ర‌స‌వ‌త్త‌ర పోరుకు చెన్నై రెడీ - ముంబై ఇండియ‌న్స్‌తో ఫైన‌ల్

విశాఖ‌లో ఐపీఎల్ ఫైన‌ల్ కోసం జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు ఢిల్లీ కేపిట‌ల్స్‌ను ఓడించింది. అంత‌కు ముందు ముంబై జ‌ట్టు చేతిలో పేల‌వ‌మైన ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించి అప‌జ‌యం పాలైన ఈ జ‌ట్టు అనూహ్యంగా పుంజుకుంది. అటు బ్యాటింగ్‌లోను ఇటు బౌలింగ్‌లోను అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర్చింది. హైద‌రాబాద్ లో జ‌రిగే ఫైన‌ల్ పోరాటానికి తాను సిద్ధంగా ఉన్నాన‌ని ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుకు స‌వాల్ విసిరింది. రెండు మూడు మ్యాచ్‌ల్లో విఫ‌ల‌మైన స్టార్ బ్యాట్స్ మెన్ ..వాట్స‌న్ ఫామ్‌లోకి రాగా ..ఎప్ప‌టిలాగే డుప్లిసిస్ దుమ్ము రేపాడు. చెన్నైకి విజ‌యాన్ని అందించ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. మూడు సార్లు ఐపీఎల్ టోర్నీ ఛాంపియ‌న్‌గా చెన్నై విజ‌యం సాధించింది.

మొద‌టిసారిగా ఎలాగైనా స‌రే ఫైన‌ల్‌కు చేరుకోవాల‌న్న క‌సితో ఆడిన ఢిల్లీ కేపిట‌ల్స్ జ‌ట్టు ఆశ‌లు అడియాశ‌లే అయ్యాయి. చెన్నై జ‌ట్టుకు ఇది ఎనిమిదో ఐపీఎల్ ఫైన‌ల్ కావ‌డం విశేషం. ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీపై చెన్నై గెలుపొందింది. దీప‌క్ చాహ‌ర్ బ్రావో, జ‌డేజా, హ‌ర్భ‌జ‌న్ సింగ్‌లు త‌లో రెండు వికెట్ల చొప్పున తీశారు. క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఢిల్లీని ప‌రుగులు చేయ‌నీయ‌కుండా క‌ట్ట‌డి చేశారు. దీంతో ఆ జ‌ట్టు 9 వికెట్లు కోల్పోయి నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 147 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. రిష‌బ్ పంత్ 25 బంతుల్లో రెండు ఫోర్లు ఒక సిక్స‌ర్‌తో 38 ప‌రుగులు చేశాడు. ఇత‌డొక్క‌డే అత్య‌ధిక స్కోర‌ర్. ఇంకోవైపు చెన్నై ఓపెన‌ర్లు వాట్స‌న్ మూడు ఫోర్లు, నాలుగు భారీ సిక్స‌ర్ల‌తో 50 ప‌రుగులు చేయ‌గా..డుప్లిసిస్ ఏడు ఫోర్లు ఒక సిక్స‌ర్‌తో 50 ప‌రుగులు చేసి..ఢిల్లీ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు.

గ్రౌండ్ న‌లువైపులా అద్భుత‌మైన షాట్లు కొట్టారు. క‌ళ్లు చెదిరే షాట్ల‌తో డుప్లిసిస్ ఆక‌ట్టుకోగా వాట్స‌న్ త‌న‌దైన శైలితో దుమ్ము రేపాడు. దీంతో నిర్దేశించిన టార్గెట్‌ను మ‌రో ఓవ‌ర్ మిగిలి ఉండ‌గానే చెన్నై క‌థ ముగించింది. చెన్నై జ‌ట్టు ఆరంభంలో తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఢిల్లీ జ‌ట్టు పేస‌ర్ బౌల్ట్ ఓపెన‌ర్స్ డుప్లిసిస్, వాట్స‌న్‌ల‌ను అద్భుత‌మైన బౌలింగ్‌తో బెంబేలెత్తించాడు. మూడో బంతికే ర‌నౌట్ కావాల్సి ఉండ‌గా ఫీల్డ‌ర్ల స‌మ‌న్వ‌య లోపంతో అది ద‌క్క‌లేదు. రెండో ఓవ‌ర్ ఇషాంత్ ప‌క‌డ్బందీగా బౌలింగ్ చేశాడు. మెల మెల్ల‌గా కుదురుకున్న ఈ ఓపెన‌ర్స్ ప‌రుగులు తీయ‌డం ప్రారంభించారు. మూడో ఓవ‌ర్ నుండే బ్యాట్ ఝులిపించ‌డం స్టార్ట్ చేయ‌డంతో ప‌రుగులు రావ‌డం మొద‌లైంది.

ఇషాంత్ బౌలింగ్‌లో వ‌రుస‌గా మూడు ఫోర్లు బాదాడు. వాట్స‌న్ పాల్, మిశ్రా బౌలింగ్‌లో ఒక్కో ఫోర్ కొట్ట‌గా..ప‌టేల్ బౌలింగ్‌లో సిక్స‌ర్ దంచాడు. చెన్నై స్కోర్ 10 ఓవ‌ర్లు ముగిసేస‌రికి వికెట్ న‌ష్ట‌పోకుండా 80 ప‌రుగులు చేసింది. డుప్లిసిస్ అవుట్ అయినా..వాట్స‌న్ ఆగ‌లేదు. పాల్ వేసిన ఓవ‌ర్‌లో మూడు సిక్స‌ర్లు, నాలుగు ఫోర్లు కొట్టాడు. ఆ ఒక్క ఓవ‌ర్‌లోనే 25 ప‌రుగులు వ‌చ్చాయి. మిశ్రా బౌలింగ్‌లో సేమ్ షాట్ కొట్ట‌బోయి పెవిలియ‌న్ చేరాడు వాట్స‌న్. రాయుడు, రైనా క‌లిసి జ‌ట్టును గెలుపు బాట‌లో ప‌య‌నించేలా చేశారు. ఢిల్లీ క్యాపిట‌ల్స్ పేరు మార్చుకుని..కొత్త ఆట‌గాళ్ల‌ను చేర్చుకుని అత్యుత్త‌మ‌మైన ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించి క్రికెట్ అభిమానుల ప్రేమ‌ను చూర‌గొంది.

కామెంట్‌లు