ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పబోతున్నాయి..?
ఎవరు గెలుస్తారు..ఏ పార్టీకి ఆధిక్యం రాబోతుంది. ఎవరు సీఎం, పీఎంల పీఠాలను అధిరోహిస్తారు..పవర్ లోకి ఎవరు వస్తారు ..ఇలా ఎక్కడికి వెళ్లినా ఇదే చర్చ. బస్సుల్లో, రైళ్లల్లో, విమానాల్లో సైతం ఎన్నికలు, పొలింగ్ సరళి, సర్వే సంస్థల ఫలితాలపైనే చర్చోప చర్చలు జరుగుతున్నాయి. లక్షల్లో మొదలైన బెట్టింగ్ వ్యవహారం తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా కోట్లు, డాలర్లను దాటేసింది. ఏ ప్రభుత్వం దీనిని నియంత్రించే పరిస్థితి లేదు. అన్ని వ్యవస్థలు నీరుగారి పోయాయి. నీళ్లు నములుతున్నాయి. నేరాలు, ఘోరాలు, దోపిడీలు, ఆర్థిక మోసాలు , ఆత్మహత్యలు, ఆకలి చావులు, దారుణాలు పెచ్చరిల్లి పోతున్నాయి.
వీటిని నియంత్రించేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎన్ని చట్టాలు చేసినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. వ్యవస్థ పుచ్చు పట్టి పోయింది. పచ్చి పుండైతే పర్వాలేదు..ఏకంగా క్యాన్సర్ మహమ్మారిలా దేశాన్ని అల్లుకు పోయింది. ఇప్పట్లో దీనిని నిర్మూలించడం అసాధ్యమైన పని. ఈ పరిస్థితుల్లో దేశానికి స్వేచ్ఛను ప్రసాదించిన మహాత్మా గాంధీ మళ్లీ జన్మించినా దీనిని నియంత్రచలేని దారుణ పరిస్థితి దాపురించింది. జాతీయ, రాష్ట్ర స్థాయిలలో ఇప్పటికే ప్రచురణ, ప్రసార, సామాజిక మాధ్యమాలలో ఏయే పార్టీలకు ఎన్నెన్ని సీట్లు దక్కనున్నాయో ఎగ్జిట్ పోల్స్, సర్వే సంస్థలు ప్రకటించాయి. ఇంకొన్ని న్యూస్ ఛానల్స్ అయితే ఏకంగా రాబోయే సీట్లు కూడా వెల్లడించాయి. 544 లోక్‌సభ సీట్లకు గాను 543 సీట్లకు ఎన్నికలు పూర్తయ్యాయి.
కేంద్ర ఎన్నికల సంఘం సమర్థవంతంగా ఎన్నికలను నిర్వహించింది. లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాలకు కూడా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కొన్ని చెదురు మదురు సంఘటనలు మినహా అన్ని చోట్లా పోలింగ్ సజావుగా సాగింది. ఒక్క తమిళనాడులో నోట్ల కట్టలు బయట పడడంతో ఎన్నికల సంఘం ఆ ఒక్క స్థానంలో ఎన్నికలు జరగకుండా నిలిపి వేసింది. దీంతో 543 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగినట్లయింది. ఎప్పుడూ లేనంతగా ఒకరిపై మరొకరు ఆరోపణలు తీవ్ర స్థాయిలో చేసుకున్నారు. ఈ విషయంపై ఈసీ దాకా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, స్టాలిన్, చంద్రబాబు నాయుడు , నరేంద్ర మోదీ , రాహుల్ గాంధీ, ప్రజ్ఞాసింగ్ ..ఇలా ఒకరికి మించి మరొకరిపై ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇంకొందరు ఆయా అత్యున్నత న్యాయ స్థానాలలో కేసులు కూడా నమోదయ్యాయి.
ఆయా న్యాయస్థానాలు ఆయా పార్టీలకు చెందిన నాయకులు, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఇలా ప్రవర్తించడంపై ధర్మాసనాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ఇది మంచి పద్ధతి కాదని ఘాటుగా చీవాట్లు పెట్టాయి. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు ప్రజలకు, సమాజానికి జవాబుదారీగా ఉండాల్సింది పోయి ఇలా దిగజారితే ఎట్లా అని ఆందోళన వ్యక్తం చేశాయి. ఇక సర్వేలు, ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్ సర్వేల విషయానికి వస్తే..ఈసారి జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూలత ఎక్కువగా ఉందని, నరేంద్ర మోదీని ప్రజలు ఒప్పుకోవడం లేదని, ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా సీట్లు రావని వెల్లడించాయి. మరో వైపు కాంగ్రెస్ పార్టీకి కనీసం 100 సీట్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని, అయితే పనిలో పనిగా ప్రాంతీయ పార్టీలు ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కాబోతున్నాయని కుండ బద్దలు కొట్టాయి. ఇంకొన్ని న్యూస్ ఛానల్స్ హంగ్ ఏర్పడుతుందని..రీజినల్ పార్టీలే తమ హవాను కొనసాగించనున్నాయని జోష్యం చెప్పాయి. మొత్తం మీద పోలింగ్ లెక్కింపునకు ఇంకా కొంత సమయం మాత్రమే.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి