బ్యాంకుల విలీనం ..ఉద్యోగులు గరం గరం..!
కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ సర్కార్ తీరుపై ఇప్పటికే జనం అసంతృప్తితో వున్నారు. పుండు మీద కారం చల్లినట్లు గతంలో మోడీ తీసుకున్న నోట్ల రద్దు దెబ్బకు భారతీయ ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా కునారిల్లి పోయింది. కోలుకోలేని స్థితికి చేరుకుంది. ఎన్నడూ లేని విధంగా ఆర్థిక వృద్ధి రేటు పడి పోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతోందని ప్రచారం చేసుకుంటున్న సర్కార్, ఆచరణలోకి వచ్చే సరికల్లా అమలు కావడం లేదు. ఇప్పటికే చిరు వ్యాపారాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో కాలయాపన చేస్తున్న ప్రభుత్వం ఈరోజు వరకు ఉద్యోగాల ఊసే ఎత్తడం లేదు.
తాజాగా కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులను విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ...ప్రభుత్వానికి భారీ ఎత్తున నిధులను బదిలీ చేసింది. దీంతో ఇండియన్ ఎకానమీ పరిస్థితి మరింత దిగజారుతోంది. ఇంకో వైపు తమ అనుమతి, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఆర్ధిక మంత్రి బ్యాంకులను విలీనం చేయాలని నిర్ణయం తీసు కోవడంపై ఆయా ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన బాట పట్టారు. ఎట్టి పరిస్థితుల్లో తాము ఒప్పుకోమంటూ బంద్ కు పిలుపునిచ్చారు. బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.
బ్యాంకుల విలీన ప్రకటనను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని వెల్లడించారు. అన్ని బ్యాంకుల యూనియన్లు ఈ సమ్మెలో, బంద్ లో పాల్గొంటాయని తెలిపారు. దీంతో దేశ వ్యాప్తంగా బ్యాంకుల లావాదేవీలు నిలిచి పోతాయి. చిన్న బ్యాంకుల పునాదుల మీద పెద్ద బ్యాంకులను ఏర్పాటు అన్నది పనికిమాలిన చర్య అని అభివర్ణించారు యూనియన్ల నేతలు. కొన్నేళ్ల కిందట అంతర్జాతీయంగా ఏర్పడిన మాంద్యం కోరల్లో చిక్కు కోకుండా ఈ బ్యాంకులే దేశాన్ని కాపాడాయన్న సంగతి మర్చి పోతే ఎలా అని ప్రశ్నించారు. సర్కార్ డెషిషన్ వల్ల బ్యాంకింగ్ రంగం పూర్తిగా బలహీనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేసారు. మొత్తం మీద విత్త మంత్రి మాటలు మంటలు రేపాయి. మరి ప్రభుత్వం ఏరకంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి