దక్షిణాఫ్రికాపై 300 పరుగులకు పైగా పరుగులు చేసి గెలుపు సాధించింది ఈ జట్టు. భారీ స్కోర్‌ను రెండోసారి ఈ టోర్నమెంట్‌లో ఛేదించిన ఘనత బంగ్లాదేశ్ జట్టుదే. ఆల్‌రౌండర్ ప్రదర్శన చేసి..అమోఘమైన బ్యాటింగ్ తో చెలరేగి పోయింది. ఎక్కడ కూడా ప్రత్యర్థి జట్టుకు ఛాన్స్ ఇవ్వకుండా గెలుపొందింది. ఈ లీగ్ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది బంగ్లా జట్టు. 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది.
బిగ్ స్కోర్ చేసి..భారీ లక్ష్యాన్ని బంగ్లా ముందుంచింది విండీస్ జట్టు. హోప్ 121 బంతుల్లో 4 ఫోర్లు ఒక సిక్సర్‌తో 96 పరుగులు చేయగా లూయిస్ 67 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగులు చేశారు. హెట్ మయర్ 26 బంతులు ఎదుర్కొన్ని 4 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధ సెంచరీ సాధించి దుమ్ము రేపాడు. బరిలోకి దిగిన బంగ్లా జట్టు 322 పరుగులు చేసి చిరస్మరణీయమైన గెలుపొందింది. విజయంలో కీలక భూమిక పోషించిన షకీబల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి