విరాళాల్లో బీఎస్పీనే టాప్ - మాయావతా మజాకా
దేశంలో కార్పొరేట్ కంపెనీలన్నీ ఏదో ఒక పార్టీకి కొమ్ము కాయడం మామూలే. ఏ పార్టీనైనా కేంద్రంలో కానీ లేదా ఆయా రాష్ట్రాలలో కొలువుతీరితే..ఆయా సంస్థలు, యాజమాన్యాలు ఎన్నికల సందర్భంగా ఆయా పార్టీలకు మామూళ్లు లేదా విరాళాల రూపేణా ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో ఆర్థిక నేరాలు ఎక్కడలేని విధంగా దేశ వ్యాప్తంగా పెరిగాయి. ఒక రకంగా చెప్పాలంటే నేరస్థులు..రాజకీయ నాయకులు..వ్యాపారులు ముగ్గురూ దేశాన్ని నియంత్రించాలని చూస్తున్నారు. ఒకరకంగా పవర్లో ఎవరున్నప్పటికిని వీరు చెప్పిందే శాసనంగా మారుతోంది. దీంతో బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం స్ఫూర్తికి విఘాతం కలుగుతోంది. ఒక పార్టీ గుర్తుతో పోటీ చేయడం. గెలుపొందాక మరో పార్టీలోకి జంప్ కావడం మామూలై పోయింది.
ఆయా పార్టీలకు చెందిన అధినేతలు, చోటా మోటా నాయకులు వ్యాపారస్తులను , కంపెనీలను టార్గెట్ చేయడం ఇటీవలి కాలంలో ఫ్యాషన్ గా మారింది. ఎందుకొచ్చిన తంటా అంటూ వ్యాపారస్తులు తమకు తోచిన రీతిలో మామూళ్లు నెలనెలకు ..ఎన్నికల సమయంలో ఏక మొత్తంలో చెల్లిస్తూ వస్తున్నారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. వ్యక్తులైనా..వ్యవస్థలైనా ఆయా పార్టీలకు విరాళాలు ఇవ్వవచ్చు. కానీ దానికి ఓ లెక్కంటూ వుండాలి. ఏ పార్టీకి ఎన్నెన్ని డబ్బులున్నాయో ..అవి ఎక్కడి నుండి వచ్చాయో పూర్తి వివరాలను నమోదు చేయాల్సిందేనంటూ ఆదేశించింది. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయం పట్ల స్పష్టమైన నియమ నిబంధనలను ..మార్గదర్శకాలను ఇప్పటికే పార్టీలకు అందజేసింది. దీంతో ఎన్నికల వేళ అన్ని గుర్తింపు పొందిన పార్టీలన్నీ తమ అధికారిక వెబ్ సైట్లో ప్రజలకు ..అందరికి తెలిసేలా వివరాలు ఉంచాలని పేర్కొనడంతో ఇవ్వన్నీ ఇపుడు ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరుస్తున్నాయి.
ఈసారి జరుగుతున్న 2019 ఎన్నికల సందర్భంగా ఆయా పార్టీలు ఎన్నికల సంఘానికి నివేదికలు సమర్పించాయి. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆయా పార్టీలకు వచ్చిన విరాళాలు చూస్తే దిమ్మ తిరిగి పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రజలకు సేవలందించాల్సిన ప్రజాప్రతినిధులు తమ ఆస్తులను పెంచుకోవడంలో పూర్తిగా నిమగ్నమయ్యారు. దందాలు, సెటిల్ మెంట్స్, దౌర్జన్యాలు, కేసులు, దాడులకు పాల్పడడం, హత్యలు చేయడం ఇవి పార్టీల నేతలకు వంటబట్టాయి. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు మరీ ఎక్కువై పోయాయి. ఇప్పటికే మొదటి విడత పోలింగ్ దేశంలో పూర్తి కాగా ..దాదాపు 1500 కోట్లకు పైగా ఆయా ప్రాంతాలలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాయి. ఇంకా పట్టుబడని సొమ్ము చాలా ఉంది. సీఇసీ విడుదల చేసిన వివరాల పరంగా చూస్తే..అన్ని పార్టీలకంటే ఎక్కువ విరాళాల రూపేణా బెహన్ జీ కుమారి మాయావతి అధ్యక్షురాలిగా వున్న బహుజన్ సమాజవాది పార్టీ ( బీఎస్పీ ) కి అత్యధికంగా విరాళాలు అందాయి.
