మహర్షి సరే..తెలంగాణ రైతుల మాటేమిటి..?
భారత దేశం అంటేనే వ్యవసాయం. రైతులకు ఎలా పండించాలో..ఎప్పుడు ఏ కాలంలో ఎలాంటి పద్ధతులు పాటించాలో..ఏయే పంటలు సాగు చేయవచ్చో వాళ్లకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు. సినిమా చూసి నేర్చుకునేంత స్థితికి తెలంగాణ రైతాంగం దిగజారలేదు. ఆ విషయాన్ని నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వంశీ, నటుడు మహేష్ బాబు గుర్తిస్తే చాలు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వ్యవసాయం పాట పడుతున్నారు. రైతులకు కావాల్సింది సినిమాలు కాదు. పండించేందుకు భరోసా కావాలి. ప్రతి ఒక్క రైతుకు..మట్టి బిడ్డలకు నెలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం 10 వేల రూపాయల చొప్పున పెన్షన్ సౌకర్యం కల్పించాలి. అపుడే వారికి న్యాయం జరుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఒట్టి పోయింది. దోపిడీకి గురైంది. మోసానికి లోనైంది.
60 ఏండ్ల పాటు ఈ ప్రాంతాన్ని సర్వనాశనం పట్టించారు. కోలుకోలేకుండా చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తెలంగాణకు ఎనలేని అన్యాయం జరిగింది. కొన్ని తరాలు గడిచినా ఈ దగాను పూడ్చుకునేందుకు సమయం సరిపోదు.ఇరు రాష్ట్రాలలో వ్యవసాయం ప్రధానమైన ఆదాయ వనరుగా ఉంది. వేలాది మంది అన్నదాతలు ఈ మట్టినే నమ్ముకుని సాగు చేస్తున్నారు. ఇంటిల్లిపాది కుటుంబీకులంతా పొలాలతో సహవాసం చేశారు. అందులోనే జన్మించి అందులోనే మరణించే దాకా దానితోనే ఉంటున్నారు. దేశానికి స్వతంత్రం వచ్చి 70 ఏళ్లకు పైగా అవుతున్నా రైతుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటోంది. పాలకులు మారారు. తరాలు మారి పోయినవి. కానీ కోట్లాది ప్రజల ఆకలి తీరుస్తున్న రైతుల పరిస్థితిలో చిన్న మార్పు జరిగిన దాఖలాలు లేవు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు కనీస మద్ధతు ధర లభించలేదు.
చేసేందుకు పెట్టుబడి లేక..రుణాలు అందక రైతులు నానా తిప్పలు పడుతున్నారు. తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఒక్క తెలంగాణాలోనే 3 వేల మందికి పైగా రైతులు చనిపోయారు. దీనిని నివారించడంలో కొత్తగా ఏర్పాటైన తెలంగాణ సర్కార్ ఘోరంగా వైఫల్యం చెందింది. మధ్య దళారీల ప్రమేయం, మార్కెట్ యార్డలలో గోదాములు లేక పోవడం, పండించిన పంటకు మద్ధతు ధర దక్కక పోవడం ప్రధాన కారణాలు. వీటిని పరిష్కరించకుండా రైతు బంధు పథకం కింద కొంత మేరకు ప్రభుత్వం సహాయం అందజేస్తున్నా అది ఏ మూలకు సరిపోవడం లేదు. లక్షలాది మంది రైతులు గత్యంతరం లేని పరిస్థితుల్లో తాము నమ్ముకుని ..తమకు ఆధారంగా ఉన్న భూములను తక్కువ ధరలకే అమ్ముకుంటున్నారు.
వారి స్వంత పొలాల్లోనే నిన్నటి దాకా యజమానులుగా ఉన్న రైతులు నేడు వ్యవసాయ కూలీలుగా మారిపోతున్నారు. నేచురల్ ఫార్మింగ్, కూరగాయలు, పండ్ల సాగు చేపట్టి ఆదాయం గడించాలని ఉన్నతాధికారులు పిలుపునిస్తున్నారు. అసలు వ్యవసాయం సాగు చేసేందుకు కావాల్సిన డబ్బులు రుణాల రూపేణా అందడం లేదు. బ్యాంకులు నానా తిప్పలు పెడుతున్నాయి. లెక్కలేనంతగా నిబంధనలు విధిస్తున్నాయి. దీంతో రైతులు ప్రైవేట్ ఫైనాన్స్‌లను, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అధిక వడ్డీకి అప్పులు చేస్తున్నారు. తీసుకొచ్చిన అప్పులతో సాగు చేస్తే ఆశించిన దిగుబడి రాక అప్పులు మరింత పెరిగి పోతున్నాయి.
దీంతో ఆత్మహత్యలు తప్ప మరో మార్గం కనిపించడం లేదు. హీరోలు, దర్శకులు, నిర్మాతలు దయచేసి
సినిమా వ్యాపారం చేయకండి..విడుదలైన రోజే దిల్ రాజు..చక్రం తిప్పారు..ఏకపక్షంగా టికెట్ల ధరలు పెంచారు. ఫక్తు వ్యాపారం చేశారు. ఇపుడేదో చిలుక పలుకులు పలుకుతున్నారు. ఎంత మంది రైతులను ఆదుకున్నారో..ఎంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను పరామర్శించారో చెబితే సంతోషిస్తాం. సందేశాలు ఇవ్వకండి..వీలైతే రైతు కుటుంబాలకు సాయం చేయండి. వారి పిల్లలను దత్తత తీసుకోండి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి