జేఏసీ నిర్ణయం..కార్మికుల ఆగ్రహం
నిన్నటి దాకా హీరోగా వెలుగొందిన ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎక్కువ రోజులు సమ్మె చేసిన చరిత్ర కార్మికులది. ప్రభుత్వంతో ఎలాంటి హామీలు లేకుండానే అర్ధాంతరంగా సమ్మెను విరమిస్తున్నట్లు జేఏసీ ఎలా ప్రకటిస్తుందని పలువురు కార్మికులు ప్రశ్నిస్తున్నారు. సమ్మె విరమణ విషయంలో కార్మిక సంఘాల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినట్టు కనిపిస్తోంది. షరతులు లేకుండా విధుల్లోకి తీసుకుంటే, సమ్మె విరమించేందుకు సిద్ధమని ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, జేఏసీ ప్రకటనపై టీజేఎంయూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమించినా, జేఏసీ-1 సమ్మె విరమించేది లేదని టీజేఎంయూ ప్రధాన కార్యదర్శి హనుమంతు తెలిపారు. సమ్మెలో ఇప్పటి వరకు 29 మంది ఆర్టీసీ కార్మికులు మరణించారని చెప్పారు. మరణించిన కుటుంబాలను ఎవరూ ఆదుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు సమ్మెలో భాగంగా రాష్ట్రంలోని పలు డిపోల పరిధిలో కార్మికులపై కేసులు కూడా నమోదయ్యాయని, వాటిపై ఏం మాట్లాడకుండా సమ్మె విరమిస్తున్నామని జేఏసీ చెప్పడం కార్మికులను మోసం చేయడమేనని మండి పడ్డారు. ఇలా విరమించాలను కున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పుడే సమ్మె విరమిస్తే సరి పోయేదని, కార్మికులను బలి పశువులను చేస్తూ జేఏసీ సమ్మె విరమణ ప్రకటన చేసిందని ఆరోపించారు.
ఆర్టీసీ జేఏసీ కేవలం మూడు కార్మిక సంఘాలను కలుపుకొని మాత్రమే ముందుకు వెళ్తోందన్నారు. జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అసమర్థత వల్లే ఆర్టీసీలో సమస్యలు పేరుకు పోయాయని సంచలన ఆరోపణలు చేశారు. ఆర్టీసీ కార్మికులు చాలా వరకు పేద వాళ్ళు అని, ఆర్టీసీ సంస్థను నిర్వీర్యం చేయకుండా కాపాడాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ తమను పిలిచి కార్మికుల సమస్యల గురించి తెలుసుకోవాలని కోరుతున్నామని అన్నారు. దీనిపై అశ్వత్థామ రెడ్డి ఇంకా స్పందించలేదు. ఇంకో వైపు ప్రభుత్వం మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి