.జెట్ ఎయిర్ వేస్‌కు ఎథిహాద్ కాయకల్ప చికిత్స
అన్నం పెట్టే రైతులకు రుణాలు మంజూరు చేయాలంటే నానా ఇబ్బందులకు గురి చేసే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇపుడు సంక్షోభం దిశగా నానా అవస్థలు పడుతున్న జెట్ ఎయిర్ వేస్ సంస్థను గట్టెక్కించేందుకు నానా తంటాలు పడుతోంది. ప్రజలు కష్టపడి ఎస్‌బిఐలో పైసా పైసా కూడబెట్టుకున్న డబ్బులను అప్పనంగా జెట్ ఎయిర్ వేస్ కు కట్టబెట్టింది. తాము సర్వీసులు నడిపే స్థితిలో లేమంటూ సదరు యాజమాన్యం చేతులెత్తేసింది. దీంతో దానిని తిరిగి నిలబెట్టేందుకు ఎస్‌బిఐ నేరుగా రంగంలోకి దిగింది.
ఇతర డబ్బున్న వ్యాపారులు, సంస్థలు, కంపెనీలతో చర్చోప చర్చలు చేస్తోంది. ఆ బ్యాంకు చీఫ్ రజ్‌నీష్ కుమార్ ఈ మేరకు త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న నమ్మకం తమకుందని స్పష్టం చేశారు. విమానాలు నడుపుతున్న జెట్ ఎయిర్ వేస్ ప్రైవేట్ కంపెనీకి ఎస్‌బిఐ ఏకంగా కోట్లాది రూపాయలు రుణంగా అందజేసింది. ఇపుడు సదరు కంపెనీ బ్యాంకుకు 8 వేల 400 కోట్లు బాకీ పడింది. ఇంత మొత్తం డబ్బులన్నీ ప్రజలవే. తిరిగి రోప్ వేపై విమానాలు తిరుగుతాయని ఈ బ్యాంకర్ చీఫ్ చిలుక పలుకులు పలుకుతున్నారు. జెట్ ఎయిర్ వేస్ ను దక్కించుకునేందుకు మరోసారి బిడ్ కు ఆహ్వానం పలికారు. టీపీజీ కేపిటల్,
ఇండిగో పార్ట్‌నర్స్, నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్షర్ ఫండ్, ఎథిహాద్ ఎయిర్ వేస్ జెట్ ఎయిర్ వేస్ ను చేజిక్కించుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఈ విషయాన్ని స్వతహాగా రజనీష్ కుమార్ తెలిపారు. త్వరలోనే శుభవార్త వింటారని వెల్లడించారు. ఈనెల 10న జరిగిన బిడ్‌లో ఎథిహాద్ కంపెనీ భారీ ఆఫర్ కు ఒప్పుకున్నట్లు..ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని..పూర్తవుతుందన్న నమ్మకం తమకు ఉందంటున్నారు. ఇప్పటికే జెట్ ఎయిర్ వేస్ సంస్థ నుండి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, కంపెనీ సెక్రటరీ వెళ్లి పోయారు.
అబుదాభి కేంద్రంగా ఉన్న ఎథిహాద్ ఎయిర్ వేస్ 24 శాతం జెట్ ఎయిర్ వేస్ లో స్టేక్ తీసుకునేందుకు రెడీ అయింది. ఒకరకంగా ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు దోహద పడుతుందనే చెప్పాలి. సంస్థ బతికి బట్టకట్టాలన్నా..పూర్తి స్థాయిలో ఎయిర్ లైన్స్ నడవాలంటే ఇప్పటికిప్పుడు 15 వేల కోట్లు కావాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు ఆ డబ్బులు రావాలంటే కష్టం..ఎథిహాద్ 1700 కోట్లు పెట్టేందుకు రెడీ అయింది. తాత్కాలికంగా ఇది ప్రారంభించేందుకు దోహద పడనుంది. ఇందుకు ఎస్‌బిఐని అభినందించాల్సిందే.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి