ఆలయాలు క్లోజ్..దర్శనాలు బంద్
కరోనా ఎఫెక్ట్ దెబ్బకు అన్ని రంగాలు విలవిలలాడుతుండగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలన్నీ మూసి వేశారు. ప్రపంచంలోనే అత్యంత ఆదాయం కలిగిన తిరుమలలో దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఈఓ సింఘాల్ ప్రకటించారు. ఈ మేరకు సీఎం జగన్, టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డిలతో చర్చించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. వేలాది మంది ఇప్పటికే వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం ముందస్తుగా బుకింగ్ చేసుకున్నారు. వీరికి కోలుకోలేని షాక్ ఇచ్చింది టీటీడీ. కరోనా వ్యాధి ఊహించని రీతిలో వ్యాప్తి చెందుతుండడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇప్పటికే విద్యా సంస్థలను మూసి వుంచారు. దీనిని దృష్టిలో పెట్టుకున్న ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకున్నాయి. ఎవ్వరూ బయటకు రావద్దని, కనీసం 15 రోజుల పాటు ఇళ్లల్లోనే ఉండాలని సూచించారు.
దీంతో ప్రధాన ఆలయాలు వేములాడ రాజన్న, యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి, భద్రాద్రి రామాలయం, బాసర, ఆలంపూర్, బీచుపల్లి, శ్రీశైలం, తిరుమల తిరుపతి దేవస్థానం, కాణిపాకం, శ్రీశైలం, మహానంది, మంత్రాలయంతో పాటు శ్రీకాళహస్తి , కనకదుర్గ, సింహాచలం, తదితర ఆలయాలన్నీ మూసి వేస్తున్నట్లు ప్రకటించాయి. ఇదిలా ఉండగా నడక దారులను కూడా టీటీడీ మూసి వేయడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీసాల దేవుడిగా పేరొందిన బాలాజీ దేవాలయాన్ని కూడా మూసి వేస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ సౌందర్య రాజన్ ప్రకటించారు. ఈ స్వామిని దర్శించుకుంటే వెంటనే వీసాలు వస్తాయన్న నమ్మకం ఇక్కడి భక్తుల్లో ఎక్కువగా ఉంది. ఉన్న పళంగా కరోనా వైరస్ ను సాకుగా చూపి తీసుకున్న ఈ నిర్ణయంతో కోట్లాది రూపాయల ఆదాయాన్ని ఆలయాలు కోల్పోయే ప్రమాదం ఉంది.
వీటి పైనే ఆధారపడి బతుకుతున్న ఉద్యోగులు, కాంట్రాక్టు సిబ్బంది పై తీవ్ర ప్రభావం ఉంటుంది. ఇంకో వైపు ఉన్నట్టుండి దర్శనాలు బంద్ చేయడంతో కొండపైనే ఉండిపోయిన భక్తులు ఎక్కడికి వెళ్లాలో తెలియక తంటాలు పడ్డారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, దీని వల్ల అసౌకర్యానికి గురైన భక్తులు సహృదయతతో అర్థం చేసుకోవాలని ఆయా ఆలయాల ఈఓలు కోరారు. ఆలయాలతో పాటు వివిధ ప్రార్థనా మందిరాలైన మసీదులు, చర్చీలు, గురుద్వారాలు కూడా మూసి వుంచాలని సూచించాయి ప్రభుత్వాలు. వీటితో పాటు స్కూల్స్, మాల్స్, ఫంక్షన్ హాల్స్ ను కూడా మూసి ఉంచాలని ఎవరైనా తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి. అన్నింటిని రద్దు చేయడం వల్ల భారీగా ఆదాయాన్ని కోల్పోయాయి రైళ్లు, ఆర్టీసీ బస్సులు. ప్రతి రోజూ వేలాది మంది వీటి ద్వారా ఇతర ప్రాంతాలకు, దర్శనీయ స్థలాలకు వెళతారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి