చైత‌న్యానికి ప్ర‌తీక‌..పోరాటానికి క‌ర‌దీపిక - జాషువా ..వారెవ్వా..!

ఒకే ఒక్క‌డు. చూస్తే చిన్నోడు. పెద్ద‌య్యాక నువ్వేమవుతావు అంటే మ‌న‌వాళ్లు అమెరికా వెళ‌తా..ల‌క్ష‌లు సంపాదిస్తానంటారు. కానీ అత‌డు మాత్రం ప్ర‌జ‌ల వైపు నిలిచాడు. నూటికో కోటికో ఒక్క‌రు ఎక్క‌డో ఒక చోట పుడ‌తారు. అలాంటి వారిలో ఈ యువ కెర‌టం ..సునామీలా దూసుకు వ‌చ్చింది. అత‌డి వ‌య‌సు ప‌ట్టుమ‌ని 22 ఏళ్లు. కానీ ల‌క్ష‌లాది జ‌నాన్ని క‌దిలించాడు. కాజ్ కోసం నిల‌బ‌డ్డాడు. రండి ..పోయేది ఏముంది..బానిస సంకెళ్లు త‌ప్ప‌. ఇపుడు కాక పోతే ఇంకెప్పుడూ పోరాడ‌లేం అని పిలుపునిచ్చాడు. వాంగ్ దెబ్బ‌కు హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కేరీ లామ్ బేష‌ర‌త్‌గా క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఇది జాషువా సాధించిన ఘ‌న‌త‌. ప్ర‌జాగ్ర‌హానికి కార‌ణ‌మైన నేర‌స్థుల అప్ప‌గింత బిల్లు విష‌యంలో భారీ ఎత్తున పోరాటం న‌డిచింది.

చైనాకు నేర‌స్థుల‌ను అప్ప‌గించే ఒప్పందం మేర‌కు ప్ర‌తిపాదించిన 'ఎక్స్ట్రడిషన్ బిల్'ను ప్రజలు నిర్ద్వందంగా తిర‌స్క‌రించారు. ఈ బిల్లు కోసం జ‌నం రోడ్డెక్కారు. ల‌క్ష‌లాదిగా త‌ర‌లి వ‌చ్చారు. ర‌హ‌దారుల‌ను దిగ్బంధంనం చేశారు. జ‌నం సంద్ర‌మై ప్ర‌భుత్వానికి వెన్నులో వ‌ణుకు పుట్టించారు. జ‌నం చైత‌న్య‌వంత‌మైతే, క‌లిసిక‌ట్టుగా పోరాడితే రాజ్యాలు కూలి పోతాయ‌ని చెప్ప‌క‌నే చెప్పాడు..నిరూపించాడు..జాషువా. దేశ ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది క‌లిగించే, స్వేచ్ఛ‌ను హ‌రించే ఈ బిల్లును వెంట‌నే విర‌మించు కోవాల‌ని, కేరీ లామ్ రాజీనామా చేయాల‌ని జ‌నం డిమాండ్ చేశారు. తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు లోనైన ఆమె బిల్లును పునః స‌మీక్షించ‌బోమ‌ని, బిల్లును తాత్కాలికంగా ఉప‌సంహ‌రిస్తున్న‌ట్లు జ‌నం సాక్షిగా ప్ర‌క‌టించారు.

అయినా ప్ర‌జాగ్ర‌హం చ‌ల్లార‌లేదు. నిర‌స‌న జ్వాల‌లు మిన్నంటాయి. బిల్లును శాశ్వ‌తంగా ర‌ద్దు చేయాల‌ని, స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణం ఉండాల‌ని, ఎన్నిక‌ల ద్వారా త‌మ నేత‌ను తామే ఎన్నుకుంటామ‌ని ఉద్య‌మిస్తున్నారు. ఇంత‌మందిని న‌డిపించే శ‌క్తి ఎవ‌రంటూ ..ప్ర‌పంచం ఆరా తీయ‌డం మొద‌లు పెట్టింది. పెద్ద‌న్న అమెరికా ఒక్క‌సారిగా సెర్చ్ చేయ‌డం ప్రారంభించింది. దీని వెనుక శ‌క్తి, బ‌లం ఒకే ఒక్క‌డు..అత‌డే జాషువా వాంగ్. హాంకాంగ్‌లో చ‌దువుతున్నాడు. జూన్ 17న జైలు నుంచి విడుద‌ల‌య్యాడు. మ‌ళ్లీ నిర‌స‌న కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటాన‌ని, చైనాకు అనుకూలంగా ఉన్న కేరీ లామ్ రాజీనామా చేయాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. వాంగ్ దెబ్బ‌కు కేరీ లామ్ జ‌డుసుకుంది. తాను బిల్లు జోలికి వెళ్ల‌బోన‌ని చెప్పినా వినిపించు కోలేదు అక్క‌డి జ‌నం.

ప్రపంచంలోనే అత్యంత పొడ‌వైన స‌ముద్ర వంతెన ప్రారంభ‌మ‌య్యేది హాంకాంగ్ - జుహాయ్ మార్గంలోనే. హాంకాంగ్‌లో 2014లో జ‌రిగిన అంబ్రెల్లా మూమెంట్ కు ఆధారం జాషువానే. స్వేచ్ఛాయుత ఎన్నిక‌ల విధానం ద్వారా త‌మ నాయ‌కుల‌ను తామే ఎన్నుకుంటామ‌ని , చైనా ఆమోదించిన అభ్య‌ర్థులు మాత్ర‌మే ఎన్నిక‌ల్లో పోటీ చేసే విధానం ర‌ద్దు చేయాలనేది దీని ముఖ్య ఉద్ధేశం. జాషువాతో పాటు ఇత‌ర విద్యార్థులు నాయ‌క‌త్వం వ‌హించిన ఈ ఉద్య‌మంలో ల‌క్ష‌లాది ప్ర‌జ‌లు స్వ‌చ్ఛంధంగా పాల్గొన్నారు. 79 రోజుల పాటు ఈ పోరాటం అలుపెరుగ‌కుండా సాగింది. దీంతో హాంకాంగ్ న‌గ‌రం స్తంభించి పోయింది. అక్క‌డి ప్ర‌భుత్వం విద్యార్థి నేత‌ల‌ను, కొంద‌రు ప్రొఫెస‌ర్ల‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

2017, 2018 సంవ‌త్స‌రాల్లో వేర్వేరు కోర్టు తీర్పుల‌తో జైలుకు వెళ్లిన జాషువా, శిక్ష తగ్గించ‌డంతో నెల రోజుల పాటు ఉన్నారు. జూన్ 17న రిలీజ్ అయ్యారు. విడుద‌ల అనంత‌రం వాంగ్ జ‌నాన్ని ఉద్ధేశించి ప్ర‌సంగించారు. నిర‌స‌న తెల‌ప‌డం మ‌న ప్రాథ‌మిక హ‌క్కు. ఇదే స‌రైన స‌మ‌యం. ప్ర‌జ‌ల తిరుగుబాటును నేను పూర్తిగా స‌మ‌ర్థిస్తున్నాను. నేర‌స్థుల అప్ప‌గింత బిల్లుకు స‌వ‌ర‌ణ‌లు చేసి, ప్రాథ‌మిక మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డుతున్నారంటూ ఆరోపించారు. తాత్కాలికంగా బిల్లును ర‌ద్దు చేయ‌డం కాదు..శాశ్వ‌తంగా ఉప‌సంహ‌రించు కోవాలి. అప్ప‌టి దాకా ఈ పోరాటం ఆగ‌దని స్ప‌ష్టం చేశారు.

హాంకాంగ్ లెజిస్టేటివ్ కౌన్సిల్ భ‌వ‌నం ముందు నిర‌స‌న‌కారులు పెద్ద ఎత్తున గుమికూడారు. ప్ర‌జ‌లు ఇక ఏ మాత్రం మౌనంగా ఉండ‌రని ప్ర‌పంచానికి చాటి చెప్పేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామంటూ నిన‌దించారు. ఎన్ని దాడులు చేస్తే అది ప్ర‌జ‌ల‌పై దాడిగా భావించాల్సి వ‌స్తుంద‌ని చెప్పారు. 10 ల‌క్ష‌ల మందికి పైగా జ‌నం వీధుల్లోకి వ‌స్తూనే వుంటారు. బిల్లును తాత్కాలికంగా ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్లు కేరీ లామ్ ప్ర‌క‌టించారు. దీనిని ఒప్పుకోలేదు. 20 ల‌క్ష‌ల మందికి పైగా ప్ర‌జ‌లు వీధుల్లోకి వ‌చ్చి నిర‌స‌న ప్ర‌క‌టించారు. లామ్ భ‌యానికి లోనైంది. ఇది జాషువా వాంగ్ సాధించిన విజ‌యం. పోరాటానికి ప్ర‌తీక‌..ఉద్య‌మానికి క‌ర‌దీపిక అత‌డు. కాదంటారా ఎవ‌రైనా..!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!