ఏపీలో హీటెక్కిన పాలిట్రిక్స్ - జోరందుకున్న అంచనాలు
ఏపీలో హీటెక్కిన పాలిట్రిక్స్ - జోరందుకున్న అంచనాలు
దేశ రాజకీయాలలో అపర చాణుక్యుడిగా పేరు సంపాదించుకున్న టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఏపీ ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిది సంవత్సరాల పాటు సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇటు రాష్ట్రంలో అటు జాతీయ స్థాయిలో కీలకమైన పాత్రను పోషించారు. జిఎంసీ బాలయోగిని పార్లమెంట్ స్పీకర్‌గా చేయడంలో బాబు ఎంతగానో కృషి చేశారు. ఆ తర్వాత అనూహ్య పరిణామాల రీత్యా బాబు అధికారాన్ని కోల్పోయారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఎంపికయ్యారు.
కొన్నేళ్ల పాటు పవర్‌కు దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకు వచ్చారు రెడ్డి. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు. చంద్రబాబు ఎన్ని అడ్డంకులు కల్పించినా ఆయన ఒక్కడే ముందుండి నడిచారు..పార్టీని, కార్యకర్తలు, నేతలను నడిపించారు. అనూహ్యమైన రీతిలో వైఎస్ పవర్ లోకి వచ్చారు. ఆ తర్వాత చంద్రబాబుకు చుక్కలు చూపించారు. అసెంబ్లీ సాక్షిగా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. పరిటాల రవి హత్య అప్పట్లో సంచలనం రేపింది. బాబు తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు తెలంగాణ పట్ల అనుసరించిన వైఖరిని నిరసిస్తూ అదే టీడీపీకి చెందిన , డిప్యూటీ స్పీకర్‌గా , థింక్ టాంక్ మెంబర్ గా ఉన్న కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు.
తెలంగాణకు జరిగిన మోసాన్ని, అన్యాయాన్ని ఆయన ఎండగట్టారు. కాలికి బలపం కట్టుకుని తిరిగారు. కేసీఆర్ బయటకు వచ్చినప్పుడు ఒక్కడే ..కానీ కోట్లాది ప్రజలను ఆయన సమీకరించారు. తెలంగాణ ఉద్యమాన్ని కొన్నేళ్ల పాటు బతికి బట్టకట్టేలా చేశారు. తానే అన్నీ అయి ముందుండి ఉద్యమాన్ని నడిపించారు. సకల జనుల సమ్మెతో కేంద్రం దిగి వచ్చేలా చేశారు. దేశంలోని భావ సారూప్యత కలిగిన పార్టీలను ఒప్పించారు. అన్ని పార్టీలు గేలి చేశాయి. అయినా వెనక్కి తగ్గలేదు కేసీఆర్. అంకెలు, సంఖ్యలతో సహా జరిగిన అన్యాయం గురించి రాష్ట్రంలో, దేశంలో చర్చ జరిగేలా చేశారు.
ప్రజలంతా కేసీఆర్ పిలుపునకు స్పందించారు. రోడ్లపైకి వచ్చారు. యువతీ యువకులు ఆందోళన బాట పట్టారు. ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. బాబు, వైఎస్‌లు అడ్డుకున్నా చివరకు కేసీఆర్ గెలిచారు. ఇపుడు జాతీయ స్థాయిలో తనదైన శైలిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతున్నారు. చంద్రబాబు..కేసీఆర్‌ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమన్నట్లు మాటల యుద్ధం నడుస్తూనే ఉన్నది. ఈ సారి ఎన్నికల్లో ఏపీలో బాబు రాకుండా ఉండేందుకు కేసీఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్ధతు పలికారు. అటు అసెంబ్లీలో ఇటు లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు దక్కవని, వచ్చేది వైసీపీ సర్కారేనని స్పష్టం చేశారు.
పసుపు కుంకుమ, రైతు బంధు పథకాలు తమకు సానుకూలంగా ఉండేలా చేశాయని, ప్రజలు తమ వైపే ఉన్నారని..రాబోయే కాలంలో తిరిగి అధికారం చేజిక్కించు కోవడం ఖాయమంటూ టీడీపీ శ్రేణులు జోష్యం చెబుతున్నాయి. ఇదిలా ఉండగా ఎమ్మెల్యేలు కోట్లకు పడుగలెత్తారని, ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని..ఐటీ జపం చేసినంత మాత్రాన..రాజధానిని కట్టినంత మాత్రాన అధికారంలోకి ఎలా వస్తారంటూ వైసీపీ అధినేత జగన్ ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న శక్తులను , పార్టీలను ఒకే తాటిపైకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
దీంతో కేసీఆర్‌తో పాటు మోదీని శత్రువుగా మార్చుకున్నారు. ఎప్పుడూ లేనంతగా ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందా లేక జగన్ సీఎం అవుతారా అంటూ బెట్టింగ్‌లు జోరందుకున్నాయి. ఏపీలో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగాయి. ఈనెల 23న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 24 వరకు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది కరెక్ట్ ఫిగర్ 24న వచ్చే అవకాశం ఉంది. అంతవరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రీ పోల్ సర్వేలు ఆఖరు నిమిషంలో ఓట్లు ఎక్కువగా పోల్ కావడం టీడీపీకి ఎడ్జ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి