ఇండియాలో హెల్త్ ఎమ‌ర్జెన్సీ


క‌రోనా మ‌హ‌మ్మారి దేశాన్ని ఇబ్బందుల‌కు గురి చేస్తోందంటూ భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌లంతా ఒకే తాటిపై వుంటూ త‌మ‌కు తాము స్వీయ నియంత్ర‌ణ విధించు కోవాల్సిన అవ‌స‌రం ఉందని అన్నారు. ప్ర‌ధాన‌మంత్రి జాతిని ఉద్ధేశించి ప్ర‌సంగించారు. క‌రోనా ప్ర‌భావం ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తుండ‌గా మ‌న దేశాన్ని సైతం విస్మయం చెందేలా చేస్తోంద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రు త‌మ కుటుంబంతో పాటు ప‌రిస‌రాలను సైతం శుభ్రంగా ఉంచుకోవాల‌న్నారు. క‌రోనా వైర‌స్ కు మందు అనేది లేకుండా పోయింది. ఎంతో మంది వైద్యులు, నిపుణులు ఈ మ‌హ‌మ్మారి వ్యాధి నుంచి ర‌క్షించేందుకు రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మిస్తున్నార‌ని చెప్పారు. అంతే కాకుండా ప్ర‌జ‌లంద‌రు ఆరోగ్య ప‌రంగా బాగుండాల‌నే ఉద్దేశంతో ఎప్ప‌టిక‌ప్పుడు వైద్యుల‌తో పాటు సిబ్బంది, పోలీసులు, ప్యారా మిల‌ట‌రీ ద‌ళాలు త‌మ వంతుగా దేశ సేవ‌లో నిమ‌గ్న‌మ‌య్యార‌ని, వీరంద‌రికి మ‌నంద‌రం కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకోవాల్సిన స‌మయం ఆసన్న‌మైంద‌న్నారు.
క‌నీసం వారం రోజుల పాటు దేశంలోని వారంతా త‌మ త‌మ స్థ‌లాల్లోనే ఉండాల‌ని, ఇళ్ల‌ల్లోంచి ఎవ‌రూ బ‌య‌ట‌కు రావ‌ద్దని పీఎం కోరారు. వైద్య ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖా మంత్రులతో పాటు కేంద్ర ప్ర‌భుత్వం ఎప్ప‌టిక‌ప్పుడు క‌రోనా వైర‌స్ వ్యాధి గురించి వాక‌బు చేస్తోంద‌న్నారు. న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు తీసుకునేందుకు ప్ర‌త్యేకంగా క‌మిటీని ఏర్పాటు చేశామ‌ని మోదీ వెల్ల‌డించారు. ముందు జాగ్ర‌త్త‌లు పాటిస్తేనే కొంత మేర‌కు వైర‌స్ నుండి కాపాడుకునేందుకు వీలుంటుంద‌న్నారు. వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా ఉండేందుకు అత్య‌వస‌ర మందులు, వైద్య చికిత్స‌లు అందుబాటులో ఉంచేందుకు చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని చెప్పారు. అంతేకాకుండా ఇప్ప‌టికిప్పుడు హెల్త్ ఎమ‌ర్జెన్సీని ప్ర‌క‌టిస్తున్న‌ట్లు డిక్లేర్ చేశారు. ఇందు కోసం అవ‌స‌ర‌మైన‌న్ని నిధుల‌ను మంజూరు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు ప్ర‌ధాన‌మంత్రి. ఆయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, ఆరోగ్య శాఖాధికారుల సూచ‌న‌లు, స‌ల‌హాలు తీసుకుంటామ‌న్నారు.
గుంపులు గుంపులుగా స‌మూహంగా ఎవ్వ‌రూ బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని సూచించారు. ఎట్టి ప‌రిస్థితుల్లో స్వీయ నియంత్ర‌ణ ఒక్క‌టే మార్గ‌మ‌ని , కొంత కాలం పాటు వేచి చూడ‌ట‌మే త‌ప్పా మ‌రో మార్గం లేద‌న్నారు. మాస్కులు ధ‌రించ‌డం, సాధ్య‌మైనంత వ‌ర‌కు ప‌రిశుభ్ర‌త‌ను పాటించ‌డం, చేతులు ప‌దే ప‌దే క‌డుక్కోవ‌డం, చుట్టూ ఉన్న ప‌రిసరాలు క్లీన్ గా ఉండేలా చూడాల‌న్నారు. కాగా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఇండియాను లాక్ డౌన్ చేయాలంటూ కొంద‌రు వెంచ‌ర్ కేప‌లిస్టులు, స్టార్ట‌ప్ కంపెనీ ఓన‌ర్స్ త‌న‌ను కోరార‌ని ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు. దేశంలోని వివిధ న‌గ‌రాల్లో సెక్ష‌న్ 144 విధించాల‌ని 51 మంది బిజినెస్‌మెన్స్ కోరార‌న్నారు. రోజు రోజుకు క‌రోనా వైర‌స్ కంట్రోల్ కావ‌డం లేద‌ని, ఇది ఇండియానే కాకుండా ప్ర‌పంచంలోని అన్ని దేశాల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తోందంటూ హెచ్చ‌రించారు. దీంతో ప్ర‌పంచ మార్కెట్‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తోంది.  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!