న్వవ్వుల రేడు ఇక రాడు..!

తెలుగు సినిమా రంగం గొప్ప నటుడిని కోల్పోయింది. హాస్య నటుడిగా పేరున్న తెలంగాణకు చెందిన వేణు మాధవ్ ఇక సెలవంటూ వెళ్లి పోయాడు. మొన్నటికి మొన్న ఎమ్మెస్ ను కోల్పోయింది. జనానికి వినోదం పంచుతున్న వాళ్లంతా ఒక్కరొక్కరుగా ఉండలేమంటూ వెళ్లి పోతున్నారు. మొదట మిమిక్రి ఆర్టిస్ట్ గా స్టార్ట్ అయిన జీవితం ఉన్నట్టుండి నటుడిగా సక్సెస్ అయ్యాడు. సూర్యాపేట జిల్లా కోదాడలో 1969 సెప్టెంబరు 28 లో పుట్టారు. 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ కథానాయకుడిగా వచ్చిన సంప్రదాయం సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టి 400లకు పైగా సినిమాల్లో నటించాడు. ఒకటో తరగతి నుంచి డిగ్రీ దాకా మొత్తం తెలుగు మీడియం లోనే చదివాడు. ఇంగ్లీషు పెద్దగా రాదని ఆయనే చెప్పుకునే వారు. వేణుమాధవ్‌కు చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌ అంటే ఇష్టం. ఏ చిన్న సందర్భం వచ్చిన డ్యాన్స్‌ చేసి అందరినీ అలరించేవాడు.

నాలుగో తరగతి నుంచే మిమిక్రీ చెయ్యడం ప్రారంభించాడు. చదువుకునే రోజుల్లోనే ఉపాధ్యాయుల్ని అనుకరించి అందరినీ తెగ నవ్వించే వాడు. అమితాబ్ బచ్చన్, ఎన్టీఆర్ పాటలకు డ్యాన్సు లేయడం, వారిని అనుకరించి మాట్లాడటం మొదలైనవన్నీ చేసేవాడు. వేణు మాధవ్ కు వెంట్రిలాక్విజం మీద ఆసక్తిగా ఉండేది. అదే ఆసక్తితో బాంబే నుంచి ప్రత్యేకంగా రూపొందించిన ఒక బొమ్మ తెచ్చుకున్నాడు. కోదాడలో వెంట్రిలాక్విజాన్ని మొదటిసారి ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో కళాశాల ప్రిన్సిపల్ ని కలిస్తే వార్షికోత్సవానికి వేణు ప్రదర్శన ఏర్పాటు చేశాడు. ఆ కార్యక్రమానికి ఆ ప్రాంతపు అప్పటి శాసన సభ్యులు చందర్ రావు వచ్చారు. ఎంతో ముచ్చటపడి భువనగిరిలో తన పార్టీ మీటింగ్ లో కూడా అలాంటి ప్రదర్శన ఇవ్వమన్నాడు. ఆ మీటింగ్ కి వచ్చిన రాష్ట్ర మాజీ హోం శాఖా మంత్రి  ఎలిమినేటి మాధవ రెడ్డి వేణును వెన్నుతట్టారు.

తన నల్గొండ పార్టీ మీటింగ్ లో కూడా ప్రదర్శన ఇవ్వమన్నాడు. అక్కడికి వచ్చిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చూసి మహానాడులో ప్రదర్శన ఇవ్వమన్నాడు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పాడు. సభ అయి పోయాక దివంగత సీఎం ఎన్టీఆర్ వేణు దగ్గరికి వచ్చి అభినందించారు. మీ సేవలు మాకెంతో అవసరం బ్రదర్ అని చెప్పి వీరిని మనతో పాటే ఉంచండి అని చెప్పాడు. అలా తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ తో వేణు మాధవ్ కు పరిచయమైంది. హిమాయత్‌నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టెలిఫోన్ ఆపరేటర్ గా ఉద్యోగం ఇచ్చారు. ఆర్థిక తోడ్పాటు లేక పోవడంతో వేణు పని చేసేందుకు ఒప్పుకున్నాడు. తనకు అబ్బిన మిమిక్రీ విద్యను వదిలి పెట్టకుండా పలు ప్రదర్శనలు ఇచ్చాడు. ఆఫీసుకు వఛ్ఛే పది కాల్స్ లో తొమ్మిది కాల్స్ వేణుకు వచ్చే వ్యక్తిగత కాల్స్‌గా ఉండేవి.

దీంతో క్రమంగా అన్నగారి కార్యక్రమాలకు అందకుండా పోయేవాడు. దాంతో వాళ్ళు ఇలా కాదని, అసెంబ్లీలోని టీడీఎల్పీ ఆఫీసులో లైబ్రరీ అసిస్టెంటుగా చేర్చారు. తరువాత ఎన్టీఆర్ ఇంట్లో అసిస్టెంట్ గా కూడా కొద్దిరోజులు పనిచేశాడు. ఖాళీ సమయాల్లో ఎదురుగా ఉన్న రవీంద్ర భారతికి వెళ్ళడం అలవాటైంది. ఒకసారి ఆకృతి సంస్థ వాళ్ళు మాటల రచయిత దివాకర్ బాబుకు సన్మానం చేస్తుంటే చూడ్డానికి వెళ్ళి, అందులో వేదికపైన ఒక చిన్న ప్రదర్శన ఇచ్చాడు. వేణుమాధవ్ చేసిన కామెడీ స్కిట్ అతడి జీవితాన్నే మార్చేసింది. వేణు మాధవ్ ఆ కార్యక్రమంలో 'గుల గుల గులాబ్ జామ్' అంటూ చెప్పిన డైలాగ్ ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డిలకు చాలా బాగా నచ్చి సంప్రదాయం సినిమాలో అవకాశం ఇచ్చారు. మిమిక్రీ ప్రోగ్రాంకు 1000 మాత్రమే తీసుకునే వేణుమాధవ్‌కు ఆ సినిమా కోసం 70  వేలు పారితోషికంగా ఇచ్చారు.

నటుడిగా వేణుమాధవ్ తొలి రెమ్యునరేషన్ అదే. ఆ సినిమా పూర్తయిన మూడు రోజులకే ‘శ్రీకారం’లో అవకాశం వచ్చింది. అలా వరుస అవకాశాలతో బిజీ అయిపోయాడు. స్వశక్తితో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తెలుగుతెరపై తిరుగులేని జైత్రయాత్రను కొనసాగించాడు. తొలిప్రేమ సినిమాలో అమ్మాయిల పైన వేణుమాధవ్ చెప్పిన డైలాగు ఆయన్ను ప్రేక్షకులకు చేరువ చేసింది. దిల్ సినిమాతో మంచి పేరు వచ్చింది. 2006 లక్ష్మి సినిమాతో ఉత్తమ హాస్య నటుడిగా నంది అవార్డును అందుకున్నాడు. హంగామా సినిమాతో హీరోగా మారిన వేణుమాధవ్, ప్రేమాభిషేకం సినిమాను నిర్మించాడు. సై, ఛత్రపతి, రుద్రమదేవి, డాక్టర్ పరమానందయ్య, స్టూడెంట్స్ గ్యాంగ్  సినిమాలలో నటించాడు.  తమ్ముడు , ప్రియమైన నీకు, స్టూడెంట్ నెం.1, ఆది,  నువ్వే నువ్వే, దిల్,  సింహాద్రి , వెంకీ, ఆర్య, సాంబ,  గౌరి,  గుడుంబా శంకర్,  ఛత్రపతి, బన్నీ, లక్ష్మి, జై చిరంజీవ, శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్., కృష్ణ, ‘యోగి’ వంటి చిత్రాలు ఆయన్ను కమెడియన్‌గా మరోస్థాయికి తీసుకెళ్లాయి.

భూకైలాష్, ప్రేమాభిషేకం  చిత్రాల్లో వేణు హీరోగా నటించాడు. ఇండస్ట్రీలో వేణుమాధవ్ కి చిరంజీవి, బాలకృష్ణ అంటే ఎంతో గౌరవం. చిరు 150వ సినిమా, బాలయ్య 100వ సినిమా సక్సెస్ అందు కోవాలని వేణుమాధవ్ గుండు కూడా కొట్టించుకున్నాడు. వేణుమాధవ్ తన పుట్టినరోజుకి కేక్ కట్ చేయడం లాంటి ఫార్మాలిటీస్ ని పాటించడు. పరిశ్రమ కొచ్చినప్పట్నుంచీ తన పుట్టిన రోజును అనాథ శరణాలయంలోనే జరుపుకున్నాడు. అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డిల చలవతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఉన్నత స్థాయికి చేరుకున్న వేణుమాధవ్ తన ఇళ్ళకు అచ్చొచ్చిన కృష్ణ నిలయం అని పేరు పెట్టుకున్నాడు. తన అభిమాన నటుడు ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతో అనేక సార్లు తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల్లో ప్రచారం చేశాడు.

2014లో కోదాడ నుంచి పోటీ చేయాలని భావించిన వేణుమాధవ్... ఈ విషయాన్ని టీడీపీ అధినాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడ అసెంబ్లీ స్థానం నుండి గత ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన నామినేషన్ కూడ దాఖలు చేశారు. చివరి నిమిషంలో నామినేషన్ ను ఉపసంహరించు కొన్నారు. అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరమైన వేణుమాధవ్... క్రమంగా రాజకీయాలకు, టీడీపీకి కూడా దూరంగా ఉన్నారు. 20 ఏళ్ల పాటు కొన్ని వందల సినిమాల్లో నటించిన వేణుమాధవ్‌కు రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే కావాలని అనుకున్న తన బలమైన కోరిక తీరకుండానే కన్నుమూశారు. తెలుగు సినిమానే కాదు ఇవ్వాళ తెలంగాణ గొప్ప నటుడిని, మనసున్న కళాకారుడిని కోల్పోయింది. వేణూ ఇక సెలవు..!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!