ఇన్వెస్ట‌ర్స్‌తో రిల‌య‌న్స్ బిగ్ డీల్

టెలికాం రంగంలో ఇప్ప‌టికే నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్‌లో ఉన్న రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ తాజాగా బ్రాడ్ బాండ్, ఈ కామ‌ర్స్‌ల‌ను విస్త‌రించేందుకు గాను విదేశీ సంస్థ‌ల నుంచి రుణాల‌ను స్వీక‌రించే ప‌నిలో ప‌డింది. ఈ మేర‌కు ఫారిన్ లెండింగ్ ఇన్వెస్ట‌ర్స్ నుండి ఏకంగా 185 కోట్ల డాల‌ర్ల‌కు ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్ప‌టికే ఎంఓయులు కూడా పూర్త‌యిన‌ట్లు మార్కెట్ వ‌ర్గాలు తెలిపాయి. ఈ డాల‌ర్ల విలువ ఇండియ‌న్ రూపీస్‌లో అయితే ..12 వేల 900 కోట్ల‌కు పై మాటే. ఇండియ‌న్ టెలికాం మార్కెట్ రంగంలో ఇది ఓ రికార్డుగానే ప‌రిగ‌ణించాల్సి వుంటుంది. రిల‌య‌న్స్ జియో దెబ్బ‌కు మిగ‌తా ప్రైవేట్ టెలికాం ఆప‌రేట‌ర్స్ ల‌బోదిబోమంటున్నారు. ఎప్ప‌టికప్పుడు మార్కెట్ స్ట్రాట‌జీని ఫాలో అవుతూ, ప్ర‌త్య‌ర్థి కంపెనీల‌కు కంటి మీద కునుకే లేకుండా చేస్తోంది ఈ కంపెనీ.

భ‌విష్య‌త్‌లో పెట్టుబ‌డి అవ‌స‌రాల కోసం ఈ మేర‌కు ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు ముఖేష్ అంబానీ వెల్ల‌డించారు. ఆర్ఐఎల్ ఇప్ప‌టికే త‌న జియో కంపెనీలో 20 వేల కోట్లు పెట్టుబ‌డిగా పెట్టింది. ఇందు కోసం ప్ర‌ణాళిక‌లు కూడా రూపొందించారు. 4జి సేవ‌లు క‌ల్పిస్తుండ‌గా రాబోయే కాలంలో 5జి సేవ‌ల‌పై క‌న్నేసింది ఈ కంపెనీ. టెక్నాల‌జీతో పాటు ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ట‌వ‌ర్స్‌ను కూడా అప్ డేట్ చేయ‌డ‌మో లేదా మార్చ‌డ‌మో చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం భారీగానే ఖ‌ర్చ‌వుతుంది. బ్రాడ్ బాండ్, ఈ -కామ‌ర్స్‌, డిజిట‌ల్ రంగాల‌లో మ‌రింత విస్త‌రించేందుకే రుణం తీసుకుంటోంది. ఈ విష‌యాన్ని త‌మ సంస్థ‌ల్లో ప‌నిచేస్తున్న సిబ్బంది, ఉద్యోగుల‌కు కంపెనీ స‌మాచారం ఇచ్చింది. రుణ కాల ప‌రిమితి, వ‌డ్డీ ఎంత చెల్లిస్తున్నార‌నేది మాత్రం వెల్ల‌డించ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. నియమ నిబంధ‌న‌ల‌కు లోబ‌డే తీసుకున్నామ‌ని త్వ‌ర‌లో అన్నింటిని తెలియ ప‌రుస్తామ‌ని పేర్కొంది.

1700 కోట్ల విలువ గ‌ల సీఎస్ఆర్ నిధుల దుర్వినియోగం జ‌రిగింద‌ని వ‌చ్చిన వార్త‌ల‌పై రిల‌య‌న్స్ కంపెనీ వివ‌రణ ఇచ్చింది. సిఎస్ఆర్ కు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం ఎప్ప‌టిక‌ప్పుడు వివ‌రాలు అడుగుతూనే ఉంటుంద‌ని, ఎక్క‌డా దుర్వినియోగం అయిన దాఖ‌లాలు లేవ‌ని స్ప‌ష్టం చేసింది. కార్పొరేట్ సోష‌ల్ రెస్సాన్సిబిలిటి కింద అమ‌లు చేస్తున్న ప్రాజెక్టుల గురించి పూర్తిగా వివ‌రాల‌తో స‌హా సంబంధిత మంత్రిత్వ శాఖ‌కు అంద‌జేశామ‌ని తెలిపారు. కొన్ని మీడియా సంస్థ‌లు అనుమానాలు వ్య‌క్తం చేస్తూ వార్త‌లు ప్ర‌చురించాయ‌ని, అందులో ఎలాంటి వాస్త‌వం లేద‌న్నారు. మొత్తం మీద రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ మాత్రం త‌న దూకుడు పెంచుకుంటూ పోతోంది. ప్ర‌త్య‌ర్థుల గుండెల్లో గుబులు రేపుతోంది. ఏది ఏమైనా రిల‌య‌న్స్ ద‌రిదాపుల్లోకి వ‌చ్చే కంపెనీ ఏదీ లేద‌నిపిస్తోంది.

కామెంట్‌లు