ఆ పార్టీ బ్యాంకు బ్యాలెన్స్ చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఆయా బ్యాంకుల్లో జరిపిన లావాదేవీలు..ఫిక్స్ డ్ డిపాజిట్ల రూపేణా ఎన్ని కోట్లు జమ చేశారో వివరాలను సమర్పించాయి. బీఎస్పీ బ్యాంకు బ్యాలెన్స్ ఏకంగా 669 కోట్లకు దాకా చేరుకుంది. ఇదో రికార్డు అనే చెప్పాలి. ఈ ఏడాది ఫిబ్రవరి 25వ తేదీ లోపు సమర్పించిన పార్టీల వరకు చూస్తే బీఎస్పీ టాప్ ఒన్ లో నిలిచింది. ఇన్ని కోట్లు ఎక్కడి నుండి వచ్చాయో ఇంకా తెలియ రాలేదు. ఢిల్లీలోని ఎనిమిది ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ..ఎనిమిది ఖాతాల్లో ఈ డబ్బులు ఉన్నాయని..అవ్వన్నీ ఎఫ్‌డీల రూపంలో ఉన్నాయని బీఎస్పీ ప్రతినిధులు వెల్లడించారు. 2014 లోక్ సభ ఎన్నికల సమయంలో బీఎస్పీ ఖాతాల్లో ఇంత పెద్ద మొత్తంలో నిధులు లేవు. కానీ ఈసారి సీన్ మారింది. ఏకంగా వందల కోట్లు దాటాయి. అప్పుడు కేవలం 95.54 లక్షలు మాత్రమే ఉండింది. బీఎస్పీ అన్ని పార్టీల కంటే ఎక్కువ బ్యాలెన్స్ లు కలిగి ఉందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఉత్తరప్రదేశ్ లోని సమాజ్ వాది పార్టీకి బ్యాంకు ఖాతాల్లో 471 కోట్లు ఉన్నాయి. ఈ పార్టీ రెండో స్థానాన్ని ఆక్రమించింది. కాంగ్రెస్ పార్టీ 196 కోట్లు, టీడీపీ 107 కోట్లు, బీజేపీ 82 కోట్లు, సీపీఎంకు 3 కోట్లు, ఆమ్ ఆద్మి పార్టీకి 3 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో ఉన్నాయని తెలిపాయి. బ్యాంకు బ్యాలెన్స్‌లలో అధికార పార్టీ ఐదో స్థానంలో నిలిచింది. 2017-2018 ఎన్నికల్లో బీజేపీ 1, 027 కోట్ల విరాళాలు సేకరించగా ..ఇందులో 758 కోట్లు ఎన్నికల సందర్భంగా ఖర్చు చేసినట్లు ఈసీకి సమర్పించింది. మొత్తంగా చూస్తే ఆయా పార్టీలకు వచ్చిన విరాళాలను మొత్తంగా లెక్కిస్తే .. అన్ని పార్టీల బ్యాంకు బ్యాలెన్స్‌లలో 1531 కోట్లుగా ఉన్నట్లు తేల్చింది. ఆయా పార్టీలు జనం చేస్తూనే ప్రజల నెత్తిన శఠగోపం పెట్టేందుకు రెడీ అవుతున్నాయి. దేశ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి..ఈ పార్టీలను నిలదీయండి. ఎవరెవరు ఈ విరాళాలను సమర్పించారో పూర్తిగా తెలియ చేస్తే కానీ అసలు విషయం అర్థం కాదు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి