గుజ‌రాత్ రైతుల క‌హానీ - దిగొచ్చిన దిగ్గ‌జ కంపెనీ

అమెరికా కార్పొరేట్ డ్రింక్స్ అండ్ ఫుడ్ బేవ‌ర్జీస్ కంపెనీ పెప్సికో గుజ‌రాత్ ఆలుగ‌డ్డ‌ల రైతుల‌పై వేసిన కేసులను ఉప‌సంహ‌రించుకుంది. అంత‌ర్జాతీయంగా, దేశీయంగా విప‌రీత‌మైన ఒత్తిడి రావ‌డం..అది న్యాయ‌స‌మ్మ‌తం కానేకాద‌ని రూఢీ అవ‌డంతో ఈ దిగ్గ‌జ కంపెనీ త‌ల‌వంచ‌క త‌ప్ప‌లేదు. ఒక రకంగా ఇది అన్న‌దాత‌ల నైతిక గెలుపుగా భావించాలి. ఎఫ్‌సీ5 ఆలుగ‌డ్డ‌ల‌ను త‌మ అనుమ‌తి లేకుండా గుజ‌రాత్‌కు చెందిన రైతులు సాగు చేశారంటూ ..వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ యుఎస్ పెప్సికో కంపెనీ కేసు న‌మోదు చేయించింది. దీనిపై పెద్ద దుమారం జ‌రిగింది. మొత్తం తొమ్మిది మంది రైతుల‌పై కేసులు న‌మోదు చేసేలా చేసింది ఈ సంస్థ‌. లేస్ పొటాటో చిప్స్ త‌యారీకి ఇది ఇబ్బందిక‌రంగా ఉంటోందంటూ న‌మోదు చేసిన కేసులో పేర్కొన్నారు. ఈ నెల రెండున న‌మోదు చేసిన కేసుల‌ను ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది పెప్సికో. ఈ పొటాటో వెరైటీని పండించాల‌న్నా లేదా స‌ర‌ఫ‌రా చేయాల‌న్నా, అమ్మాల‌న్నా త‌మ ప‌ర్మిష‌న్ తీసుకోవాల్సిందేన‌ని..ఈ వంగ‌డంపై త‌మ‌కు పేటెంట్ హ‌క్కు ఉందంటూ పెప్సికో లేస్ కంపెనీ సూట్ వేసింది.

ఎఫ్‌సీ5 వంగ‌డాన్ని రైతులు పెద్ద ఎత్తున పండించారు. అవి ప్యాకెట్ల ద్వారా అమ్మే లేస్ ఆలుగ‌డ్డ చిప్స్ త‌యారీకి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. భూమిని న‌మ్ముకుని పంట‌లు పండించే రైతుల‌పై ఇలాంటి కేసులు వేయ‌డాన్ని కేంద్రంలోని భార‌తీయ జ‌న‌తా ప్ర‌భుత్వంతో పాటు ముఖ్యంగా త‌న రాష్ట్రానికి చెందిన వారిని ఇబ్బంది పెట్ట‌డంపై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ సీరియ‌స్ గా తీసుకున్నారు. రాజ‌కీయ వ‌త్తిళ్లు అంత‌టా రావ‌డంతో పెప్సికో కంపెనీ త‌ట్టుకోలేక పోయింది. అన్ని వైపులా రైతుల‌కు మ‌ద్ధ‌తు పెర‌గ‌డం, ప్ర‌భుత్వాల‌తో పాటు ప్ర‌తిప‌క్షాలు, ప్ర‌జా సంఘాలు, రైతు సంఘాలు, మేధావులు, ప్ర‌జాస్వామిక వాదులు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ చ‌ర్య‌ను బేష‌ర‌తుగా ఖండించారు. తాము కేసుల‌ను ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్టు ..పెప్సికో తెలిపింది. ఇది ముమ్మాటికీ గుజ‌రాత్ రైతులు సాధించిన ఘ‌న విజ‌యం ఇది. క‌చ్చితంగా పెప్సికో కంపెనీ త‌మ‌కు క్ష‌మాప‌ణ చెప్పాల్సిందేనంటూ రైతుల త‌ర‌పున వాదించిన లాయ‌ర్ ఆనంద్ యాజ్ఞిక్ స్ప‌ష్టం చేశారు.

భార‌త మాజీ, దివంగ‌త ప్ర‌ధాని పాముల‌ప‌ర్తి న‌ర‌సింహారావు ప్ర‌ధాన‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ప్ర‌మాద‌క‌ర‌మైన సంస్క‌ర‌ణ‌ల‌కు తెర తీశారు. స‌ర‌ళీకృత ఆర్థిక విధానాల పుణ్య‌మా అంటూ దేశ ఆర్థిక రంగం ఒడిదుడుల‌కు లోనైంది. తీవ్ర మైన సంక్షోభం ప్ర‌పంచాన్ని చుట్టిముట్టినా ఇండియా ఒక్క‌టే అన్ని ప్ర‌తికూల‌త‌ల‌ను అధిగ‌మించింది. ఈ క్రెడిట్ అంతా కొద్ది మంది నియంత్రిస్తున్న వ్యాపార వ‌ర్గాలు, వ్యాపార వేత్త‌లు, సంస్థ‌లు, కంపెనీలు , బ్యాంకులు కానే కాదు. కేవ‌లం కోట్లాది మంది భార‌తీయులు క‌ష్ట‌ప‌డి సంపాదించిన దాంట్లో దాచుకున్న డ‌బ్బులే భార‌త్ కుప్ప‌కూలంగా నిల‌బ‌డ‌గలిగింది. ఇదంతా సామాన్యులు సాధించిన విజ‌యం ఇది. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు, బ్యాంకులు, కోఆప‌రేటివ్ సొసైటీలు, సింగిల్ విండోలు, పొదుపు సంఘాలు, ల‌క్ష‌లాది పోస్టాఫీసులు, బీమా సంస్థ‌లు ఇవే అడ్డుగోడ‌లుగా నిల‌బ‌డ్డాయి. దీంతో ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ ఓ వైపు ఒడిదుడుల‌కు లోనైతే..భార‌తదేశం ఒక్క‌టే సంస్థాగ‌త ప‌రంగా నిటారుగా నిల‌బ‌డ్డ‌ది.

ఈ స‌మ‌యంలో అమెరికా, చైనా లాంటి దిగ్గజ దేశాలు భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌లోని గొప్ప‌ద‌నాన్ని గుర్తించాయి. ఇక‌పోతే అమెరికా త‌న కంపెనీల‌ను ప్ర‌పంచ‌మంత‌టా విస్త‌రించేలా చేసింది. అందులో భాగంగానే భార‌తీయ వ్య‌వ‌సాయ రంగాన్ని నిట్ట నిలువునా నాశ‌నం చేసింది. మోన్ శాంటో కంపెనీ విచ్చ‌ల‌విడిగా విత్త‌నాల‌ను స‌ర‌ఫ‌రా చేసింది. రైతుల‌ను నాశ‌నం చేసింది. ఈ విష‌యంపై త‌మ‌కు విదేశీ విత్త‌న సంస్థ‌లు, ఎరువులు, మందుల కంపెనీలు త‌మ‌కు వ‌ద్దే వ‌ద్దంటూ దేశ వ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టారు. అయినా భార‌త పాల‌కులు విదేశీ వ‌త్తిళ్ల‌కు, కంపెనీల తాయిళాల‌కు ఆశ‌ప‌డి వాటిని ఇండియాలో ప్ర‌వేశించేందుకు దారులు తెరిచారు. అయినా నేటి వ‌ర‌కు రైతులు ఒంట‌రిగా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆయా కంపెనీల మోసాల‌ను ఎండ‌గ‌డుతూ దేశంలోని ప‌లు కోర్టుల‌లో ప్ర‌జా ప్ర‌యోజ‌నాల వ్యాజ్యాలను ద‌ర‌ఖాస్తు చేశారు. ఇపుడు అమెరికా కేంద్రంగా ఉంటూ కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్న పెప్సికో కంపెనీ ఇండియాలోని ఓ రాష్ట్రంలో పండించే ఆలుగ‌డ్డ‌ల విష‌యంలో అభ్యంత‌రం చెప్ప‌డం మ‌రింత ఆందోళ‌న క‌లిగించింది. దీనిని తీవ్రంగా ప‌రిగ‌ణించిన ప్ర‌భుత్వం, రైతులు, విప‌క్షాలు ఒక్క‌టి కావ‌డంతో దిగ్గ‌జ కంపెనీ దిగిరాక త‌ప్ప‌లేదు.

కామెంట్‌లు